Allagadda Assembly Constituency
-
అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం.. మహిళపై దాడి
సాక్షి, నంద్యాల: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌లో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే పచ్చ మంద.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఇక, తాజాగా నంద్యాల జిల్లాలో అఖిలప్రియ మద్దతుదారులు మహిళలపై భౌతిక దాడులు చేస్తున్నారు.ఆళ్లగడ్డలో రెడ్ బుక్ రాజ్యాంగంనంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. తాజాగా అఖిలప్రియ వర్గీయులు దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దొంగ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి కబ్జాలు చేస్తున్నారు. తాజాగా ఆళ్లగడ్డకు చెందిన విశ్వనాథం పెద్ద కొండయ్య స్థలాన్ని కబ్జాకు యత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న కొండయ్య కూతురిపై పచ్చ మంద విరుచుకుపడింది. అఖిలప్రియ అనుచరుడు రవి చంద్రారెడ్డి ఆమెను అసభ్యపదజాలంతో తిడుతూ రెచ్చిపోయాడు. ఆమెపై దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. చేయి విరగడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి నుంచి కూటమి ప్రభుత్వం తమను కాపాడాలని వేడుకుంటున్నారు.నా టార్గెట్ వంద మంది: అఖిలప్రియకొన్ని రోజుల క్రితమే తనకు ఓ రెడ్ బుక్ ఉంది అంటూ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ బెదిరింపులకు దిగారు. రానున్న రోజుల్లో ఆళ్లగడ్డలో తన వల్ల 100 మంది ఇబ్బంది పడుబోతున్నారని ఓపెన్‌గా చెప్పారు. వంద మందిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అంతేకాకుండా.. ఆళ్లగడ్డలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను అని ఎప్పుడైనా చెప్పానా?. మేము అధికారంలోకి వస్తే తోలు తీస్తానని ముందే చెప్పాను అంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. నేనేం మంచి దాన్ని కాదు. నేనేమైనా మంచితనం చూపిస్తానని చెప్పానా?. నేను మంచి పద్ధతిలో పోతానని ఎవ్వరూ అనుకోకండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఆళ్లగడ్డలో వంద మంది నా టార్గెట్.. అఖిలప్రియ
సాక్షి, నంద్యాల: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. రెడ్‌బుక్ అంటూ బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రజాపాలన, ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి కేవలం వైఎస్సార్సీపీ నేతలను, అధికారులను టార్గెట్ చేస్తూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాజాగా మీడియాలో బహిరంగంగానే భూమా అఖిలప్రియ.. వార్నింగ్ ఇచ్చారు. రానున్న రోజుల్లో తన వల్ల 100 మంది ఇబ్బంది పడుబోతున్నారని ఓపెన్‌గా చెప్పారు.ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ..‘నాకు ఓ రెడ్ బుక్ ఉంది. అందులో వంద మందికిపైగా వైఎస్సార్సీపీ నాయకుల పేర్లు ఉన్నాయి. పాపం పోనీలే అని ఇద్దరు, ముగ్గురిని వదిలేస్తున్నాను. కానీ, వంద మందిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రానున్న రోజుల్లో వంద మంది కచ్చితంగా ఇబ్బంది పడబోతున్నారు. వారి పేర్లు నా రెడ్ బుక్‌లో ఉన్నాయి అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగారు.అంతేకాకుండా.. ఆళ్లగడ్డలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను అని ఎప్పుడైనా చెప్పానా?. మేము అధికారంలోకి వస్తే తోలు తీస్తానని ముందే చెప్పాను కదా. అదే విధంగా ఎవరినీ వదిలిపెట్టను. అందరి తోలుతీస్తాను. నేనేం మంచి దాన్ని కాదు. నేనేమైనా మంచితనం చూపిస్తానని చెప్పానా?. నేను మంచి పద్ధతిలో పోతానని ఎవ్వరూ అనుకోకండి’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఆమె వ్యాఖ్యలను పలువురు రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. -
అఖిలను పక్కకు పెట్టేసినట్టే..
సాక్షి, నంద్యాల: టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి అఖిలప్రియ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? ఆమె వ్యవహారశైలి బూమరాంగ్ అవుతుందా? సొంత కుటుంబ సభ్యులకే నచ్చడం లేదా? ఆమె ఏకాకిగా మిగిలారా? కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమెకు టికెట్ నిరాకరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారా? అంటే అవుననే జవాబులే వినిపిస్తున్నాయి. బాబు మోసాల ఖాతాలో మరో వికెట్ పడిందని నంద్యాల జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దివంగత భూమా నాగిరెడ్డి కూతురిగా అఖిలప్రియ వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె పార్టీ మారినా భూమా కుటుంబ సభ్యుల్లో అధికశాతం వైఎస్సార్ సీపీకే మద్దతుగా నిలిచారు. దీనికితోడు అఖిలప్రియ భర్త భార్గవరాం నాయుడు వ్యవహార శైలిని అనుచరులతోపాటు కుటుంబ సభ్యులూ తప్పుపట్టారు. అఖిలప్రియకు, ఆమె భర్త భార్గవరాం నాయుడికి భూమా కుటుంబంతో సంబంధం లేదని భూమా కిశోర్ రెడ్డి (అఖిలప్రియ పెదనాన్న కొడుకు) స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులంతా సమావేశమై ఈ ఎన్నికల్లో అఖిలకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని కిశోర్ పేర్కొన్నారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణానంతరం మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి అఖిల వ్యవహార శైలిలో మార్పులు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒంటెత్తు పోకడలకు పోవడంతో బంధువుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. 2019 ఎన్నికల్లో ఓడిన అనంతరం హైదరాబాద్‌కు మకాం మార్చిన తర్వాత దోపిడీ, బెదిరింపులు, కిడ్నాప్ కేసులతో అఖిల తీరు వివాదాస్పదమైంది. బంధువులతోనూ వివాదాలు, ఆస్తి తగాదాలు రావడం, అఖిల భర్త వ్యవహారశైలి వల్ల కుటుంబ సభ్యులు ఆమెతో బంధుత్వం తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అఖిలను పక్కకు పెట్టేసినట్టే.. భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని అఖిలప్రియ దూరం పెట్టారు. గతేడాది నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆళ్లగడ్డలో జరిగినప్పుడు సుబ్బారెడ్డిపై దాడి చేయడం పార్టీలో కలకలం రేపింది. ఈ ఘటన యాత్రపై ప్రభావం చూపడంతో అప్పట్లో బాబు అఖిలను మందలించారని సమాచారం. అయినా ఆమె వ్యవహారశైలిలో మార్పు రాలేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఆమె వల్ల పార్టీ దెబ్బతింటోందని జిల్లా నాయకులు ఇప్పటికే చంద్రబాబుకు వివరించారు. దీంతో ఆళ్లగడ్డ బరి నుంచి ఆమెను తప్పించాలనే నిర్ణయానికి బాబు వచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఆళ్లగడ్డ సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆళ్లగడ్డలో నిర్వహించిన రా.. కదలిరా సభలోనూ టికెట్ విషయం తేల్చకపోవడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గ బాధ్యతల నుంచి అఖిలప్రియ సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించడం.. ఇప్పుడు ఆళ్లగడ్డ టికెట్ అఖిలప్రియకు ఇవ్వరనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబును నమ్మి భూమా కుటుంబం పెద్ద తప్పే చేసిందనే వాదన జిల్లాలో వినిపిస్తోంది. అఖిల కూడా ఈ విషయంపై ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. -
అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నంద్యాల జిల్లా: రాజకీయంగా ఎంతో ప్రతిష్ట కలిగిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వర్గపోరు ముదిరింది. ఈ క్రమంలో అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్ధమని, అఖిలప్రియకు సీటు ఇస్తే సహకరించే ప్రసేక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బా రెడ్డి కుటుంబాల మధ్య వివాదాలు కొనసాగుతోన్న విషయం విదితమే. మరోవైపు, అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని చూస్తున్న టీడీపీ- జనసేన.. వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు, శ్రేణులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్‌పై పెదవి విరుస్తున్నారు. ఇటు బాబుకు సైతం వర్గపోరు, పొత్తుల పొట్లాటతో మళ్లీ పాత కథే పునరావృతమవుతందనే బెంగ పట్టుకుంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఎడమొహం, పెడమొహం పెడుతున్నారు. తాజాగా బాబు చేపట్టిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభ సాక్షిగా టీడీపీ, జనసేన వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంగళవారం జరిగిన ఆళ్లగడ్డ చంద్రబాబు సభకు ముందే టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు సభకు రాకూడదని ఏవీ సుబ్బారెడ్డికి మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: లోకేష్, చంద్రబాబుపై కేశినేని నాని ఆసక్తికర కామెంట్స్ -
మా వల్ల కాదు బాబూ..
సాక్షి, నంద్యాల : రాజకీయంగా ఎంతో ప్రతిష్ట కలిగిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పోటీకి ముందే టీడీపీ చేతులెత్తేస్తోందా? భూమా అఖిల ప్రియ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అల్టీమేటం జారీ చేశారా? తనకే టికెట్ ఇస్తున్నట్లు మంగళవారం నాటి సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారా? మరోవైపు ఆమె ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోయారా? పార్టీ కోసం కనీస ఖర్చులు సైతం పెట్టుకోలేని స్థితికి చేరుకున్నారా? అనుచరులందరూ చేజారి పోతున్నారా? తన విచిత్ర వైఖరితో అందరినీ దూరం చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ స్థానికులు ‘అవును’ అని సమాధానం చెబుతున్నారు. మంగళవారం (నేడు) పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ‘రా కదలిరా’ సభకు ఏర్పాట్ల విషయంలో ఆ పార్టీ వైఖరి తేటతెల్లమైంది. పార్టీ అధ్యక్షుడు వస్తున్నారంటే టికెట్ ఆశిస్తున్న వారు ఎవరైనా జనసమీకరణపైనే దృష్టి పెడతారు. నియోజకవర్గంలో తన బలం చెక్కుచెదరలేదని ఎలాగైనా సరే నిరూపించుకోవడానికి ఎన్ని పాట్లయినా పడతారు. కానీ ఆళ్లగడ్డలో మాత్రం అందుకు విరుద్ద పరిస్థితి కనిపిస్తోంది. నేటి సభకు జన సమీకరణ, ప్రజలకు భోజనాలు, తరలింపు ఏర్పాట్లు.. ఇలా ఏమీ కనిపించడం లేదని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. వాస్తవానికి మంగళవారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభను టీడీపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందితో సభను నిర్వహించి తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. సభ నిర్వహణకు కనీసం రూ.రెండు కోట్లు ఖర్చవుతుందని, ఆమాత్రం ఖర్చుతో ఏర్పాట్లు చేయాలని పార్టీ అధిష్టానం నుంచి సూచనలు అందినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఈ మాత్రం ఖర్చు పెట్టేందుకు కూడా ఆళ్లగడ్డ టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీనమేషాలు లెక్కిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే తనకే టికెట్ ఇస్తామని సభలో ప్రకటించాలని డిమాండ్ చేసినట్లు తెలియవచ్చింది. అఖిల ఆరి్థక పరిస్థితి, ఇతరత్రా విషయాలన్నీ పూర్తిగా తెలుసుకున్న అధిష్టానం అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. ఇలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని, సభ నిర్వహణ అంతా పార్టీనే చూసుకుంటుందని, ఆ మేరకు జన సమీకరణ ఏర్పాట్లు జిల్లాలోని ఇతర టీడీపీ నేతలకు అప్పగించినట్లు ఆ పారీ్టకి చెందిన ఓ నాయకుడు తెలిపారు. జన సమీకరణ ఎలా? సభకు అయ్యే ఖర్చు పెట్టుకోలేనని తెగేసి చెప్పిన అఖిలప్రియ.. మరో వైపు ఎలాగైనా టికెట్ తనే దక్కించుకోవాలని ప్రయాసపడుతోంది. అయితే ఆమెకు సొంత పార్టీ నేతల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతోంది. మరోవైపు తమ నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తరలిస్తే ఆ క్రెడిట్ అంతా అఖిలప్రియకు దక్కుతుందని.. ఇలా చేస్తే మనకేంటి లాభమని టీడీపీ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. సభ విజయవంతమైతే తన వల్లే సభ సక్సెస్ అయ్యిందని.. విఫలమైతే ఆ నెపం తమ మీద వేస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన సమీకరణ బాధ్యత మీదే కదా అని జిల్లాలోని పలువురు టీడీపీ నేతలు నేరుగా అఖిలప్రియను ప్రశి్నంచినట్లు సమాచారం. మరోవైపు ఆళ్లగడ్డ టికెట్ తమకేనంటూ జనసేన నాయకులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. కాగా, ఆళ్లగడ్డ పట్టణంలోని బీబీఆర్ పాఠశాల సమీపంలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్థలాన్ని ఆనుకుని ఉన్న తన స్థలాన్ని పాడు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆళ్లగడ్డ బీజేపీ కన్వినర్ భూమా కిశోర్ రెడ్డి చెబుతున్నారు. మరోవైపు భూమా అఖిలప్రియ భర్త భార్గవరాంతో నియోజకవర్గ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సభ ఖర్చులను పూర్తిగా తమ మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సభ నిర్వహణ గురించి పట్టించుకోకుండా.. సభకు ఏవీ సుబ్బారెడ్డి వస్తే బాగోదంటూ భూమా అఖిలప్రియ హెచ్చరించడం కొసమెరుపు.