త్వరలో మరో రెండు ప్లాంట్లు
యాదమరి, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని మోరదానపల్లె వద్ద గల్లా డిజిటల్ వరల్డ్‌లో కొత్తగా రెండు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అమరరాజ సంస్థ ఎండీ గల్లా జయదేవ్ తెలిపారు. డిజిటల్ వరల్డ్‌లో అమరరాజ యూపీఎస్ బ్యాటరీ ప్లాంట్‌ను మంత్రి గల్లా అరుణకుమారి, గల్లా రామచంద్ర నాయుడు, జయదేవ్ ఆదివారం ప్రారంభించారు. రూ. 350 కోట్లతో ఈ యూపీఎస్ బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు జయదేవ్ తెలిపారు.
మరో నెల రోజుల్లో ఉత్పత్తి మొదలవుతుందని, ఏడాదికి 4 మిలియన్ యూ నిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉందని వివరించారు. దీని ద్వారా 1500 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే రూ.350 కోట్లతో ఆటోమోటివ్ బ్యాటరీస్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అక్టోబర్ నుంచి ఉత్పత్తి మొదలవుతుందని, ఏడాదికి 2.5 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తామని ప్రకటించారు.
అలాగే ప్లాస్టిక్, ట్యూబ్లర్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం ఫ్యాక్టరీలు ఏర్పాటైతే సుమారు 30 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మార్కెట్లో తమ సంస్థ బ్యాటరీలకు మంచి డిమాండ్ ఉందన్నారు. లెడ్ రీసైక్లింగ్ ప్లాంట్ పెట్టే ఆలోచనలో ఉన్నామన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన యూపీఎస్ బ్యాటరీల ప్లాంట్ ప్రపంచంలోనే అతి పెద్దదని చెప్పా. మరో ఎండీ గల్లా రామచంద్రనాయుడు మాట్లాడుతూ.. కొత్త ఫ్యాక్టరీల వల్ల జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఉద్యోగస్తుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.