All India Medical Sciences
-
సీఎం రావత్‌కు అస్వస్థత, ఎయిమ్స్‌కు తరలింపు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. సీఎంకు ఛాతీలో ఇన్ఫెక్షన్ పెరిగినట్లు ఎయిమ్స్ వర్గాలు నిర్ధారించాయి. కాగా, ఈనెల 18న సీఎం రావత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే, ఆయనకు జ్వరంగా ఉండటంతో ఆదివారం సాయంత్రం డెహ్రాడూన్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నుంచి నేడు ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. ఇక కేబినెట్ భేటీలో పాల్గొన్న మంత్రి సాత్పాల్ మహరాజ్‌కు కరోనా నిర్ధారణ కావడంతో జూన్ 1న ఓసారి క్వారంటైన్‌కు వెళ్లిన సీఎం, తన కార్యాలయంలో పనిచేసే ఓఎస్డీకి కరోనా సోకడంతో ఆగస్టు 26న మరోసారి ఐసోలేషన్‌కు వెళ్లారు. -
సుశాంత్‌ది ఆత్మహత్యే: ఎయిమ్స్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ మెడికల్ బోర్డ్ స్పష్టతనిచ్చింది. ఆయన ఉరివేసుకోవడం వల్లే మరణిం చారని, హత్య కాదని ఎయిమ్స్ ఫోరెన్సిక్ వైద్యుల బృందం ధృవీకరించింది. సుశాంత్ మృతికి విషప్రయోగం, లేదా గొంతు నులిమి చంపడం కారణమన్న వాదనని, ఆరుగురు సభ్యుల ఫోరెన్సిక్ వైద్యుల బృందం తోసిపుచ్చింది. ఇది కచ్చితంగా ఆత్మహత్యేనంటూ తమ నివేదికను సీబీఐకి అందజేసినట్లు ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా చెప్పారు. ఇదే తమ బృందం ఇచ్చే చివరి నివేదిక అని పేర్కొన్నారు. ఉరివేసుకోవడం వల్ల గొంతు దగ్గర రాపిడి తప్ప, సుశాంత్ శరీరంపై గాయాలు లేవని, పెనుగులాటకు సంబంధించిన గుర్తులు లేవని ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ ఛైర్మన్ గుప్తా వెల్లడించారు. -
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
బిహార్: కేంద్ర మాజీ మంత్రి రుఘువంశ్ ప్రసాద్ సింగ్ (74) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఇటీవల కరోనాబారినపడ్డ ఆయన కోలుకున్నారు. అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారం క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. కాగా, ఆర్జేడీ పార్టీలో కీలక నేతగా ఉన్న రఘువంశ్ గురువారమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. (చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీకి భారీ షాక్) -
ఆస్పత్రి నుంచి అమిత్ షా డిశ్చార్జ్
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనాను జయించిన అనంతరం అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. కాగా ఈ నెల 2న అమిత్ షాకు కరోనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనలతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ఆయన.. కరోనా నుంచి కోలుకుని ఆగస్ట్ 14న ఇంటికి వచ్చారు. అయితే ఒళ్లు నొప్పులు, నిస్సత్తువ తగ్గకపోవడంతో ఆగష్టు 18న అమిత్ షా ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. అత్యుత్తమ వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించింది. ఈ క్రమంలో ఆయనను ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.(చదవండి: ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు) -
కరోనా మహమ్మారి ముమ్మర దశకు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇంకా ముమ్మర దశకు చేరుకోలేదని ఎయిమ్స్ డైరెక్ట్రర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. వివిధ రాష్ట్రాల్లో భిన్న సమయాల్లో మహమ్మారి ముమ్మర దశకు చేరుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. లాక్డౌన్ విజయవంతమైనా కరోనా వైరస్ కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో ఉపకరించలేదని అన్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా కేసుల సంఖ్య పెరుగుతుందని, మన జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ఇతర ఐరోపా దేశాల పరిస్ధితితో పోల్చలేమని స్పష్టం చేశారు. యూరప్‌లో రెండు మూడు దేశాల జనాభాను కలిపినా మన జనాభా అధికమని గుర్తుచేశారు. ఆయా దేశాలతో పోలిస్తే మన వద్ద మరణాల రేటు చాలా తక్కువని అన్నారు. కరోనా హాట్‌స్పాట్స్‌గా మారిన ఢిల్లీ, ముంబై నగరాల్లో సమూహ వ్యాప్తికి అవకాశం ఉందన్నారు. కరోనా వైరస్ సోకి స్వల్ప లక్షణాలున్నవారు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని, వారికి ఎలాంటి చికిత్స అవసరం లేదని, ఇంటి వద్దే కోలుకోవచ్చని చెప్పారు. తీవ్ర లక్షణాలున్నవారికి ఆస్పత్రిలో బెడ్స్‌ను అందుబాటులో ఉంచేందుకు లక్షణాలు లేని రోగులు ఇంటి దగ్గరే చికిత్స తీసుకోవాలని సూచించారు. లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయడం అవసరం లేదని ఆయన చెప్పారు. చదవండి : ఒక్కరోజే 206 కేసులు.. -
