ఈ పూలను తినొచ్చు...
పువ్వులు అనగానే నెత్తిలో ధరించేవని గుర్తొస్తుంది. భూ ప్రపంచంలో వేల రకాల పువ్వులు ఉన్నాయి. అయితే ఇవన్నీ అందుబాటులో ఉండక వాటి ఉనికి మనకు తెలియదు. సువాసనలు వెదజల్లుతూ..ఔషధాలలో విరివిగా ఉపయోగిస్తున్న వాటిలో మనకు తెలియని పువ్వులు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని రకాల పువ్వులను కూర వండుకొని కూడా తినవచ్చు. అలాంటి వాటిలో కొన్ని పూల గురించి ఈ రోజు తెలుసుకుందాం...
ఏలియం (ఉల్లి) పుష్పాలు..
ఏలియం కుటుంబంలో ప్రతి పువ్వు తినదగినదే. ఇవి సువాసన వెదజల్లుతూ ఎంతో రుచికరంగా ఉంటాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి, వంటి పదార్ధాల్లో ఉండే సల్ఫర్ వంటి సమ్మేళనాలు ఏలియం పువ్వుల్లో విరివిగా లభిస్తాయి. క్యాన్సర్ నిరోధకత, రక్తపోటు తగ్గించే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉన్నాయి. గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వీటితో తగ్గిపోతాయి.
వయెలెట్స్..
ప్రపంచంలోనే ఈ పువ్వులకు చాలా ప్రత్యేకత ఉంది. చూడడానికి అందంగా ఉండి, మంచి సువాసనలు వెదజల్లుతాయి. వీటిని ఎడారుల్లో తిరిగే వారు పానీయాలుగా ఉపయోగిస్తుంటారు. వాతావరణంలోని గాలి అపరిశుభ్రంగా ఉన్న స్థలాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు దీన్ని వేల సంవత్సరాల కిందటి నుంచే ఔషదాల తయారీకి ఉపయోగిస్తున్నారు. తల నొప్పిగా ఉన్న సమయంలో వీటిని పొడిగా చేసి టీ లో కలుపుకొని తాగితే వెంటనే తగ్గిపోతుంది. తలనొప్పి, గవద బిళ్లలు, దగ్గు, తామర వంటి వాటికి ఔషధాల తయారీలో ఉపయోగిస్తుంటారు.
లావెందర్....
లావెందర్ కూర వండేందుకే ఎక్కువగా ఉపయోగిస్తారు. కొంచెం తీపి, కొంచెం కారంగా ఉండడం వీటి ప్రత్యేకత. అందుకే వీటిని కూర వండకుండా కూడా తింటారు. క్రిమి నిరోధకత, క్రిమినాశక శక్తి ఉండడంతో వీటిని ఔషధాలు తయారీలో వినియోగిస్తున్నారు. ఆతురత, భయం, నిస్పృహ వంటి వాటికి చికిత్సలా ఉపయోగపడుతాయి. దీన్ని మాత్రం గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు తినకూడదు.
దండేలియన్స్...
ఈ పువ్వులు అన్ని చోట్ల విరివిగా లభ్యమవుతాయి. అన్ని కాలాల్లో ఇవి పూయవు. తేనే టీగలు ఈ పువ్వులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటాయి. వీటిని వండకుండా కూడా తినవచ్చు. వీటిలో ప్రతి భాగం తినదగినదే. వీటి వేర్లను దండేలియన్ టీ, కాఫీల్లో ఉపయోగిస్తారు. వీటి ఆకులు చేదుగా ఉంటాయి. కాని ఉడికించి తిన్నప్పుడు మాత్రం తియ్యగా ఉంటాయి. ఈ పువ్వులలోనూ రోగ నిరోధకత శక్తి ఎక్కువగాఉండడంతో ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు.
మింట్ పువ్వులు..
మింట్ అనగానే మనకు చాక్లెట్ గుర్తొస్తుంది. దీని సువాసన ఎంతో మధురంగా ఉంటుంది. అందుకే దీని పేరును చాక్లెట్స్, టీ, పలు వంటకాలకు పెట్టుకున్నారు. దీన్ని కూడా ఔషదాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. జ్వరం, తలనొప్పి వంటి వాటికి ఇది సహజ ఔషధంగా పనిచేస్తుంది. మింట్ టీ కూడా ఒక శక్తివంతమైన రక్తస్రావ నివారిణి. మొటిమలు తొలగించడంలో కూడా ఇది ఉపయోగపడుతోంది. మింట్ పువ్వులను కూర వండకుండా తినవచ్చు. ఎక్కువగా చాక్లెట్ సమ్మేళనంలో మింట్ పువ్వులనుఉపయోగిస్తారు.