amarapuram
-
అరే ఏంట్రాఇది.. ఏకంగా పోలీసు వాహనాన్నే..
సాక్షి, అమరాపురం (సత్యసాయి జిల్లా): ఓ వ్యక్తి ఏకంగా పోలీసు వాహనాన్నే ఎత్తుకెళ్లాడు. చాలా దూరం వెళ్లి ఓ చెట్టును ఢీకొన్నాడు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలిసి అవాక్కయ్యారు. అమరాపురంలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కుందుర్పి మండలం వడ్డేపాళ్యం గ్రామానికి చెందిన రామన్న కుమారుడు నవీన్‌కుమార్ సోమవారం ఉదయం అమరాపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. పరిసరాల్లో నిలిపి ఉంచిన పోలీసు జీపులో తాళం కూడా ఉండడంతో వేసుకుని వెళ్లిపోయాడు. మండలంలోని వలస సమీపంలో ఓ చింతచెట్టుకు ఢీ కొట్టాడు. అక్కడున్న వారు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించగా, వారు వచ్చి నవీన్‌కుమార్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు సదరు వ్యక్తికి మతిస్థిమితం లేదని తెలిపారు. పోలీసులు నవీన్‌కుమార్‌ను తీసుకెళ్లారు. పోలీసు వాహనాన్ని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడన్న విషయం చర్చనీయాంశమైంది. చదవండి: (కారు డ్రైవర్‌కు మద్యం తాగించి.. ఈ జంట చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే) -
వారు తెలుగువారే.. కర్ణాటకలో ఉద్యోగాలు చేస్తుంటారు!
అమరాపురం: వారు తెలుగువారే. అయినా కన్నడ మాట్లాడతారు. కన్నడ మాధ్యమంలో చదువుకుంటారు. కర్ణాటకలో ఉద్యోగాలు చేస్తుంటారు. అంతేనా.. వివాహ, వ్యాపార సంబంధాలు సైతం కన్నడిగులతోనే. రాష్ట్రాలు వేరైనా ఇరు ప్రాంతాల వారూ అన్నదమ్ముల్లా కలసిమెలసి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఆచార, వ్యవహారాలు కూడా ఒకే విధంగా పాటిస్తున్నారు. ఇదీ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉన్న గ్రామాల పరిస్థితి. మడకశిర నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. మడకశిర మినహా మిగిలిన అమరాపురం, అగళి, రొళ్ల, గుడిబండ మండలాల్లో ప్రజల మాతృభాష కన్నడ. ఇంటిలోనే కాదు ప్రభుత్వ కార్యాలయాలు, సమావేశాలు ఎక్కడైనా సరే కన్నడంలోనే మాట్లాడుతారు. అమరాపురం మండల కేంద్రానికి ఏడు కిలో మీర్ల దూరంలో నిద్రగట్ట పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ పరిధిలోని హెచ్బీఎన్ కాలనీ కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉంది. పక్కనే కర్ణాటకలోని లక్కనహళ్లి గ్రామం ఉంది. రాష్ట్రాలు, భాషలు వేరైన ఈ రెండు గ్రామాలకు మధ్యన సరిహద్దుగా రోడ్డు ఉంది. కేవలం మూడు అడుగులే దూరం. రోడ్డుకు ఒకపైపు ఆంధ్రప్రదేశ్.. మరొక వైపు కర్ణాటక రాష్ట్రం ఉంటాయి. నిద్రగట్ట పంచాయతీ పరిధిలో నిద్రగట్ట, ఎన్.గొల్లహట్టి, యర్రగుంటపల్లి, హెచ్బీఎన్ కాలనీలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని విద్యార్థులు కర్ణాటకలోని లక్కనహళ్లి పాఠశాలకు వెళ్లి చదువుకుంటారు. ఆంధ్రప్రదేశ్ వాసులే అయినప్పటికీ వీరి మాతృభాష మాత్రం కన్నడే. తెలుగు పాఠశాలల్లో చదివినా.. అక్కడ వారు మాట్లాడేది కన్నడ భాషే. దీంతో హెచ్బీఎన్కాలనీ, కెంపక్కనహట్టి గ్రామాల్లో రెండు కన్నడ పాఠశాలలు ఉన్నాయి. బెంగళూరు, తుమకూరు, దావణగెర పట్టణాల్లో కూడా మన తెలుగువారు చదువుకుంటున్నారు. శిర, హిరియూరు, తుమకూరు, పావగడ, మధుగిరి, తదితర ప్రాంతాల్లో తమ పిల్లలకు వివాహాలు కుదుర్చుకుంటున్నారు. వ్యాపార, వాణిజ్య సంబంధాలు, స్థలాలు, పొలాలు సైతం రెండు ప్రాంతాల వారివీ అటు – ఇటు కొనసాగుతున్నాయి. అన్నదమ్ముల్లా ఉంటాం రాష్ట్రాలు వేరైనా గ్రామం వేరైనా