కోవిడ్-19 : ఎయిమ్స్ సీనియర్ ఉద్యోగి మృతి
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఎయిమ్స్ శానిటేషన్ సూపర్వైజర్ (58) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులు తెలిపారు. ఎయిమ్స్ ఓపీ విభాగంలో పనిచేసే సీనియర్ ఉద్యోగి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని చెప్పారు. దేశ సేవలో మరో కరోనా యోధుడు ప్రాణాలు కోల్పోయారని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ రాజ్‌కుమార్ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి అత్యంత ప్రమాదకర వైరస్ అని, విస్తృతంగా వ్యాపిస్తూ ఏ ఒక్కరిని విడిచిపెట్టదని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిలో హైరిస్క్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ విధిగా కరోనా టెస్ట్‌లు నిర్వహించాలని ఎయిమ్స్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కుల్దీప్ ధిగాన్ డిమాండ్ చేశారు. శానిటేషన్ సూపర్వైజర్కు చివరి దశలో వైరస్‌ను గుర్తించే పరీక్ష చేయడంతో ఆయన ప్రాణాలకు ముప్పువాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా గత వారం ఎయిమ్స్ మెస్‌లో పనిచేసే ఓ కార్మికుడు కోవిడ్-19తో మరణించారు. -
మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత!
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు.ఢిల్లీలోని తన నివాసంలో ఉండగా, ఆదివారం రాత్రి 8.45 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో, హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించారు. వెంటనే వైద్యులు, హృద్రోగ విభాగంలో చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. మన్మోహన్ సింగ్ కార్డియో థొరాసిక్ విభాగం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన అవయవాలన్నీ సరిగానే పనిచేస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2009లో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. ఆర్థికవేత్తగా ప్రఖ్యాతిగాంచిన మన్మోహన్ యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా దేశానికి సేవలందించారు. మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు ట్వీట్ చేశారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. (చదవండి: రైలు ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్) Delhi: Former Prime Minister Dr Manmohan Singh has been admitted to All India Institute of Medical Sciences (AIIMS) after complaining about chest pain (File pic) pic.twitter.com/a38ajJDNQP — ANI (@ANI) May 10, 2020 -
కోవిడ్-19 : అధిక మరణాలు అందుకే..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సోకిన వారిని న్యూనతకు గురిచేసే పరిస్థితి ఆందోళనకరమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులెరియా అన్నారు. కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగులను అనుమానాస్పదంగా చూస్తూ వారిపై అపరాధ ముద్ర వేస్తున్నారని ఇది రోగులు, వారి కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు కలిగిస్తోందని అన్నారు. తమపై సమాజం ఎలాంటి ముద్ర వేస్తుందో అనే భయంతో చాలామంది కోవిడ్-19 లక్షణాలు కలిగిన రోగులు ఆస్పత్రులను సంప్రదించకపోవడంతో అది మరణాలకు దారితీస్తోందని అన్నారు. పాజిటివ్ రోగులు చివరి దశలో ఆస్పత్రులకు వస్తుండటంతో మరణాల రేటు పెరుగుతోందని వివరించారు. వీరిలో 95 శాతం మందికి ఆక్సిజన్ చికిత్సతో నయమవుతుందని, కేవలం 5 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్లపై చికిత్స అవసరమవుతుందని అన్నారు. వైద్యులను సంప్రదించడంలో జాప్యం నెలకొనడంతో వ్యాధిని సకాలంలో గుర్తించలేక అధిక మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్ గులెరియా అన్నారు. కోవిడ్-19 రోగులను, వారి కుటుంబ సభ్యులపై అపరాధ ముద్రను వేయడం కంటే వారి పట్ల మనం సానుభూతి చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. చదవండి : కరోనాపై పోరు: డాక్టర్ కన్నీటిపర్యంతం పెద్దసంఖ్యలో ప్రజలు పరీక్షలకు తరలివచ్చేలా కోవిడ్-19 రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కరోనా వైరస్ సోకిన వారిలో 90 నుంచి 95 శాతం మంది సులభంగానే కోలుకునే అవకాశం ఉన్నందున ఇది ప్రాణాంతక వైరస్ కాదని, కానీ ఎవరేమనుకుంటారో అనే భయంతో దీన్ని గుర్తించడంలో జాప్యంతో రోగుల్లో అధిక మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. -
హమ్మయ్య.. ఆమె క్షేమంగా ఉంది
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలు కోలుకుంటోందని, ప్రాణాపాయం లేదని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఆమెను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు జూలై 28న ఢీనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు బంధువులు మరణించగా, బాధితురాలు, ఆమె లాయర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆమెను ఇటీవల లక్నో ఆసుపత్రి నుంచి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ సోమవారం బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసింది. ఆమె లాయర్ ఇంకా కోలుకోకపోవడంతో అతడి వాంగూల్మాన్ని సీబీఐ ఇంకా తీసుకోలేదు. ఈ కేసులో నివేదికను ఈనెల 6న సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించనుంది. బాధితురాలిని, ఆమె లాయర్‌ను రోడ్డు ప్రమాదంలో అంతం చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై యూపీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, ఆయన అనుచరులు 30 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే బాధితురాలు కానీ, కుల్దీప్ సెంగార్ కానీ తనకు తెలియదని ఈ కేసులో పట్టుబడిన ట్రక్కు డ్రైవర్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దీనికి ముందు 2017లో రెండు వేర్వేరు సందర్భాల్లో కుల్దీప్ సెంగార్, ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు అప్పట్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో గత ఏడాది ఏప్రిల్ నుంచి కుల్దీప్ సింగార్ జైలులో ఉన్నారు. అత్యాచార బాధితురాలి తండ్రిని గత ఏడాది ఏప్రిల్ 3న అరెస్టు చేయగా, ఏప్రిల్ 9న జ్యుడిషియల్ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. (చదవండి: 'ఉన్నావ్' నువ్వు తోడుగా) -
ఎయిమ్స్ రాకతో నెలకొన్న ఉత్కంఠ
సాక్షి, యాదాద్రి: జిల్లాలోని బీబీనగర్ మండలం రంగాపురం వద్ద ఏర్పాటు చేసిన ఎయిమ్స్‌లో వైద్యవిద్యా తరగతులు ప్రారంభం కావడంతో నిమ్స్ (నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సేవలపై సందిగ్ధం నెలకొంది. నిమ్స్‌లో ఇప్పటివరకు అందుతూ వచ్చిన ఓపీ సేవలు ఇకముందు కొనసాగుతాయా లేదా అని జిల్లా ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో బీబీనగర్ మండలం రంగాపూర్ వద్ద నిమ్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్స్ ప్రాంగణంలోనే ఎయిమ్స్ ఏర్పాటుకు అంగీకరించారు. ఎయిమ్స్ వంటి జాతీయ స్థాయి ఆరోగ్య కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇక్కడ రోగులకు సేవలందిస్తున్న నిమ్స్ ను ఎక్కడికి తరలిస్తారన్న సందిగ్ధం ఏర్పడింది. 2016లో ఓపీ సేవలు ప్రారంభం.. హైదరాబాద్‌లో గల నిమ్స్‌కు అనుబంధంగా బీబీనగర్‌లో నిమ్స్ ఓపీ సేవలను 2016 మార్చిలో ప్రారంభించారు. మూడేళ్లుగా నిమ్స్ ప్రాంగణంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో రోగులకు ఓపీసేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు లక్ష మంది రోగుల వరకు ఇక్కడ వైద్య పరీక్షలు, సేవలను పొందారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, కార్డియాలజీ, అల్ట్రాసౌండ్, ఈసీజీ, ఫిజియోథెరపీ సేవలను అందుస్తున్నారు. నామమాత్రపు రుసుముతో అందుతున్న సేవలు రోగులకు ఎంతో ఉపయోగ కరంగా ఉన్నాయి. నిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధమైన త రుణంలో ఎయిమ్స్‌ను కేంద్ర ప్రభుత్వం మం జూరు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పనుల ను వెంటనే విరమించుకుంది. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగుల నియామకానికి నోటిఫికేషన్లు జారీ చేసి ఆ తర్వాత వాటిని పక్కన పెట్టింది. అయితే ఇక్కడ ఓపీ సేవలు అందుతున్న క్రమంలోనే పూర్తిసా ్థయి వైద్యం అందించడానికి వసతుల కోసం రూ.10కోట్ల వరకు మంజూరు చేసి ఖర్చు చేశారు. ఈ క్రమంలోనే ఎయిమ్స్ మంజూరు కావడంతో ఇక ఇక్కడ నిమ్స్ సేవలు అందవేమోనన్న ఆందోళనలో రోగులు ఉన్నారు. అయి తే ఎయిమ్స్ వైద్యసేవలు అందించడానికి మరో ఏడాదికి పైగానే సమయం పట్టే అవకాశం ఉందని ఎయిమ్స్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 50మంది విద్యార్థులతోనే మెడికల్ కళాశాలను ప్రారంభించారు. ఎయిమ్స్ వైద్యం ప్రారంభమయ్యే వరకు నిమ్స్ వైద్యసేవలు కొనసాగించాలని వివిధ రాజకీ య పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిమ్స్ సేవలు కొనసాగుతాయి ఎయిమ్స్ వైద్యకళాశాల ప్రారంభమైనప్పటికీ నిమ్స్‌లో ఓపీసేవలు కొనసాగుతాయి. ఈ మేరకు ఎయిమ్స్ అధికారులు, నిమ్స్ అధికారులతో చర్చించాను. ప్రస్తుతం నిమ్స్‌లో అందుతున్న ఓపీ సేవలు జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఇకముందు కూడా అవి అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం. – అనితారామచంద్రన్, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా -
ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, న్యూడిల్లీ : ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డు సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 34 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్రం చేస్తున్నారు. కాగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆస్పత్రిలో మంటలు వ్యాపించినట్లు సమాచారం. భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో మొదటి అంతస్తులో చికిత్స పొందుతున్న రోగులను మరో చోటుకు తరలించారు. అయితే ఇప్పటివరకు మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇదే ఆస్పత్రిలో బీజేపీ సీనియర్‌నేత అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారని, సహాయక చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
నిరాశే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కేంద్ర బడ్జెట్ జిల్లా ప్రజలకు నిరాశే మిగిల్చింది. జిల్లాలో ఉన్న రెండు పెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం అటు రాజకీయ పక్షాలు, ఇటు ప్రజల్లోనూ చర్చనీయాంశమవుతోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆలిండియా మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ఆస్పత్రి వస్తుందని, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తే జిల్లాలో 2.27లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశించిన ప్రజానీకం ఉసూరుమంది. ఈ బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలపై మిశ్రమ స్పందన వస్తుండగా, జిల్లాకు చెందిన ఈ రెండు ప్రాజెక్టులపై మాత్రం రాజకీయ నాయకులు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ బడ్జెట్‌తో ప్రజానీకానికి పెద్దగా ఒరిగేదేమీ లేదని, పాత సారాను కొత్త సీసాలో పోసి అమ్మినట్టుగానే ఉందని ప్రతిపక్ష పార్టీల నేతలంటున్నారు. వచ్చే ఏడాది అయినా... ఆలిండియా మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)కు ఈ బడ్జెట్లో మోక్షం కలుగుతుందని జిల్లా వాసులు భావించారు. ఈ అంశానికి సంబంధించి ఇటీవల సీఎం కేసీఆర్ జరిపిన పర్యటనతో ప్రాధాన్యం ఏర్పడింది. వాస్తవానికి గతంలో జిల్లాకు మంజూరు చేసిన నిమ్స్ స్థానంలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన సమయంలో చేసిన చట్టంలో పేర్కొన్న ప్రకారం తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేయాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం జిల్లాను ఎంచుకుని గత నెలలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఇతర స్థలాలను కూడా పరిశీలించి మరీ జిల్లాను ఎంపిక చేసినట్టు ప్రకటించింది. దీంతో ఈ బడ్జెట్లో ఎయిమ్స్ ఖాయమని అనుకున్నారంతా. కానీ... కేంద్రం కొత్తగా ప్రకటించిన ఐదు ఎయిమ్స్‌ల్లో తెలంగాణ పేరు లేదు. అయితే, పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను, ఆ సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం కొంత ఉపశమనాన్ని కలిగించింది. వచ్చే ఏడాది అయినా ఎయిమ్స్ ఆసుపత్రి వస్తుందనే ఆశలు కల్పించింది. ఇక, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశం ఎప్పటి నుంచో పరిశీలనలో ఉంది. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం ద్వారా కొత్త రాష్ట్రానికి మేలు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈ అంశం అరుణ్‌జైట్లీ బడ్జెట్ సూట్‌కేసులో లోక్‌సభకు రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి జిల్లాలో సాగవుతుందని భావిస్తున్న 2.27లక్షల ఎకరాలకు సాగునీరు కొంత జాప్యం కానుంది. ఎయిమ్స్ వస్తుందనుకున్నాం : ఎంపీ గుత్తా ఈ బడ్జెట్లో తెలంగాణకు ఎయిమ్స్ ప్రకటిస్తారని అనుకున్నాం. కానీ, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిరాశనే మిగిల్చింది. గతంలో ఉన్న రెండు యూపీఏ ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలనే బడ్జెట్లో కొనసాగించారు తప్ప కొత్తగా చేపట్టిన పథకాలేవీ కనిపించలేదు. గతంలో ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ హోదా కల్పించేందుకు యూపీఏ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇప్పుడు దానిని అధికారికం చేస్తే బాగుండేది.