Amrita Roy
-
యువరాజ్‌కు ప్రేరణ కోసమా..
సాక్షి, ముంబై : కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్‌సింగ్, టీవీ యాంకర్ అమృతారాయ్ ప్రేమ విషయంపై శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. సామ్నాలో శనివారం ‘చలా ప్రేమాలా లాగా..!’ అనే శీర్షికతో ప్రచురించిన సంపాదకీయంలో దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రకటనల వీరుడుగా ముద్రపడ్డ దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు ప్రేమవీరుడిగా మారారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాగూ అధికారం దూరమవుతుంది కాబట్టి.. పెద్దగా పని ఉండదని కాబోలు.. కాంగ్రెస్ పెద్దలు కొందరు ఇలా ప్రేమ వ్యవహారాలు ప్రారంభించారేమోనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది నాయకులు ప్రేమ వ్యవహారాల కారణంగా చర్చల్లో నిలుస్తుండడం యువరాజుకి ప్రేరణగా మారుతుందా..? అనే ప్రశ్న అనేక మంది మనసులో మెదులుతోందని రాహుల్ గాంధీకి కూడా చురకలంటించారు. ‘కాంగ్రెస్ నేత ఎన్ డి తివారీ సైతం 90 ఏళ్ల ముదిమి వయసులోనూ తండ్రి కావచ్చని అందరికి తెలిసేలా చేశారు.. పాత ప్రేమవ్యవహారం అంగీకరించి రోహిత్ శర్మకు తానే తండ్రినని అంగీకరించారు.. మరోవైపు దివంగత ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడైన ఆర్ కె ధవన్ కూడా 75 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కారు. శశిథరూర్, ఇటీవల మృతిచెందిన సునందా పుష్కర్ ప్రేమ జంటనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మహారాజు దిగ్విజయ్ సింగ్ ప్రేమ విషయం ప్రజలముందుకు వచ్చింది. ఇలా ప్రేమవ్యవహారం బయటపడిన వారందరిని మరాఠీలో ‘జరఠ్రావ్’ (దేవదాసులు)గా పేర్కొంటాం.. ఈ దేవదాసులందరూ తమ ప్రేమవిషయాలను బయటపెడుతూ ఒకరి తర్వాత ఒకరు పెళ్లిపీటలపెకైక్కుతున్నారు.. అయితే దేశంలోని మోస్ట్ ఎలిజిబల్ బ్యాచ్‌లర్ శ్రీమాన్ రాహుల్‌గాంధీ మాత్రం ఇంకా ప్రేమకోసం వెతుకులాటలోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో దిగ్విజయ్‌సింగ్‌తోపాటు ఇతరులు రాహుల్‌కు ప్రేమవిషయంలో తగిన సల హాలు, సూచనలు చేసి యువరాజు కల్యాణం చేయడంలో తప్పేమీలేదు..’ అని ఎద్దేవా చేశారు. -
'నా వ్యక్తిగత విషయాలపై స్పందించను'
విజయవాడ : తన వ్యక్తిగత విషయాలపై స్పందించనని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పురందేశ్వరిని గౌరవించి పదవులు ఇచ్చిందన్నారు. అదే బీజేపీ ఆమెకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహరావుకు తామేమీ అన్యాయం చేయలేదని దిగ్విజయ్ తెలిపారు. ఆయన అంత్యక్రియలకు స్థలం కేటాయిస్తామన్నా....కుటుంబ సభ్యులే పార్ధీవ దేహాన్ని తీసుకెళ్లారన్నారు. ఆర్ఎస్ఎస్ పరివాహ శక్తులు లౌకిక వాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని దిగ్విజయ్ అన్నారు. నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావాలు గల వ్యక్తి అని ఆయన వ్యాఖ్యలు చేశారు. మోడీకి లౌకిక వాదం అనే పదానికి అర్ధం కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కాగా దిగ్విజయ్ సింగ్, రాజ్యసభ టీవీ వ్యాఖ్యాత అమృతా రాయ్‌ల మధ్య ప్రేమాయణంతో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. -
అమృతా రాయ్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్(67) ప్రేమాయణంతో వెలుగులోకి వచ్చిన రాజ్యసభ టీవీ వ్యాఖ్యాత అమృతా రాయ్(43)తన ఈమెయిల్ ఖాతాను హ్యాక్ చేశారని చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన ఈమెయిల్‌ను హ్యాక్ చేసి, తన గౌరవాన్ని మంటగలిపే సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సమాచార,సాంకేతిక పరిజ్ఞాన(ఐటీ) చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టారు. అమృతతో తనకు సన్నిహిత సంబంధముందని దిగ్విజయ్ బుధవారం ట్విట్టర్లో ప్రకటించడం తెలిసిందే. అమృత, ఆమె భర్త విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, అది పరిష్కారమయ్యాక ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆయన తెలిపారు. -
