కులాంతర ప్రేమ వివాహం పెద్దలకు నచ్చలేదు. అమ్మాయి మెడలో తాళి తెంచేసి ఇద్దరినీ వేరు చేశారు. పరువు పోగొట్టినందుకు పరిహారం చెల్లించాలని పెద్ద మనుషులు పంచాయితీ చేశారు. గడువు ముగియడంతో అమ్మాయి మామ వీరంగం వేశాడు. దుర్భాషలాడుతూ డబ్బు చెల్లిస్తావా.. చస్తావా.. లేక నేనే చంపేయాలా అంటూ బెదిరింపులకు దిగాడు. అంతే యువకుడు మనస్తాపం చెందాడు. అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
అమరాపురం: ప్రేమ పెళ్లి పెటాకులై.. పరిహారం డబ్బు కోసం అమ్మాయి తరఫు బంధువు వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన అమరాపురం మండలొ కొర్రేవులో మంగళవారం జరిగింది. మృతుని తండ్రి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొర్రేవులో ఉప్పర రంగనాథ్ ఇంటికి కోడలి వరుసయ్యే యువతి నెలన్నర క్రితం గుడిబండ మండలం నుంచి వచ్చింది. ఈ ఇంటి సమీపంలోనే ఉంటున్న సన్న హనుమంతగౌడ (22)కు ఆ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఊరిలోకి తిరిగి వచ్చారు. కులాలు వేరు కావడంతో ఈ పెళ్లిని రంగనాథ్ ఒప్పుకోలేదు. యువతిని ఇంటికి తీసుకెళ్లి.. ఆమె మెడలోని తాళిబొట్టును తెంచేశాడు. అనంతరం యువతిని స్వగ్రామానికి పంపించేశాడు.
పెద్ద మనుషుల ‘పంచాయితీ’
ప్రేమ పెళ్లిని తిరస్కరించిన అనంతరం కొర్రేవులోని పెద్ద మనుషులు ‘పంచాయితీ’ పెట్టారు. సన్నహనుమంతగౌడ రూ.1.4 లక్షలు రంగనాథకు ఇచ్చేలా తీర్మానించారు. ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనుండటంతో మంగళవారం యువకుడి ఇంటివద్దకు రంగనాథ్ వెళ్లాడు. ‘డబ్బు చెల్లిస్తావా.. లేదా చస్తావా.. చావలేకపోతే నేనే చంపేస్తా’ అంటూ బిగ్గరగా అరుస్తూ వీరంగం వేశాడు. మనస్తాపం చెందిన సన్నహనుమంతగౌడ ఎవరికీ చెప్పకుండా తన ఇంటి వద్ద నుంచి బయలుదేరి తన పొలంలోని మామిడి చెట్టుకు ఉరివేసున్నాడు.
కేసు నమోదు
తన కుమారుడు మృతికి యువతి మామ రంగనాథ్, పెద్దమనుషులు గౌడ హనుమప్ప, నాగరాజు కారణమని సన్నహనుమంతగౌడ తండ్రి బాలక్రిష్ణ ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వారి మీద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మడకశిర సీఐ శుభకుమార్ కొర్రేవు గ్రామానికెళ్లి మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment