అంబారీ మోసే బాధ్యత అర్జునదే
మైసూరు, న్యూస్‌లైన్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైసూరు దసరా వేడుకల్లో ప్రముఖ ఘట్టమైన జంబూసవారీ వేడుకల్లో పాల్గొననున్న ఏనుగులు బుధవారం మైసూరు నగరానికి ప్రయాణమయ్యాయి. జిల్లాలోని హుణసూరు వద్ద రాచ మర్యాదలు అందుకున్న ఈ ఏనుగులకు, స్వాగత వేడుక లను జిల్లా ఇన్ చార్జ్ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ జ్యోతి వెలిగించి గజరాజుల ప్రయాణాన్ని ప్రారంభించారు. నాగరహోళె అభయారణ్యంలోని ఉన్న హోసహప్రాంతం నుంచి బంగారంతో చేసిన అంబారీని మోసే అర్జున ఈ గజ బృందానికి నేతృత్వం వహించనుంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ... ఈ ఏడాది కూడా అంబారీ మోసే బాధ్యత అర్జునదేనన్నారు. ఈ నెల 30న మైసూరు నగరానికి చేరుకోనున్నాయి. ప్రయాణానికి ముందు ఏనుగులకు ఇష్టమైన వంటకాలు కుడుములు, చెరుకు, ఎలక్కాయలు, బెల్లం, కొబ్బరి తదితర వాటితో చేసిన వంటకాలను వడ్డించారు. శిబిరంలో అర్జున, సరళ, బలరామ, అభిమన్యూ, వరలక్ష్మీ తదితర ఏనుగులు బయల్దేరాయి. నెలన్నరపాటు మైసూరు నగరంలో వీటికి శిక్షణ ఇస్తారు.