లేటు వయసులో ఘాటు ప్రేమ | Digvijay Singh Rajya Sabha TV anchor Amrita Roy At the age of delayed perception of love | Sakshi
Sakshi News home page

లేటు వయసులో ఘాటు ప్రేమ

Published Thu, May 1 2014 2:29 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

లేటు వయసులో ఘాటు ప్రేమ - Sakshi

లేటు వయసులో ఘాటు ప్రేమ

రాజ్యసభ టీవీ వ్యాఖ్యాతతో డిగ్గీ రాజా ప్రేమాయణం!
తనకు మహిళా జర్నలిస్టుతో సంబంధముందని దిగ్విజయ్ సంచలన ప్రకటన
 

ఆమె విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానని వెల్లడి
సంబంధాన్ని ధ్రువీకరించిన అమృతా రాయ్

 
 న్యూఢిల్లీ: ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్(67) తనకు ఓ మహిళా జర్నలిస్టుతో సన్నిహిత సంబంధముందని సంచలన ప్రకటన చేశారు. రాజ్యసభ టీవీ సీనియర్ వ్యాఖ్యాత అమృతా రాయ్ (43)తో సంబంధముందని, ఆమెను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నానని బుధవారం ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘అమృతా రాయ్‌తో సంబంధముందని ఒప్పుకోవడానికి నేను సంకోచించడం లేదు. ఆమె, ఆమె భర్త ఇప్పటికే పర స్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అది పరిష్కారమయ్యాక మా సంబంధాన్ని చట్టబద్ధం చేసుకుంటాం’ అని పేర్కొన్నారు. అయితే వ్యక్తిగత జీవితంలోకి చొరబడటాన్ని ఖండిస్తానన్నారు. దిగ్విజయ్, రాయ్‌ల సంబంధంపై కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తడంతో ఆయన స్పందించారు. దిగ్విజయ్‌తో తనకు సంబంధముందని రాయ్ కూడా బుధవారం ట్విట్టర్‌లో అంగీకరించారు.

విడాకుల తర్వాత ఆయనను పెళ్లి చేసుకుంటానన్నారు. ‘నేను భర్తతో విడిపోయాను. ఆయన, నేను విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. ఆ తర్వాత దిగ్విజయ్‌ను పెళ్లాడాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు. తన ఈమెయిల్ ఖాతా, కంప్యూటర్‌ను ఎవరో హ్యాక్ చేసి, వాటిలోని సమాచారాన్ని మార్చారని, ఇది నేరమని, వ్యక్తిగత జీవితంలోకి చొరబడ్డమేనని మండిపడ్డారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తన భార్యను నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్న దిగ్విజయ్ రాయ్‌తో తన సంబంధంపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
 దిగ్విజయ్ భార్య ఆశా చాలా ఏళ్లు కేన్సర్‌తో బాధపడి గత ఏడాది 58వ ఏట చనిపోయారు. దిగ్విజయ్, ఆశాలకు ఐదుగురు సంతానం. వీరిలో నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. అమృతా రాయ్.. ఆనంద్ ప్రధాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అమృతతో తన వైవాహిక బంధం చాలా కాలం కిందటే ముగిసిందని ఆనంద్ బుధవారం ఫేస్‌బుక్‌లో తెలిపారు. అమృతకు ఆమె జీవితానికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ ఉందని, ఆమె బాగుండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

 నైతికతకు కొత్త నిర్వచనం: బీజేపీ ఎద్దేవా

 దిగ్విజయ్ వ్యవహారంపై బీజేపీ నైతిక, చట్టబద్ధ ప్రశ్నలు లేవనెత్తింది. కాంగ్రెస్ నాయకత్వం దీన్ని పట్టించుకోవాలని డిమాండ్ చేసింది. అమృత ఇంకా విడాకులు తీసుకోలేదు కనుక ఈ సంబంధం చట్టప్రకారం శిక్షార్హమని, అయితే దీనిపై చర్య దిశగా స్పందించాల్సింది అమృత భర్తేనని బీజేపీ ప్రతినిధి మీనాక్షి లేఖి అన్నారు. దిగ్విజయ్ నైతికతకు కొత్త నిర్వచనం ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇతరులకు నీతిపాఠాలు వల్లించేవారు ముందు తాము వాటిని పాటిస్తున్నామో లేదో పరిశీలించుకోవాలన్నారు. ఈ అంశంపై స్పందించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్‌ను విలేకరుల కోరగా తనకు ఆ విషయం తెలియదన్నారు. దిగ్విజయ్ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి రాయ్‌ను లొంగదీసుకున్నారా? అని ఆయన వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు తమకు వివాహేతర సంబంధముందని ఒప్పుకోవడం కొత్తేమీ కాదు. సీనియర్ నేత ఎన్డీ తివారీ తదితరులు తమకిలాంటి సంబంధాలున్నాయని అంగీకరించడం తెలిసిందే. మరో నేత అభిషేక్ సింఘ్వీకి కూడా వివాహేతర సంబంధమున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement