
జూనియర్ ట్రంప్‌తో వానెస్సా
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోడలిపై పౌడర్ దాడి చోటు చేసుకుంది. తన ఇంటికి వచ్చిన ఓ కవర్‌ను ఆమె ఓపెన్ చేయగా.. అందులోంచి పౌడర్ ఆమెపై పడింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు.
ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఇంటికి సోమవారం ఓ కవర్ వచ్చింది. దానిని ఆయన భార్య వానెస్సా ఓపెన్‌చేయగా.. అందులోంచి పౌడర్ పడింది. విపరీతమైన దగ్గు, తలతిరగటం లక్షణాలు కనిపించటంతో వెంటనే ఆమె ఎమర్జెన్సీ నంబర్ 911కు ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన అధికారులు ఆమెతోపాటు మరో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. చివరకు వారికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అది మాములు పౌడర్ అని తేల్చేశారు. మోడల్ అయిన వానెస్సా, జూనియర్ ట్రంప్ దంపతులకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. తన భార్య, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు ట్రంప్.జూ తన ట్విట్టర్‌లో తెలియజేశాడు.
ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు రహస్య నిఘా విభాగం, ఎఫ్‌బీఐలు రంగంలోకి దిగాయి. కాగా, రెండేళ్ల క్రితం ట్రంప్ మరో తనయుడు ఎరిక్‌కు కూడా ఇలాంటి పార్సల్ ఒకటి వచ్చి కంగారు పుట్టించింది. 2001లో ఇలాగే ఆంత్రాక్స్ పౌడర్‌ను పార్సల్ పంపి పలువురు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. యూఎస్ సెనేటర్లకు, వార్తా సంస్థలకు పార్సళ్లను పంపంటంతో ఐదుగురు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment