వణికిస్తున్న ఆంత్రాక్స్
విశాఖపట్నం, సీలేరు (పాడేరు): జీకేవీధి మండలంలో మరోసారి ఆంత్రాక్స్ వ్యాధి కలకలం రేపింది. దారకొండ పంచాయతీ చిన్నగంగవరం, పెద్దగంగవరం గ్రామాల్లో వ్యాధి లక్షణాలతో ఉన్న 11 మందిని గుర్తించారు. వీరిని వైద్య సేవల నిమిత్తం గురువారం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చేతులపై పుళ్లు పుట్టి కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నా బాధితులు నిర్లక్ష్యం చేశారు. వైద్యసిబ్బంది ఈ గ్రామాల్లో పర్యటించినప్పుడు ఈ విషయం గమనించారు. దీంతో వైద్యాధికారి రామ్‌నాయక్ బృందం హుటాహుటిన ఆ గ్రామాలకు చేరుకొని ప్రథమ చికిత్స చేసిన అనంతరం విశాఖ కేజీహెచ్‌కు పంపించారు. గత నెల 17న ఇదే మండలం మాడెంలో ఆంత్రాక్స్ ప్రబలి ఆందోళన రేగగా వైద్యసిబ్బందిఅప్రమత్తమయ్యారు. నెల రోజులు గడవక ముందే దారకొండ పంచాయితీలో గిరిజన గ్రామాలపై మరోసారి ఆంత్రాక్స్ వ్యాధి పడగ విప్పింది. ఈ రెండు గ్రామాలు ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ గ్రామస్తులకు ఆంత్రాక్స్ సోకడం ఇదే మొదటిసారి. దీనిపై వారికి అవగాహన లేకపోవడంతో ముందుగా అవి దురదలు అనుకొని ఒకటి రెం డు రోజులు నిర్లక్ష్యం చేశారు. వైద్య సిబ్బంది ద్వారా ఈ విషయం తెలుసుకున్న వైద్యాధికారి రామ్‌నాయక్ బృందం ఆ గ్రామానికి చేరుకొని ప్రాథమిక చికిత్స చేసింది. ఆంత్రాక్స్ లక్షణాలతో బాధపడుతున్న పి.దళపతి, కె.అర్జున్, వి.రాజయ్య, కిల్లో రాజన్న, ఆర్.కామేశ్వరరావు, పి.సువర్ణ, వాసు, కోమటయ్య, సాంగి పోతి, సాంగి కసు, సాంగి సానులకు సెలైన్ ఎక్కించి సేవలందించారు.
పీవో ఆకస్మిక పర్యటన: పాడేరు ఐటీడీఏ పీవో రవి పట్టన్‌శెట్టి ఆంత్రాక్స్ సోకిన చిన్నగంగవరం, పెద్దగంగవరం గ్రామాల్లో గురువారం ఆగమేఘాల మీద పర్యటించారు. బాధితుల కుటుంబాలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇంకెవరికైనా గ్రామంలో ఆంత్రాక్స్ సోకిందా? అని ఆరా తీశారు. అనంతరం గ్రామ గిరిజనులతో సమావేశమై అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్రమంగా మార్చుకోవాలని, మెరుగైన ఆరోగ్యం కలిగి ఉండేలా గ్రామస్తులు కృషి చేయాలని కోరారు. ఏఓబీలో వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనారోగ్యంతో చనిపోయిన పశువుల మాంసాన్ని తినడం వల్లే ఆంత్రాక్స్ వస్తుందని అవగాహన కల్పించారు. గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాగునీరు, ఉపాధి హామీ, చంద్రన్న బీమా పథకాల అమలవుతున్న తీరును పరిశీలించారు. తక్షణమే మండల అధికారులను అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు అన్ని సదుపాయాలు అందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జీకేవీధి మండలం చిన్నగంగవరం, పెద్దగంగవరం గ్రామాల్లో ఆంత్రాక్స్ సోకిన విషయం నిజమేనని, వారిని కేజీహెచ్‌కు తరలించి వైద్యచికిత్సలు కల్పిస్తున్నామన్నారు. మిగిలిన వారికి ఆంత్రాక్స్ సోకకుండా అప్రమత్తం చేశామని, ఈ గ్రామంలో ఎప్పటికప్పుడు పిన్‌పాయింట్ తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. చుట్టుపక్కల గ్రామాలను వైద్యసిబ్బంది నిరంతరం పర్యవేక్షించి ఈ వ్యాధిపై అప్రమత్తంగా ఉండేలా వైద్యధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. అనంతరం జీకేవీధి మండలం దారకొండ, సప్పర్ల, జీకేవీధి పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. డాక్టర్లు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని కోరారు. పీహెచ్సీలో పూర్తిగా మందులు ఉన్నాయో.. లేవో అడిగి పరిశీలించారు. ఆయన వెంట ప్రత్యేకాధికారి కాఫీ ఏడీ రాధాకృష్ణ, చింతపల్లి ఏపీవో రవీంద్రనా«థ్, ఎంపీడీఓ సాల్మన్‌రాజు, ఏటీడబ్ల్యూవో జి.లక్ష్మి ఉన్నారు.
ఆంత్రాక్స్ బాధితులు మధ్యలోనే మాయం?: విశాఖ కేజీహెచ్‌కు తరలించేందుకు చింతపల్లి ఆస్పత్రికి తీసుకువచ్చిన ఆంత్రాక్స్ బాధితులు మధ్యలోనే మాయమయినట్టు తెలిసింది. చికిత్స కోసం స్వగ్రామాన్ని వదిలి విశాఖ వెళ్లేందుకు వారు విముఖత చూపినట్టు సమాచారం. ఐటీడీఏ అధికారులు, వైద్య సిబ్బంది ఎంత నచ్చచెప్పినా వారు వినలేదని, అంబులెన్స్‌లో ఎక్కకుండా వివిధ పనుల పేరు చెప్పి చల్లగా జారుకున్నారని తెలిసింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు.
విస్తరిస్తున్న ఆంత్రాక్స్..: గత ఐదేళ్ళుగా గిరిజనుల్లో కలకలం రేపుతున్న ఆంత్రాక్స్ వ్యాధి ఏజెన్సీ అంతటా మెల్లమెల్లగా పాకుతోంది. గతంలో ఆంత్రాక్స్ అనే వ్యాధి ఏజెన్సీలో పాడేరు, అరకు, సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండి, అక్కడ బాధితుల సంఖ్య పెరిగేది. ఇప్పుడు జీకేవీధి మండలం వరకూ పాకింది.
గతంలో ఈ మండలంలో ఎప్పుడూ ఆంత్రాక్స్ కేసులు నమోదైన దాఖలాలు లేవు. జీకేవీధి మండల కేంద్రంలో మాడెం అనే గ్రామంలో ఆంత్రాక్స్ నమోదుకాగా, నెల రోజుల వ్యవధిలో మండలంలోని చిన్నగంగవరం, పెద్దగంగవరం గ్రామాలకు పాకింది. ఈ గ్రామాల్లో కూడా పశుమాంసం ఎక్కువగా తింటున్నట్లు గుర్తించారు. ఐతే ప్రస్తుతం ఈ రెండు గ్రామాల్లో ఆంత్రాక్స్ సోకడంతో మిగతా కుటుంబాలతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆంత్రాక్స్ వ్యాధిపై ఆందోళన చెందుతున్నారు.