హత్యకు గురైన నరసమ్మ
అమరాపురం : వలస గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున నరసమ్మ అనే వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. నిద్రిస్తున్న ఆమెపై దుండగులు బండరాయిని తలపై వేసి కడతేర్చారు. మడకశిర సీఐ శుభకుమార్, అమరాపురం ఎస్‌ఐ దిలీప్‌కుమార్, హతురాలి కుమారుడు నరసింహమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసమ్మ (77) భర్త మరియప్ప, ఈరన్న అన్నదమ్ములు. వీరు బతికున్నంతకాలం ఎటువంటి గొడవలు లేకుండా గడిపారు.
అన్నదమ్ములు మృతి చెందిన తర్వాత ఆస్తి పంపకాల విషయమై నరసమ్మ కుమారుడు నరసింహమూర్తి, ఈరన్న కుమారులు కెంచప్ప బొప్పన్న, ముద్దరాజులు గొడవ పడేవారు. రస్తా విషయంలో వాదులాడుకునేవారు. సోమవారం నరసింహమూర్తి భార్య మీనాక్షమ్మ, పొలం గట్టుపై వెళుతుంటే తమ గట్టుపై ఎందుకు వెళుతున్నావని ఈరన్న కుమారుడు ముద్దరాజు మందలించాడు. దీంతో ఈ సమస్యను గ్రామ పెద్దలకు వదిలేశారు. భూ వివాదం కేసు 2017 డిసెంబర్ నుంచి కోర్టులో నడుస్తోంది.
తెల్లవారుజామున వెలుగులోకి..
సోమవారం రాత్రి యథావిధిగా నరసమ్మ, ఆమె కుమారుడు నరసింహమూర్తి, కోడలు మీనాక్షమ్మ, మనవరాలు నాగమణి, మనవడు బొప్పరాజులు ఇంటి ఆవరణలో పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆవుదూడ అరుస్తున్నా నరసమ్మ లేవలేదు. నరసింహమూర్తి లేచి చూడగా అప్పటికే నరసమ్మ తలపై బండరాయి ఉంది. రాయి తీసి పలకరించినా ఆమెలో ఉలుకూపలుకూ లేదు. ఇరుగుపొరుగు వారి వచ్చి పరిశీలించి మృతిచెందినట్లు గుర్తించారు. సంఘటన స్థలాన్ని సీఐ, ఎస్‌ఐలు పరిశీలించారు. అనంతపురం నుంచి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి పరిసర ప్రాంతాల్లో ఆధారాల కోసం ప్రయత్నించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
త్వరలోనే హంతకులను పట్టుకుంటాం
నరసమ్మను హత్య చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ శుభకుమార్ తెలిపారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment