బొగ్గు క్షేత్రాల వేలానికి రంగం సిద్ధం..!
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల తాజా వేలం ప్రక్రియకు తొలి అడుగు పడింది. వచ్చే యేడాది ఫిబ్రవరి 11వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏకపక్షం, చట్ట విరుద్ధంగా పేర్కొంటూ 1993 నుంచీ జరిగిన 204 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేయడం తెలిసిందే. వీటిలో మొదటి విడతగా 74 క్షేత్రాలకు తాజాగా ఈ-వేలం ప్రక్రియ ఫిబ్రవరి 11న ప్రారంభమవుతుందని బొగు ్గశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఈ అంశంపై ముసాయిదా మార్గదర్శకాలను కేంద్రం బుధవారం విడుదల చేసింది. నవంబర్ 24వ తేదీ లోపు ఈ ముసాయిదా నిబంధనలపై సంబంధిత వర్గాల స్పందనలను తెలియజేయాల్సి ఉంటుంది. వీటి వివరాలను స్వరూప్ మీడియాకు తెలిపారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియను అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని స్వరూప్ తెలిపారు.
కేవలం సొంత అవసరాలకు వినియోగించుకునే (క్యాపిటివ్) వారికి మాత్రమే బొగ్గు గనులను కేటాయించడం జరుగుతుందని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. నిర్దేశించిన ప్రాజెక్టు మినహా ఒక కంపెనీ సంబంధిత బొగ్గు క్షేత్రాన్ని మరే ప్రాజెక్టుకూ వినియోగించరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఏదైనా మార్పు చేయాలనుకుంటే అందుకు సంబంధించి వివరాలను అంతకుముందే తప్పనిసరిగా కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది.
బొగ్గు క్షేత్రాల వేలం తరువాత విద్యుత్ చార్జీలు పెరిగే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చూస్తుందని కూడా స్వరూప్ సూచనప్రాయంగా తెలిపారు. ఎన్ని క్షేత్రాలకు ఒక కంపెనీ బిడ్ దాఖలు చేయవచ్చన్న అంశంపై ఒక పరిమితి ఉంటుందని స్వరూప్ తెలిపారు. గుత్తాధిపత్యాన్ని నిరోధించడమే ఈ విధాన లక్ష్యమని వెల్లడించారు. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్స్గా రెండు దశల టెండర్ ప్రక్రియలో బొగ్గు క్షేత్రాల ఈ-ఆక్షన్ జరుగుతుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. వేలానికి సిద్ధం చేసే బొగ్గు గనుల గుర్తింపు, వీటిలో ప్రభుత్వ కంపెనీలకు ఏ గనులను కేటాయించాలి వంటి అంశాల నిర్ణయ బాధ్యతలను కేంద్రం నామినేటెడ్ అథారిటీకి అప్పగించనుంది. నామినేటెడ్ అథారిటీగా బొగ్గు వ్యవహారాల జాయింట్ సెక్రటరీ వివేక్ భరద్వాజ్‌ను ఇప్పటికే కేంద్రం నియమించింది. విద్యుత్, స్టీల్, ఇనుము, సిమెంట్ రంగాల ప్రాజెక్టుల్లో వినియోగానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ అమలవుతుంది.
పరిహారం ప్రక్రియ...
తాజా ఆక్షన్‌లో ఒక బొగ్గు క్షేత్ర కేటాయింపుదారు గతంలో కూడా అదే క్షేత్రం చెందిన కేటాయింపుదారుకాని పక్షంలో, గత కేటాయింపుదారుకు పరిహారం అందుతుంది. సంబంధిత క్షేత్ర మౌలిక అభివృద్ధికి గతంలో సంబంధిత కంపెనీ వ్యయం తత్సంబంధ అంశాల ప్రాతిపదికన ఈ తరహా పరిహారాన్ని నామినేటెడ్ అథారిటీ నిర్ణయిస్తుంది. క్షేత్రాల వేలం రిజర్వ్ ధరపై అధికారులు ప్రస్తుతం మదింపు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీ లోపు దీనిని నిర్ణయించే అవకాశం ఉంటుందని స్వరూప్ వెల్లడించారు. కేటాయింపులకు సంబంధించి టెక్నికల్ బిడ్స్‌ను 2015 మార్చి 3న ఓపెన్ చేయాలని మంత్రిత్వశాఖ భావిస్తోంది. మార్చి 16వ తేదీలోపు లెటర్ ఆఫ్ అవార్డును జారీ చేయాలన్న సంకల్పంతో బొగ్గు మంత్రిత్వశాఖ ఉంది.
తొలుత 72 కోల్ బ్లాక్‌లకు వేలం నిర్వహిస్తారు. వీటిలో 42 బ్లాకుల్లో ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఉత్పత్తిని కొనసాగించేందుకు మార్చి 31 వరకూ సుప్రీంకోర్టు అనుమతించింది. మిగిలిన 32 బ్లాకులు ఉత్పత్తికి సిద్ధంగా వున్నాయి. 42 ఉత్పాదక బ్లాకుల్లో ప్రస్తుతం ఏడాదికి 9 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తవుతుండగా, ఉత్పత్తికి సిద్ధంగా వున్న 32 బ్లాకులు మరో 12 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తిచేయగల సామర్థ్యంతో వున్నాయి. ఈ గనుల్ని నిర్వహిస్తున్న ప్రస్తుత కంపెనీ ఆ బ్లాకులో చేసిన పెట్టుబడికి తగిన విలువను పొందుతుందని బొగ్గుశాఖ కార్యదర్శి వివరించారు.