నగరాలకు మంచి రోజులు
ఈ నెల 25న స్మార్ట్ సిటీ, అమృత్ ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ
* 98 వేల కోట్లతో 100 స్మార్ట్ సిటీలు, 500 అమృత్ నగరాల అభివృద్ధి
న్యూఢిల్లీ: పెరుగుపోతున్న జనాభాతో సరైన సౌకర్యాలు లేక అల్లాడుతున్న నగరాల రూపురేఖలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. దీనికోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రూ.98 వేల కోట్లతో స్మార్ట్ సిటీ, అమృత్ ప్రాజెక్టు పథకాలను ఈనెల 25న ప్రారంభించనున్నారు.
ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ రెండు భారీ ప్రాజెక్టుల అమలు కోసం మార్గదర్శకాలనూ మోదీ ప్రకటించనున్నారు. స్మార్ట్ సిటీ కింద 100 నగరాలను, అమృత్ ప్రాజెక్టు కింద 500 నగరాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర కేబినెట్ గతంలోనే ఆమోదం తెలపడం తెలిసిందే. స్మార్ట్ సిటీ, అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) ప్రాజెక్టులను విజ్ఞాన్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, మేయర్ల సమక్షంలో మోదీ ఆవిష్కరిస్తారు.
‘నగరాభివృద్ధిలో జూన్ 25 చాలా ముఖ్యమైన దినం. ఆ రోజు నుంచి కేంద్రం, ఇతర మార్గాల నుంచి భారీగా వచ్చే పెట్టుబడులను సక్రమంగా వినియోగించడం రాష్ర్ట ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు సవాల్‌గా మారనుంది’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పీటీఐతో చెప్పారు.
ఈ రెండు ప్రాజెక్టుల ముఖ్యాంశాలు...
* 100 స్మార్ట్ సిటీలకు రూ.48 వేల కోట్లు, 500 అమృత్ నగరాలకు రూ.50 వేల కోట్లు కేటాయిస్తారు. స్మార్ట్ సిటీల్లో తొలిదశలో 20, రెండో దశలో 40, మూడో దశలో 40 నగరాలను చేపడతారు. ఏ రాష్ట్రంలో ఎన్ని నగరాలను ఎంపిక చేస్తారో, ఎన్ని నిధులను కేటాయిస్తారో 25న మోదీ చెబుతారు.
స్మార్ట్ సిటీ లక్ష్యం: పరిశుభ్ర, ఆహ్లాదకర నగర జీవనం. 24 గంటల నీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, ప్రజారవాణా, పేదలకు అందుబాటు ధరలో ఇళ్లు తదితరాలు.
అమృత్ ప్రాజెక్టు లక్ష్యం: మౌలిక అవసరాలైన నీటిసరఫరా, మురుగునీటి వ్యవస్థ, వరద నీటి ప్రవాహం, రవాణా, పార్కుల అభివృద్ధి, చిన్నారుల అవసరాలను తీర్చడం. జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఉన్న పథకాన్ని మాజీ ప్రధాని వాజ్‌పేయి (అమృత్) పేరుతో తీసుకొస్తున్నారు.