ఒకేభాష మాట్లాడుకుంటూ అన్నదమ్ములా కలిసిమెలసి ఉంటున్నాం. మాకు రెండు భాషలు వస్తాయి. తెలుగుతో పాటు కన్నడను అనర్గళంగా మాట్లాడుతాము. నా కూతురు కర్ణాటకలోని మైసూరు యూనివర్సిటిలో చదివించా. పిహెచ్డీ చేయించా. మాకు చాలా అనుకూలమైన ప్రాంతం. దీంతో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మూడడుగులు వేస్తే కర్ణాటక లక్కనహళ్లిలో ఉంటాము. రెండు గ్రామాల్లో ఏ శుభకార్యాలు జరిగినా కలిసిమెలసి జరుపుకుంటాం. –రాజన్న, హెచ్బీఎన్ కాలనీ, అమరాపురం మండలం పరస్పర సహకారం మాకు రాష్ట్రాలు అనే భేద భావం లేదు. అన్నదమ్ముల్లా కలసి ఉంటాం. ఆంధ్ర ప్రాంత ప్రజలు మా గ్రామాల్లో పని చేయడానికి కూలికి వస్తారు. మేము పని ఉంటే ఆంధ్రాకు వెళతాం. హెచ్బీఎన్ కాలనీ ప్రజలు తెలుగు, కన్నడ బాగా మాట్లాడుతారు. మాకు తెలుగు రాదు. అయినా అర్థం చేసుకుని కన్నడలో మాట్లాడుతాం. –రవికుమార్, లక్కనహళ్లి, కర్ణాటక రాష్ట్రం సంబంధాలు బలపడుతన్నాయి పొరుగునే కర్ణాటక రాష్ట్రం ఉండడంతో తమ సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఆ రాష్ట్రంలోనే జరుపుతున్నాం. పిల్లల్ని కూడా అక్కడే చదివిస్తున్నాం. పెళ్లిళ్లు ఎక్కువగా కర్ణాటకలోనే చేస్తున్నాం. ఆచార వ్యవహరాలు, భోజనం తదితర అన్నీ ఒక్కటిగానే ఉంటాయి. ఇక్కడ ప్రధాన వంటకం రాగి ముద్ద. –నాగన్న, హెచ్బీఎన్ కాలనీ, అమరాపురం మండలం చక్కగా మాట్లాడుతారు లక్కనహళ్లిలోని కన్నడ పాఠశాలకు నిద్రగట్ట పంచాయతీ నుంచి అధిక మంది విద్యార్థులు వస్తున్నారు. చక్కగా చదువుకుంటున్నారు. నేను కన్నడ బోధిస్తా. మా కన్నడిగుల కంటే తెలుగు ప్రాంత విద్యార్థులకే అధిక మార్కులు వస్తున్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు బెంగళూరు, మైసూరు తదితర ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులుగా స్థిర పడ్డారు. –జయరామ్, కన్నడ టీచర్, లక్కనహళ్లి ఉన్నత పాఠశాల ఏపీలో ఉద్యోగావకాశాలు కల్పించాలి నేను ఒకటో తరగతి నుంచి కన్నడ పాఠశాలలోనే చదువుకున్నా. ప్రస్తుతం సెకెండ్ పీయూసీ చేస్తున్నా. మాకు ఆంద్రప్రదేశ్‌లో ఉద్యోగావకాశాలు వచ్చేలా చూడాలి. నా సొంత మండలం అమరాపురం. అయితే చదువు కర్ణాటకలో ఉండడం వలన మాకు నాన్‌లోకల్‌గా గుర్తిస్తారు. మండలాన్ని బేస్ చేసుకుని లోకల్‌గా పరిగణించాలి. –నయన, విద్యార్థి సెకెండ్ పీయూసీ, యర్రగుంటపల్లి, అమరాపురం మండలం. రెండు భాషలు నేర్చుకోవచ్చు హెచ్బీఎన్ కాలనీ కన్నడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇక్కడ తెలుగు, కన్నడ భాషలు రెండు నేర్చుకోవచ్చు. నాది రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహళ్ మండలం. ఆంధ్ర సర్కారు గడినాడు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలలు నిర్వహించడం మాలాంటి వారికి ఎంతో ఉపయోగం. –సోమశేఖర్, ఉపాధ్యాయుడు, హెచ్బీఎన్ కాలనీ, కన్నడ పాఠశాల ఆంధ్రలో పథకాలు బాగున్నాయి మా రాష్ట్రంలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు పింఛన్ ఇక్కడ రూ.600 ఇస్తారు. అదే హెచ్బీఎన్ కాలనీ మా ఇంటికి ఆరడుగుల దూరంలో ఉంది. అక్కడ నా స్నేహితురాలు నరసమ్మకు పింఛన్ రూ.2250 ఇస్తున్నారు. అంతేకాదు 45 ఏళ్లు నిండిన మహిళలకు రూ.18,750 ఆర్థికసాయం అందిస్తున్నారు. –లక్ష్మక్క, లక్కనహళ్లి కర్ణాటక రాష్ట్రం -
పెద్దల కట్టుబాట్లకు నిండు ప్రాణం బలి
-
అవమాన భారంతో ఆత్మహత్య
కులాంతర ప్రేమ వివాహం పెద్దలకు నచ్చలేదు. అమ్మాయి మెడలో తాళి తెంచేసి ఇద్దరినీ వేరు చేశారు. పరువు పోగొట్టినందుకు పరిహారం చెల్లించాలని పెద్ద మనుషులు పంచాయితీ చేశారు. గడువు ముగియడంతో అమ్మాయి మామ వీరంగం వేశాడు. దుర్భాషలాడుతూ డబ్బు చెల్లిస్తావా.. చస్తావా.. లేక నేనే చంపేయాలా అంటూ బెదిరింపులకు దిగాడు. అంతే యువకుడు మనస్తాపం చెందాడు. అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అమరాపురం: ప్రేమ పెళ్లి పెటాకులై.. పరిహారం డబ్బు కోసం అమ్మాయి తరఫు బంధువు వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన అమరాపురం మండలొ కొర్రేవులో మంగళవారం జరిగింది. మృతుని తండ్రి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొర్రేవులో ఉప్పర రంగనాథ్ ఇంటికి కోడలి వరుసయ్యే యువతి నెలన్నర క్రితం గుడిబండ మండలం నుంచి వచ్చింది. ఈ ఇంటి సమీపంలోనే ఉంటున్న సన్న హనుమంతగౌడ (22)కు ఆ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఊరిలోకి తిరిగి వచ్చారు. కులాలు వేరు కావడంతో ఈ పెళ్లిని రంగనాథ్ ఒప్పుకోలేదు. యువతిని ఇంటికి తీసుకెళ్లి.. ఆమె మెడలోని తాళిబొట్టును తెంచేశాడు. అనంతరం యువతిని స్వగ్రామానికి పంపించేశాడు. పెద్ద మనుషుల ‘పంచాయితీ’ ప్రేమ పెళ్లిని తిరస్కరించిన అనంతరం కొర్రేవులోని పెద్ద మనుషులు ‘పంచాయితీ’ పెట్టారు. సన్నహనుమంతగౌడ రూ.1.4 లక్షలు రంగనాథకు ఇచ్చేలా తీర్మానించారు. ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనుండటంతో మంగళవారం యువకుడి ఇంటివద్దకు రంగనాథ్ వెళ్లాడు. ‘డబ్బు చెల్లిస్తావా.. లేదా చస్తావా.. చావలేకపోతే నేనే చంపేస్తా’ అంటూ బిగ్గరగా అరుస్తూ వీరంగం వేశాడు. మనస్తాపం చెందిన సన్నహనుమంతగౌడ ఎవరికీ చెప్పకుండా తన ఇంటి వద్ద నుంచి బయలుదేరి తన పొలంలోని మామిడి చెట్టుకు ఉరివేసున్నాడు. కేసు నమోదు తన కుమారుడు మృతికి యువతి మామ రంగనాథ్, పెద్దమనుషులు గౌడ హనుమప్ప, నాగరాజు కారణమని సన్నహనుమంతగౌడ తండ్రి బాలక్రిష్ణ ఎస్ఐ దిలీప్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వారి మీద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మడకశిర సీఐ శుభకుమార్ కొర్రేవు గ్రామానికెళ్లి మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
వృద్ధురాలు దారుణహత్య
అమరాపురం : వలస గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున నరసమ్మ అనే వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. నిద్రిస్తున్న ఆమెపై దుండగులు బండరాయిని తలపై వేసి కడతేర్చారు. మడకశిర సీఐ శుభకుమార్, అమరాపురం ఎస్ఐ దిలీప్‌కుమార్, హతురాలి కుమారుడు నరసింహమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసమ్మ (77) భర్త మరియప్ప, ఈరన్న అన్నదమ్ములు. వీరు బతికున్నంతకాలం ఎటువంటి గొడవలు లేకుండా గడిపారు. అన్నదమ్ములు మృతి చెందిన తర్వాత ఆస్తి పంపకాల విషయమై నరసమ్మ కుమారుడు నరసింహమూర్తి, ఈరన్న కుమారులు కెంచప్ప బొప్పన్న, ముద్దరాజులు గొడవ పడేవారు. రస్తా విషయంలో వాదులాడుకునేవారు. సోమవారం నరసింహమూర్తి భార్య మీనాక్షమ్మ, పొలం గట్టుపై వెళుతుంటే తమ గట్టుపై ఎందుకు వెళుతున్నావని ఈరన్న కుమారుడు ముద్దరాజు మందలించాడు. దీంతో ఈ సమస్యను గ్రామ పెద్దలకు వదిలేశారు. భూ వివాదం కేసు 2017 డిసెంబర్ నుంచి కోర్టులో నడుస్తోంది. తెల్లవారుజామున వెలుగులోకి.. సోమవారం రాత్రి యథావిధిగా నరసమ్మ, ఆమె కుమారుడు నరసింహమూర్తి, కోడలు మీనాక్షమ్మ, మనవరాలు నాగమణి, మనవడు బొప్పరాజులు ఇంటి ఆవరణలో పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆవుదూడ అరుస్తున్నా నరసమ్మ లేవలేదు. నరసింహమూర్తి లేచి చూడగా అప్పటికే నరసమ్మ తలపై బండరాయి ఉంది. రాయి తీసి పలకరించినా ఆమెలో ఉలుకూపలుకూ లేదు. ఇరుగుపొరుగు వారి వచ్చి పరిశీలించి మృతిచెందినట్లు గుర్తించారు. సంఘటన స్థలాన్ని సీఐ, ఎస్ఐలు పరిశీలించారు. అనంతపురం నుంచి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి పరిసర ప్రాంతాల్లో ఆధారాల కోసం ప్రయత్నించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. త్వరలోనే హంతకులను పట్టుకుంటాం నరసమ్మను హత్య చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ శుభకుమార్ తెలిపారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
చంద్రబాబు దీక్ష మోసపూరితం
అమరాపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దీక్ష మోసపూరితమని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అభివర్ణించారు. అమరాపురంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు డాక్టర్లను దగ్గర పెట్టుకుని ఏసీల్లో దీక్ష చేయడం రాష్ట్ర ప్రజలు గమనించారన్నారు. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకుని మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి కపట నాటకాన్ని ప్రదర్శిస్తున్నాడన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్ష చేయడానికి రూ.70కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా పోరాడుతున్నారని గుర్తు చేశారు. జాతీయ ప్రాజెక్ట్ పోలవరంను తానే కడతానని రూ.16వేల కోట్ల ప్రాజెక్టును రూ.58,750 కోట్లకు పెంచి నిధులను కొల్లగొట్టి వాటితో 2019 ఎన్నికల్లో ప్రజలను ప్రలోభపెట్టడానికి పూనుకున్నాడని, దీన్ని కేంద్రం పసిగట్టి నిధులివ్వక పోవడంతో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని ఆరోపించారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్యెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చారని విమర్శించారు. అమరాపురంలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఓ టీడీపీ ప్రజాప్రతినిధి స్థానిక చెరువులోని మట్టిని ఇసుకగా మార్చి బెంగళూరుకు తరలించి రూ.లక్షలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వాగేష్, నాయకులు యంజేరప్ప, త్రిలోక్‌నాథ్, హనుమంతరాయుడు, మారుతి, మోహన్, ఇషాక్, తిప్పేస్వామి, శ్రీనివాస్, దివాకర్, మంజునాథ్, నాగరాజు, దానేగౌడ, హిదయతుల్లా, జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి మంజునాథ్ తదితరులు ఉన్నారు. -
ఏటీఎం మాయాజాలం
అమరాపురం(మడకశిర): అమరాపురంలోని సిండికేట్ బ్యాంకు ఏటీఎం మాయాజాలానికి ఖాతాదారుడు నష్టపోయారు. తన ఖాతా నుంచి మంగళవారం రూ.20 వేలు డ్రా చేయగా, రూ.18,500 మాత్రమే నగదు వచ్చిందని నజీర్ అహమ్మద్ అనే ఖాతాదారుడు ఆరోపించారు. వెంటనే విషయాన్ని సిండికేట్ బ్యాంకు మేనేజరును కలసి పరిస్థితిని వివరించినట్లు చెప్పారు. చూస్తానంటూ అతను సాయంత్రం వరకు తనను బ్యాంకులోనే కూర్చోబెట్టుకుని.. ఆ తరువాత ఖాతా సక్రమంగానే ఉందంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరారు. -
నర్సు వైద్యం వికటించి గర్బిణి,శిశువు మృతి
అనంతపురం: జిల్లాలోని మండల కేంద్రం అమరాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ నర్సు అందించిన వైద్యం వల్ల విషాదం నెలకొంది. ఓ గర్భిణికి నర్సు తెలిసి తెలియని వైద్యం అందించింది. అది వికటించింది. దాంతో గర్భిణితోపాటు శిశువు కూడా మృతి చెందింది. దాంతో ఆ మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వారు నిరసనగా ఆందోళన చేస్తున్నా వైద్యాధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.