అమెజాన్ ఇండియా చీఫ్ అమిత్ అగర్వాల్
బెంగుళూరు : చాలా మందికి ఆఫీసే జీవితమైపోతుంది. ఇంట్లో కూడా ఆఫీస్ వర్కే. ఎప్పడికప్పుడూ ఈ-మెయిల్స్‌ను, వాట్సాప్‌ను చెక్‌చేసుకుంటూ... ఉన్నతాధికారులు ఏమైనా ఆదేశాలు జారీ చేశారా? అంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. ‘ ప్రస్తుత పరిస్థితంతా ఓ విపత్తులా మారిపోయింది. ఇదో టైమ్ బాంబ్ అని, ఎప్పుడైనా పేలవచ్చు’ అని పలువురు మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంత ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులకు, అమెజాన్ ఇండియా చీఫ్ అమిత్ అగర్వాల్ సంచలనాత్మక కౌన్సిలింగ్ ఇచ్చారు. సాయంత్రం ఆరు నుంచి తెల్లారి ఎనిమిది గంటల వరకు ఈమెయిల్స్‌కు, వర్క్ కాల్స్‌కు స్పందించవద్దని తన కొలిగ్స్‌కు సూచించారు.
వర్క్ లైఫ్‌ను వ్యక్తిగత జీవితాన్ని ఎలా సమర్థవంతంగా నిర్వహించుకోవాలనే విషయంపై వీరికి ఈ కౌన్సిలింగ్ చేపట్టినట్టు తెలిసింది. అదేవిధంగా పని ప్రదేశంలో ఎలా క్రమశిక్షణతో ఉండాలో కూడా తెలిపారు. ఈ సూచనలు చేస్తూ అమిత్ అగర్వాల్ తన కొలీగ్స్‌కు ఒక ఈమెయిల్ పంపారు. ఈ ఈ-మెయిల్ ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్ సైట్లలో హాట్ టాఫిక్‌గా మారింది. అగర్వాల్ అమెజాన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్. అగర్వాల్ అంతకముందు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా ఉన్నారు. అగర్వాల్ తన కొలీగ్స్‌కు పంపిన ఈమెయిల్‌పై అమెజాన్ స్పందించడం లేదు.
కాగా, టెక్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల పని ఒత్తిడి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంటోంది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను ఇవి పెద్ద ఎత్తున్న హరిస్తున్నాయని వాదన. దేశంలో మూడో అతిపెద్ద నగరమైన బెంగళూరులో ఇది మరీ అధికంగా ఉంది. అర్థరాత్రి సమావేశాలు, వీకెండ్ కాల్స్ వీరిని తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో 25 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండే వారికి గుండె పోటులు ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్ ఎస్ కల్యాణసుందరం చెప్పారు. ఈ రంగంలో గత నాలుగేళ్లలో తానెప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ప్రతి శనివారం అపాయింట్‌మెంట్లను కేవలం టెక్ వర్కర్లకే కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. కొన్నినెలల ముందే వీరు బుక్ చేసుకుంటున్నారని చెప్పారు.
‘కేవలం ఒక్క జీవితం... అది కూడా పనికే.. ఇది మహా విపత్తు, ఇదో టైమ్ బాంబు, ఎప్పుడైనా పేలవచ్చు’ అని హెచ్చరించారు. తాను రోజులో 14 గంటలు ఆఫీసులోనే ఉంటానని ఓ ఈ-కామర్స్ డేటా అనాలిటిక్స్ స్టార్టప్ వ్యవస్థాపకుడు చెప్పారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లినా.. కాల్స్, ఈమెయిల్స్‌కు స్పందిస్తూ ఉంటానని చెప్పారు. నా కొలిగ్స్ కూడా వెన్ను నొప్పి, ఒత్తిడి, నిద్ర లేమితో బాధపడుతున్నట్టు తెలిపారు. అమెజాన్ అమిత్ అగర్వాల్ ఆలోచన స్ఫూర్తిదాయకంగా ఉందని పలువురంటున్నారు. అయితే అమలు చేయడం కష్టమని చెబుతున్నారు. వర్క్ మెయిల్స్‌ను టర్న్ ఆఫ్ చేయడం వ్యవస్థాపకులకు పెద్ద ఎదురు దెబ్బ అవుతుండవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment