అమెరికా ఆంత్రాక్స్ దాడులు
యునైటెడ్ నేషన్స్: జీవాయుధాల ప్రయోగంలో ఆరితేరిన అమెరికా ప్రాణాంతక ఆంత్రాక్స్ వైరస్ను తమ దేశంపై ప్రయోగిస్తున్నదని ఉత్తర కొరియా ఆరోపించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి రాసిన ఫిర్యాదు లేఖ శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
సముద్ర మార్గం ద్వారా ప్రమాదకర ఆంత్రాక్స్ వైరస్ ను ఉత్తర కొరియాలో వ్యాపింపజేసేందుకు అమెరికా కుట్రలు పన్నిందని, ఇందుకు ఆధారాలు లభ్యమయ్యాయని, ఈ విషయంలో భద్రతా మండలి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఉత్తర కొరియాలో ఐక్యరాజ్య సమితి అధికర ప్రతినిధి.. సెక్రటరీ జనరల్కు లేఖ రాశారు. కాగా, తక్షణ చర్యలేవీ తీసుకోనప్పటికీ ఫిర్యాదులోని అంశాలపై దర్యాప్తు చేపడతామని ఐరాస ప్రకటించింది. ఈ ఆరోపణలపై అమెరికా ఇప్పటివరకు స్పందించలేదు.
గడిచిన మేలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో 22 మంది సైనికులకు ఆంత్రాక్స్ సోకడాన్ని ఫిర్యాదులో ప్రస్తావించిన ఉత్తర కొరియా.. వైరస్ ను తమ దేశానికి ఎగుమతి చేసే క్రమంలోనే ఆ ఘటన జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేసింది.