Amit Agarwal
-
వాటిని ఆస్వాదించడంలో హైదరాబాద్ తర్వాతే ఏదైనా: అమిత్ అగర్వాల్
జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై ఆయనో స్టార్.. దేశవ్యాప్తంగా మోడ్రన్ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ట్రెండీ డిజైనర్ అమిత్ అగర్వాల్. నగరం వేదికగా నిర్వహించిన ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొనడానికి ఇటీవల వచ్చిన ఆయన.. గురువారం ‘సాక్షి’తో ముచ్చటించారు. సిటీ అంటే తనకెంతో ఇష్టమని, క్రియేటివిటీ ఉండాలే గాని ఫ్యాషన్ రంగంలో అవకాశాలకు కొదవ లేదని, ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా ఫ్యాషన్ ఔత్సాహికులకు విభిన్నమైన అవకాశాలున్నాయంటున్న అమిత్ ఆలోచనలు. అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి, హైదరాబాద్ ఆస్వాదించడంలో హైదరాబాద్ తర్వాతే.. ►ఫ్యాషన్ అనేది ఒక ప్రాంతానికో, నగరానికో పరిమితమయ్యేది కాదు. సంస్కృతిలో భాగంగా అధునాతన హంగులను ప్రతిబింబిచేది. హైదరాబాద్ వంటి నగరంలో ఫ్యాషన్ ఈ మధ్య వచ్చింది కాదు. ఇక్కడ మొదటి నుంచే అధునాతన జీవన విధానం, ఫ్యాషన్ హంగులకు కేంద్రం. అంతర్జాతీయంగా మారుతున్న మార్పులను ఎప్పటికప్పుడు అవలోకనం చేసుకుంటోంది. కరోనాకు ముందు ఇక్కడ అతిపెద్ద ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నాను. మళ్లీ ఈ మధ్యనే నిర్వహించిన ఫ్యాషన్ షోలో నా డిజైన్స్‌ను ప్రదర్శించాను. ►సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమ, ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా నిర్మాణమవుతున్న సినిమాలు బాలీవుడ్‌కు దీటుగా ఫ్యాషన్ ట్రెండ్లను వాడుకుంటున్నాయి. కొత్త ఐడియాలను ఎప్పటికప్పుడు ఆస్వాదించడంలో నగరం తర్వాతే ఏదైనా. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలను దక్షిణాదిన డబ్ చేసేవారు. ప్రస్తుతం ఇక్కడి సినిమాలు బాలీవుడ్లో రిలీజ్ అవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు, త్రీడీ సినిమాలు అవలీలగా తీసేయడం అభినందనీయం. దక్షిణాదిలో స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి సంస్కృతిని సినిమాల్లో చూపించే విధానం బాగుంటుంది. సౌత్‌లో నిర్మించిన సూపర్ డీలక్స్ చిత్రం నన్నెంతగానో ఆకట్టుకుంది. చదవండి: (హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. జ్యువెలరీ దుకాణంలో భారీ చోరీ) సంస్కృతుల సమ్మేళనమే ‘వైవిధ్యం’.. ►నా జీవితంతో ఫ్యాషన్ విడదీయరాని అనుబంధంగా మారిపోయింది. తక్కువ సమయంలోనే ఫ్యాషన్ నా కెరీర్‌గా నిర్ణయించుకున్నాను. కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి జీవితం సంతృప్తినిచ్చేది ఫ్యాషన్ అనే నమ్ముతాను. డిజైనింగ్‌లో మల్టిఫుల్ కలర్స్ వాడటం ఎంతో ఇష్టం. నా ప్రత్యేకత కూడా. మోల్డింగ్, గ్రిప్పింగ్లో జాగ్రత్తలు తీసుకుంటాను. ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఎవరి ప్రత్యేకత వారిదే. విభిన్నంగా, వినూత్నంగా, సరికొత్తగా డిజైన్లను రూపొందిస్తున్న వారికి అవకాశాలకు కొదవ లేదు. ►కరోనా అనంతరం ఫ్యాషన్ రంగం మరింత అభివృద్ధి చెందింది, అవకాశాలు పెరిగాయి. అధునాతన స్టైల్స్, కలర్ కాంబినేషన్, ఆకట్టుకునే కలర్ మిక్సింగ్ డిజైనర్ భవిష్యత్‌ను నిర్దేషిస్తాయి. ఈ రంగంలో రాణించాలంటే వివిధ ప్రాంతాల సంస్కృతుల సమ్మేళనం, వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో నైపుణ్యం సాధించాలి. అందుకే విభిన్న ప్రాంతాల వేదికలపై అనుభవాన్ని సాధించాలి. అలాంటి వారికి మంచి భవిష్యత్‌తో పాటు అమితమైన ప్రేమ, ఆదరణ లభిస్తుంది. దాని విలువ ఆ స్థాయికి చేరుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది. -
ఎల్ఐసీ అమ్మక పరిమాణం ఓకే
ముంబై: పబ్లిక్ ఇష్యూలో భాగంగా బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను విక్రయించడమే ప్రస్తుత పరిస్థితుల్లో సరైన పరిమాణమని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలోకి ఒక్కసారిగా భారీ పెట్టుబడులు తరలి వచ్చేందుకు వీలుండదని తెలియజేశారు. ప్రస్తుత సమస్యాత్మక మార్కెట్ వాతావరణంలో ఎల్ఐసీ వాటా విక్రయాన్ని రూ. 20,557 కోట్లకు పరిమితం చేయడం సరైన చర్యగా పేర్కొన్నారు. ఎల్ఐసీ ఇష్యూ అందరికీ.. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లకు విలువ చేకూర్చగలదని అభిప్రాయపడ్డారు. వెరసి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూపై అధికారికంగా వివరాలు వెలువడ్డాయి. తొలుత 5 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడ్డ ప్రభుత్వం మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా 3.5 శాతానికి తగ్గించుకుంది. 22.13 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ. 20,557 కోట్లు లభించగలవని భావిస్తోంది. ఇష్యూ మే 4న ప్రారంభమై 9న ముగియనున్నట్లు అంచనా. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 902–949గా నిర్ణయించిన విషయం విదితమే. పాలసీదారులు, ఉద్యోగులు, రిటైలర్లకు ఇష్యూ ధరలో రూ. 60–40 వరకూ రాయితీని ప్రకటించింది. ఎల్ఐసీ.. మే 17న స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. -
అమెజాన్ కు రెండో టెక్నాలజీ హబ్ భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అమెరికా తర్వాత భారత్ తమకు రెండో అతి పెద్ద టెక్నాలజీ హబ్‌గా మారిందని టెక్ దిగ్గజం అమెజాన్ కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. దేశీయంగా తమ సంస్థలో ఇంజినీరింగ్, కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో సుమారు ఒక లక్ష మంది పైగా ప్రొఫెషనల్స్ పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అమెజాన్ ఇండియా కెరియర్ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. ఈ ఏడాది దేశీయంగా 35 నగరాల్లో 8,000 మంది పైచిలుకు ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నట్లు అగర్వాల్ చెప్పారు. -
లిస్టెడ్ సంస్థల చేతిలో 60 శాతం బీమా వ్యాపారం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్ఐసీ కూడా పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకుని లిస్టయితే.. దేశీయంగా బీమా వ్యాపారంలో దాదాపు 60 శాతం వాటా లిస్టెడ్ కంపెనీలదే ఉంటుందని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి అమిత్ అగర్వాల్ తెలిపారు. యాక్చువేరీస్ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ విస్తృతమైన, పటిష్టమైన ఆర్థిక విధానాలతో వర్ధమాన ఎకానమీగా భారత్ వృద్ధి బాటలో ముందుకు సాగుతోందని అగర్వాల్ చెప్పారు. రెండు దశాబ్దాల క్రితం బీమా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఇన్సూరెన్స్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఎనిమిది సంస్థలు ఉండగా.. ప్రస్తుతం వీటి సంఖ్య 69కి చేరిందని వివరించారు. ప్రస్తుతం నాలుగు జీవిత బీమా సంస్థలు, రెండు సాధారణ బీమా సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ రీ–ఇన్సూరెన్స్ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా లిస్టయిన బీమా కంపెనీల్లో ఉన్నాయి. -
చీటింగ్ కేసు: అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌కు కోర్టు సమన్లు
చీటింగ్ కేసుకు సంబంధించి ముంబైకి చెందిన న్యాయవాది అమృత్ పాల్ సింగ్ ఖల్సా దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదులో అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ కు ఉల్హాస్ నగర్ లోని మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. అమృత్ పాల్ సింగ్ మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఉల్హాస్ నగర్ నివాసి. 2019లో అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ తనకు రాకపోవడంతో అతను స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఈ-మెయిల్ ద్వారా విజ్ఞప్తులను చేసినప్పటికీ తను చెల్లించిన మొత్తాన్ని రిఫండ్ చేయలేదని ఆయన తన దరఖాస్తులో పేర్కొన్నారు. ఖల్సా డిసెంబర్ 2019లో 3,999 రూపాయల విలువైన హార్డ్ డ్రైవ్ ను ఆర్డర్ చేశారు. ఈ విషయంపై ఉల్హాస్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులను సంప్రదిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించినట్లు ఖల్సా పేర్కొన్నారు. ఆ తర్వాత ఫిర్యాదుపై విచారణ జరపాలని మేజిస్ట్రేట్ 2021 మార్చిలో ఉల్హాస్ నగర్ పోలీసులను ఆదేశించింది. అయితే, పోలీసులు అగర్వాల్ కు, ఖల్సా ఆర్డర్ చేసిన థర్డ్ పార్టీ విక్రేతలకు సమన్లు పంపినప్పటికీ వారు గైర్హాజరు అయ్యారు. దీంతో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అమెజాన్ ఇండియాకు మరోసారి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 22న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అమెజాన్ ఇండియా, థర్డ్ పార్టీ విక్రేతలకు నోటీసు జారీ చేసిన కూడా అమృత్ పాల్ సింగ్ ముంబైలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. -
మహిళా వర్తకుల ఉత్పత్తులకు ప్రాధాన్యం
ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా దేశంలోని మహిళల నేతృత్వంలోని చిన్న వ్యాపారులకు, వారు తయారు చేసే ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకోసం మహిళా సాధికారిత కోసం పనిచేసే సంస్థ యూఎన్ ఉమెన్‌తో భాగస్వామ్యమైంది. ఇప్పటికే 450 మందికి పైగా మహిళ వ్యాపారస్తులు ఉత్పత్తి చేసిన సుమారు 80 వేలకు పైగా ప్రత్యేక స్టోర్ ఫ్రంట్ ఉత్పత్తులను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇందులో జరిగే ప్రతి లావాదేవీ మీద రూ.25లను దేశంలోని నిరుపేద బాలికల విద్య కోసం కృషి చేస్తున్న ఎన్జీఓ ‘నన్హీ కలీ’కు తమ వంతు బాధ్యతగా విరాళం కింద అందజేస్తున్నామని పేర్కొంది. కరోనా మహమ్మారితో కలిగిన ఆర్ధిక విఘాతంతో మహిళల ఆదిపత్య రంగాలు, చిన్న వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసిందని, మహిళలు జీవనోపాధి కోల్పోయే దశకు చేరిందని అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. మహిళల్లో వ్యవస్థాపకత మెరుగైన ఆర్ధిక ఫలితాలను చూపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అమిత్ అగర్వాల్ చెప్పారు. -
మరో కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై
సాక్షి, ముంబై: రుణ సంక్షోభంతో చిక్కుకుని ప్రస్తుతం కార్యకలాపాలను నిలిపివేసిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరో కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. తాజాగా జెట్ ఎయిర్వేస్ డిప్యూటీ సీఈవో, సీఎఫ్‌వో అమిత్ అగర్వాల్ కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. మే13 నుంచి అమిత్ అగర్వాల్ రాజీనామాను ఆమోదించినట్టు జెట్ ఎయిర్వేస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అమిత్ అగర్వాల్ 2015, డిసెంబరులో జెట్ ఎయిర్వేస్లో చేరారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా 24 ఏళ్ల అనుభవం ఉంది. జెట్ కంటే ముందు సుజ్లాన ఎనర్జీ, ఎస్సార్ స్టీల్ లాంటి పలు సంస్థల్లో సీఎఫ్‌వోగా పనిచేశారు. గత నెల రోజుల కాలంలో నలుగురు కీలక వ్యక్తులు సంస్థను వీడారు. ఇప్పటికే ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజశ్రీ పాతీ, అలాగే మాజీ ఏవియేషన్ సెక్రటరీ, కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నసీం జైదీ రాజీనామా చేశారు. వీరికితోడు ఇటీవల పూర్తి కాలపు డైరెక్టర్ గౌరాంగ్ శెట్టి జెట్ ఎయిర్వేస్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోర్డులో రాబిన్ కామార్క్, అశోక్ చావ్లా, శరద్ మిగిలారు. -
