15లోపు..దరఖాస్తు చేసుకోండి...
రాజంపేట టౌన్ : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (ఏఓయూ) ద్వారా బీఈడీ అభ్యసించే విద్యార్థులు మే 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి (ఎల్వీకే) తెలిపారు. స్థానిక అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో శుక్రవారం ఎల్వీకే విలేకరులతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదువందల బీఈడీ సీట్లు ఉన్నాయన్నారు. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్లో మరో ఐదువందల సీట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్ష రాసేందుకు ఓసీ విద్యార్థులు డిగ్రీలో యాబైశాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్ కలిగిన విద్యార్థులు డిగ్రీలో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
ప్రవేశ పరీక్ష ఈ ఏడాది జూన్ 6వ తేదీ అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతుందన్నారు. బీఈడీలో ప్రవేశం పొందే విద్యార్థులు నేషనల్ టీచర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎన్సీటీఈ) గుర్తింపు పొందిన డీఎడ్, టీటీసీ, ఈఎల్ఈడీ, తెలుగుపండిట్, హిందీపండిట్ వంటి డిప్లొమా కోర్సులను పూర్తి చేసి ఉండాలని తెలిపారు. ఎన్సీఈటీ గుర్తింపు పొందిన డిప్లొమా సర్టిఫికెట్లు లేని వారు బీఈడీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నా అడ్మిషన్ పొందేందుకు అనర్హులన్నారు. బీఈడీ స్పెషల్æ ఎడ్యుకేషన్లో చేరే విద్యార్థులు 50 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉంటే చాలన్నారు. అయితే ప్రవేశ పరీక్షలో ర్యాంకు తప్పని సరి అన్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు సెమిస్టర్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్లో అంగవైకల్యం ఉన్నవారికి, అంగవైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ ఏడాది ఆగస్టులో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఎల్వీకే తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.