నాలుగేళ్ల కోర్సుపై నిరసన వ్యతిరేకోద్యమం ఉధృతం
న్యూఢిల్లీ: ఒకవైపు నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్వైయూపీ)కు ప్రవేశ ప్రక్రియ జరుతుండగా, మరోవైపు ఈ కోర్సు ఉపసంహరణకోసం చేపట్టిన ఉద్యమం మరింత ఊపందుకుంది.ఈ కోర్సు విషయంలో గత సంవత్సరం తటస్థంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూ) ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉత్తర ప్రాంగణంలో శుక్రవారం నుంచి నిరాహార దీక్షకు దిగింది. ఈ విషయమై ఎన్ఎస్యూఐ అధికార ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే దీక్షా శిబిరం వద్ద మీడియాతో మాట్లాడుతూ ‘గత ఏడాది కొత్తగా ఈ కోర్సును ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) ప్రవేశపెట్టింది.
అది ఏవిధంగా ఉంటుందనే విషయం సరిగా అర్ధం కాకపోవడంతో మేము నిరసించడంగానీ మద్దతు పలకడం చేయకుండా ఉండిపోయాం. అయితే ఈ కోర్సును ప్రవేశపెట్టి ఏడాది కాలం గడిచిపోయింది. దీనిపై ఓ అధ్యయనం చేశాం. ఇది విద్యార్థులకు అంత ఉపయుక్తం కాదనే విషయం ఆ అధ్యయనంలో తేలింది. మరోవైపు విద్యార్థులు కూడా ఈ విషయంలో సంతృప్తి చెందడం లేదు’ అని అన్నారు. ఇదిలాఉంచితే ఈ కోర్సుకు వ్యతిరేకంగా కొంతకాలంగా ప్రతిరోజూ ఆందోళనకు దిగుతున్న ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) శుక్రవారం ఉదయం కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించింది.
ఈ విషయమై ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సాకేత్ బహుగుణ మీడియాతో మాట్లాడుతూ ‘డీయూ కోర్సును ప్రారంభించిననాటినుంచీ తాము ఆందోళన చేస్తూనే ఉన్నాం. యూజీసీ అత్యున్నత ప్రాధికార సంస్థ. అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మేము కోరుతున్నాం’ అని అన్నారు. మరోవైపు ఈ కోర్సుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా), ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) సైతం ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి విదతమే. ఇదిలాఉంచితే ‘సేవ్ డీయూ’ పేరిట ఏడాదికాలంగా మరికొంతమంది ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ అంశంపై ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్న అభయ్ దేవ్ అనే విద్యార్థి మాట్లాడుతూ ఈ నెల పదో తేదీన మరోసారి ఆందోళనకు దిగనున్నామన్నారు. ఇటువంటి సత్తాలేని కోర్సుల వల్ల విద్యార్థులు మున్ముందు జీవితంలో బాధితులు కాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆందోళన చేస్తున్నామన్నారు. కాగా ఈ కోర్సు రద్దుపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తి చూపుతున్నట్టు వచ్చిన వార్తలు కూడా ఉద్యమ ఉధృతికి దోహదం చేస్తున్నాయి.