నాటి ల్యాప్‌టాప్‌లే నేటి ఓట్లయ్యాయి!!
ఐదేళ్ల క్రితం కూడా తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని జయలలిత హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఆమె సీఎం అయిన తర్వాత విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చారు. అలా తీసుకున్నవాళ్లలో చాలామంది ఈసారి ఎన్నికలు వచ్చే సమయానికి తొలిసారి ఓటుహక్కు పొందారు. సహజంగానే, అమ్మకు ఓట్లు వేసేశారు. అవును.. ఈసారి తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకతను సైతం తోసిరాజని జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం వెనుక యువ ఓటర్ల ప్రభావం చాలానే ఉందని చెబుతున్నారు. దానికితోడు ఈసారి కూడా పెళ్లికూతుళ్లకు బంగారు ఆభరణాలు, ప్రతి కుటుంబానికీ ఉచితంగా మొబైల్ ఫోన్లు ఇస్తామని చెప్పడం లాంటివి బాగానే పనిచేశాయి. మరోవైపు ఇప్పటికే అమలుచేస్తున్న అమ్మ క్యాంటీన్లు, 5 రూపాయలకే భోజనం.. ఇలాంటివి కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మీద బాగా పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
వాస్తవానికి అన్నాడీఎంకే తన మేనిఫెస్టోను చాలా ఆలస్యంగా విడుదల చేసింది. అందులో.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పెళ్లికూతుళ్లకు బంగారు ఆభరణాలు ఇస్తామని, ఉద్యోగాలు చేసుకునే మహిళలు మోపెడ్లు కొనుక్కుంటే వారికి 50% సబ్సిడీ ఇస్తామని, మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరు 10, ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడిన ల్యాప్‌టాప్‌లు ఇస్తామని హామీల వర్షం కురిపించారు. అయితే, పట్టణ ప్రాంత ఓటర్లు మాత్రం ఈ ప్రలోభాలకు పెద్దగా లొంగలేదనే చెప్పాలి. ఎందుకంటే చెన్నైలో డీఎంకే 10 స్థానాలు గెలుచుకుంది. ఇలాంటి చోట్ల ఉచిత హామీలు పనిచేయడం కష్టమేనని బ్రాండింగ్ నిపుణుడు డాన్ కవిరాజ్ చెప్పారు. అయితే.. దీర్ఘకాలిక లక్ష్యాల కంటే ఇలాంటి ఉచిత హామీల వల్లే ఓట్లు ఎక్కువగా పడతాయని, వీటివల్ల ఓటర్ల అభిప్రాయాలు మారే అవకాశం కచ్చితంగా ఉంటుందని జేఎన్‌యూలో సెంటర్ ఫర్ పొలిటికల్ సైన్సెస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అజయ్ గొడవర్తి అభిప్రాయపడ్డారు.