లేటు వయసులో ఘాటు ప్రేమ
రాజ్యసభ టీవీ వ్యాఖ్యాతతో డిగ్గీ రాజా ప్రేమాయణం! తనకు మహిళా జర్నలిస్టుతో సంబంధముందని దిగ్విజయ్ సంచలన ప్రకటన ఆమె విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానని వెల్లడి సంబంధాన్ని ధ్రువీకరించిన అమృతా రాయ్ న్యూఢిల్లీ: ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్(67) తనకు ఓ మహిళా జర్నలిస్టుతో సన్నిహిత సంబంధముందని సంచలన ప్రకటన చేశారు. రాజ్యసభ టీవీ సీనియర్ వ్యాఖ్యాత అమృతా రాయ్ (43)తో సంబంధముందని, ఆమెను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నానని బుధవారం ట్విట్టర్లో వెల్లడించారు. ‘అమృతా రాయ్‌తో సంబంధముందని ఒప్పుకోవడానికి నేను సంకోచించడం లేదు. ఆమె, ఆమె భర్త ఇప్పటికే పర స్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అది పరిష్కారమయ్యాక మా సంబంధాన్ని చట్టబద్ధం చేసుకుంటాం’ అని పేర్కొన్నారు. అయితే వ్యక్తిగత జీవితంలోకి చొరబడటాన్ని ఖండిస్తానన్నారు. దిగ్విజయ్, రాయ్‌ల సంబంధంపై కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తడంతో ఆయన స్పందించారు. దిగ్విజయ్‌తో తనకు సంబంధముందని రాయ్ కూడా బుధవారం ట్విట్టర్లో అంగీకరించారు. విడాకుల తర్వాత ఆయనను పెళ్లి చేసుకుంటానన్నారు. ‘నేను భర్తతో విడిపోయాను. ఆయన, నేను విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. ఆ తర్వాత దిగ్విజయ్‌ను పెళ్లాడాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు. తన ఈమెయిల్ ఖాతా, కంప్యూటర్ను ఎవరో హ్యాక్ చేసి, వాటిలోని సమాచారాన్ని మార్చారని, ఇది నేరమని, వ్యక్తిగత జీవితంలోకి చొరబడ్డమేనని మండిపడ్డారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తన భార్యను నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్న దిగ్విజయ్ రాయ్‌తో తన సంబంధంపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దిగ్విజయ్ భార్య ఆశా చాలా ఏళ్లు కేన్సర్‌తో బాధపడి గత ఏడాది 58వ ఏట చనిపోయారు. దిగ్విజయ్, ఆశాలకు ఐదుగురు సంతానం. వీరిలో నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. అమృతా రాయ్.. ఆనంద్ ప్రధాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అమృతతో తన వైవాహిక బంధం చాలా కాలం కిందటే ముగిసిందని ఆనంద్ బుధవారం ఫేస్బుక్లో తెలిపారు. అమృతకు ఆమె జీవితానికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ ఉందని, ఆమె బాగుండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. నైతికతకు కొత్త నిర్వచనం: బీజేపీ ఎద్దేవా దిగ్విజయ్ వ్యవహారంపై బీజేపీ నైతిక, చట్టబద్ధ ప్రశ్నలు లేవనెత్తింది. కాంగ్రెస్ నాయకత్వం దీన్ని పట్టించుకోవాలని డిమాండ్ చేసింది. అమృత ఇంకా విడాకులు తీసుకోలేదు కనుక ఈ సంబంధం చట్టప్రకారం శిక్షార్హమని, అయితే దీనిపై చర్య దిశగా స్పందించాల్సింది అమృత భర్తేనని బీజేపీ ప్రతినిధి మీనాక్షి లేఖి అన్నారు. దిగ్విజయ్ నైతికతకు కొత్త నిర్వచనం ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇతరులకు నీతిపాఠాలు వల్లించేవారు ముందు తాము వాటిని పాటిస్తున్నామో లేదో పరిశీలించుకోవాలన్నారు. ఈ అంశంపై స్పందించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్‌ను విలేకరుల కోరగా తనకు ఆ విషయం తెలియదన్నారు. దిగ్విజయ్ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి రాయ్‌ను లొంగదీసుకున్నారా? అని ఆయన వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు తమకు వివాహేతర సంబంధముందని ఒప్పుకోవడం కొత్తేమీ కాదు. సీనియర్ నేత ఎన్డీ తివారీ తదితరులు తమకిలాంటి సంబంధాలున్నాయని అంగీకరించడం తెలిసిందే. మరో నేత అభిషేక్ సింఘ్వీకి కూడా వివాహేతర సంబంధమున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.