'ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు'
చండీగఢ్: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ సమాజానికి శత్రువని అన్షుల్ ఛత్రపతి వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపులు కేసులో గుర్మీత్‌కు ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించడాన్ని ఆయన స్వాగతించారు. గుర్మీత్ చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి తాము వెల్లడిస్తే ప్రజలు విశ్వసించలేదని వాపోయారు. కోర్టు తీర్పు తమకు సంతోషం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఎంతోమంది జీవితాలను గుర్మీత్ నాశనం చేశాడని, అతడికి ప్రభుత్వాలు సహకరించాయని ఆరోపించారు. తప్పు చేసినవారెవరూ తప్పించుకోలేరన్న సందేశాన్ని కోర్టు తీర్పు ఇచ్చిందని, సామాన్యుడికి న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగేలా తీర్పు వచ్చిందని పేర్కొన్నారు.
గుర్మీత్ సింగ్ రేప్ కేసును వెలుగులోకి తెచ్చిన సిర్సా జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి తనయుడే అన్షుల్. గుర్మీత్ చేసిన దారుణాలను వెలుగులోకి తెచ్చినందుకు 2002, అక్టోబర్ 24న రామ్ చందర్‌ను ఆయన ఇంటివద్ద అతి సమీపం నుంచి కాల్చిచంపారు. లైంగిక్ వేధింపుల కేసులో గుర్మీత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని చేపట్టాలని హైకోర్టు 2003, నవంబర్ 10న సీబీఐని ఆదేశించింది. కాగా, తన తండ్రి హత్యపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని 2005, జనవరిలో అన్షుల్ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ వేశారు. గుర్మీత్‌కు శిక్ష విధించిన న్యాయమూర్తి జస్టిస్ జగదీప్ సింగ్.. తన తండ్రి హత్య కేసులో సెప్టెంబర్ 16న వాదనలు విననున్నారని అన్షుల్ తెలిపారు.