వర్క్ మెయిల్స్‌కు స్పందించకండి : అమెజాన్ చీఫ్
బెంగుళూరు : చాలా మందికి ఆఫీసే జీవితమైపోతుంది. ఇంట్లో కూడా ఆఫీస్ వర్కే. ఎప్పడికప్పుడూ ఈ-మెయిల్స్‌ను, వాట్సాప్‌ను చెక్‌చేసుకుంటూ... ఉన్నతాధికారులు ఏమైనా ఆదేశాలు జారీ చేశారా? అంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. ‘ ప్రస్తుత పరిస్థితంతా ఓ విపత్తులా మారిపోయింది. ఇదో టైమ్ బాంబ్ అని, ఎప్పుడైనా పేలవచ్చు’ అని పలువురు మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంత ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులకు, అమెజాన్ ఇండియా చీఫ్ అమిత్ అగర్వాల్ సంచలనాత్మక కౌన్సిలింగ్ ఇచ్చారు. సాయంత్రం ఆరు నుంచి తెల్లారి ఎనిమిది గంటల వరకు ఈమెయిల్స్‌కు, వర్క్ కాల్స్‌కు స్పందించవద్దని తన కొలిగ్స్‌కు సూచించారు. వర్క్ లైఫ్‌ను వ్యక్తిగత జీవితాన్ని ఎలా సమర్థవంతంగా నిర్వహించుకోవాలనే విషయంపై వీరికి ఈ కౌన్సిలింగ్ చేపట్టినట్టు తెలిసింది. అదేవిధంగా పని ప్రదేశంలో ఎలా క్రమశిక్షణతో ఉండాలో కూడా తెలిపారు. ఈ సూచనలు చేస్తూ అమిత్ అగర్వాల్ తన కొలీగ్స్‌కు ఒక ఈమెయిల్ పంపారు. ఈ ఈ-మెయిల్ ఇప్పుడు సోషల్ నెట్వర్క్ సైట్లలో హాట్ టాఫిక్‌గా మారింది. అగర్వాల్ అమెజాన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్. అగర్వాల్ అంతకముందు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా ఉన్నారు. అగర్వాల్ తన కొలీగ్స్‌కు పంపిన ఈమెయిల్‌పై అమెజాన్ స్పందించడం లేదు. కాగా, టెక్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల పని ఒత్తిడి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంటోంది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను ఇవి పెద్ద ఎత్తున్న హరిస్తున్నాయని వాదన. దేశంలో మూడో అతిపెద్ద నగరమైన బెంగళూరులో ఇది మరీ అధికంగా ఉంది. అర్థరాత్రి సమావేశాలు, వీకెండ్ కాల్స్ వీరిని తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో 25 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండే వారికి గుండె పోటులు ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్ ఎస్ కల్యాణసుందరం చెప్పారు. ఈ రంగంలో గత నాలుగేళ్లలో తానెప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ప్రతి శనివారం అపాయింట్మెంట్లను కేవలం టెక్ వర్కర్లకే కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. కొన్నినెలల ముందే వీరు బుక్ చేసుకుంటున్నారని చెప్పారు. ‘కేవలం ఒక్క జీవితం... అది కూడా పనికే.. ఇది మహా విపత్తు, ఇదో టైమ్ బాంబు, ఎప్పుడైనా పేలవచ్చు’ అని హెచ్చరించారు. తాను రోజులో 14 గంటలు ఆఫీసులోనే ఉంటానని ఓ ఈ-కామర్స్ డేటా అనాలిటిక్స్ స్టార్టప్ వ్యవస్థాపకుడు చెప్పారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లినా.. కాల్స్, ఈమెయిల్స్‌కు స్పందిస్తూ ఉంటానని చెప్పారు. నా కొలిగ్స్ కూడా వెన్ను నొప్పి, ఒత్తిడి, నిద్ర లేమితో బాధపడుతున్నట్టు తెలిపారు. అమెజాన్ అమిత్ అగర్వాల్ ఆలోచన స్ఫూర్తిదాయకంగా ఉందని పలువురంటున్నారు. అయితే అమలు చేయడం కష్టమని చెబుతున్నారు. వర్క్ మెయిల్స్‌ను టర్న్ ఆఫ్ చేయడం వ్యవస్థాపకులకు పెద్ద ఎదురు దెబ్బ అవుతుండవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.