north koria
-
ఉత్తర కొరియా కిమ్ సంచలన వ్యాఖ్యలు
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో నెలకొన్న అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం తప్పదని అన్నారు. యుద్ధాన్నికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం దేశంలోనే కీలకమైన కిమ్ జోంగ్-ఇల్ మిలిటరీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ యూనివర్సిటీ కిమ్ తండ్రి పేరు మీద 2011లో స్థాపించారు. దేశంలో మిలిటరీ విద్యలో అత్యధికంగా సీట్లు ఉన్న యూనివర్సిటీ ఇది. యూనివర్సిటీ సందర్శన సమయంలో విద్యార్థులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. ‘ఉత్తర కొరియా చుట్టూ.. అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో దేశంలో నెలకొన్న అస్థిరమైన పరిస్థితుల నడుమ యుద్ధం తప్పదు. శత్రు దేశాలు యుద్ధ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఎలాంటి సంకోచం లేకుండా యుద్ధం చేయడానికి నార్త్ కొరియా సిద్ధంగా ఉంది’ అని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇప్పటికే నార్త్ కొరియా రాజకీయంగా, ఆయుధ తయారీలో రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లో నార్త్ కొరియా సాయం అందిస్తోంది. ఇటీవల కొరియా ఘన ఇందనంతో మధ్యశ్రేణి సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఇది ద్రవ ఇందనంతో పోల్చితే చాలా శక్తివంతమైందని నిపుణులు పేర్కొన్నారు. తరచూ అమెరికా, దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్త్ను విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
కిమ్ ఆరోగ్యంపై స్పందించిన ట్రంప్
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఒకవేళ కిమ్ అనారోగ్యానికి గురైతే త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు మంగళవారం వైట్‌హౌజ్ వద్ద విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉత్తర కొరియాతో తమకు మంచి సంబంధాలు ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. ‘కిమ్ ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే నేను చెప్పగలను. ఆయన ఆరోగ్యంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. కిమ్ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే నివేదికలు తెలిపిన దాని ప్రకారం కిమ్ ఆరోగ్యం విషమంగా ఉంటే అది తీవ్రమైన పరిస్థితి’గా ట్రంప్ వర్ణించారు. కానీ కిమ్ ఆరోగ్యం గురించి ట్రంప్‌కు సరైన సమాచారం ఉందా అన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. (విషమంగా కిమ్ జోంగ్ ఆరోగ్యం..!) కాగా గత కొంత కాలంగా కిమ్ జోంగ్ అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయన శస్త్ర చికిత్స చేసుకున్నారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మంగళవారం మీడియా కథనాలు వెలువడ్డాయి. కాగా ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరుకాక పోవడంతో ఆయనకు ఏమైందన్న విషయం చర్చరనీయంశంగా మారింది. నిత్యం తన పనులతో వార్తల్లో నిలిచే కిమ్ జంగ్ ఉన్ కనిపించక పోవడంతో ఆయన అనారోగ్యమే ఇందుకు కారణమంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. (కిమ్ ఆరోగ్యం విషమం.. ఆ వార్తలు నిజం కాదు) -
ఉ. కొరియాలో అంతే!
హామ్‌గ్యాంగ్: ఉత్తరకొరియాలోని ఓ మహిళకు వింత ఘటన ఎదురైంది. దేశాధినేతల ఫొటోలను మంటల నుంచి రక్షించలేకపోయినందుకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే హ్యామ్గ్యాంగ్ ప్రావిన్స్‌లోని ఒన్సోంగ్ కౌంటీలో ఓ ఇంటికి నిప్పంటుకుంది. అందులో ఉన్న ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను ప్రాణాలకు తెగించి కాపాడుకుంది. అయితే ఈ క్రమంలో దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుటుంబ సభ్యుల ఫొటోలను మంటల నుంచి కాపాడలేకపోయింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువైతే 15 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. ఉత్తర కొరియా చట్టాల ప్రకారం ప్రతి ఇంట్లో కిమ్ పూర్వీకులైన కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ ఫొటోలను తప్పక ఉంచుకోవాలి. ఫొటోలను సరిగా చూసుకుంటున్నారో లేదో తెలుసుకోవడానికి అప్పుడప్పుడూ అధికారులు ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తారు మరి. అదీ కిమ్ రాజ్యంలోని ప్రజల తిప్పలు. -
ట్రంప్‌ను ఉడికించడమే కిమ్‌కు ఇష్టం
ప్యాంగ్యాంగ్ : ఉత్తర కొరియా ప్రశాంతంగా ఉందంటే అనుమానించాలి. క్షిపణి పరీక్షకో, మరో మారణాయుధ పరీక్షకో ఏర్పాట్లు చేసుకుంటుందనుకోవాలి. తాజాగా ఆ దేశం వైపు నుంచి తూర్పు సముద్రంలో వచ్చి పడ్డ రెండు గుర్తుతెలియని వస్తువులు చూశాక దక్షిణ కొరియాకు ఈ సంగతి జ్ఞప్తికి వచ్చి ఉంటుంది. 17 నెలల మౌనం తర్వాత గత నెల 25 నుంచి మొదలుకొని ఇంతవరకూ ఉత్తరకొరియా ఏడు క్షిపణి ప్రయోగాలు జరిపింది. శనివారం జరిపిన పరీక్షలపై ఉత్తర కొరియా మీడియా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. విజయవంతంగా పరీక్షించిన సూపర్ లార్జ్ మల్టిపుల్ రాకెట్ లాంచర్‌ను మిరాకిల్‌గా అభివర్ణించింది. క్షిపణి పరీక్షలకు ముందు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్లాదంగా ఉన్న ఫోటోలను, క్షిపణుల దగ్గర నిలబడి ఇచ్చిన ఫోజులను విడుదల చేసింది. క్షిపణుల దగ్గర నిలబడిన కిమ్ ఫొటోలను ఉద్దేశిస్తూ ‘ఉత్తరకొరియా దేశానికి విలువైన సంపద’ అని వ్యాఖ్యానించింది. కాగా, ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ మిసైల్ పరీక్షలు జరపడం కిమ్‌కు అభిరుచి అని తెలిపారు. ఈ పరీక్షల ప్రభావం ఆ దేశంతో చేసుకునే ఒప్పందంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. అయితే అమెరికా ఆంక్షలను, ఒత్తిడిని ఎప్పుడూ తేలిగ్గా తీసుకునే ఉత్తరకొరియా మరోసారి అమెరికాకు ముఖ్యంగా ట్రంప్‌కు చురకలంటించింది. తమ దేశ వ్యూహాత్మక రక్షణ కోసం మేం తీసుకునే చర్యలపై ఎలాంటి ఒత్తిడిలు పనిచేయవని స్పష్టం చేసింది. ఒకపక్క అమెరికా శాంతి వచనాలు వల్లిస్తూ, తమతో చర్చల తతంగం నడుపుతూ.. మరోపక్క దక్షిణ కొరియాను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తోందని ఆరోపించింది. కిమ్ జరిపే పరీక్షలను చూసి ట్రంప్ ఉడుక్కోవడం తప్ప మరేం చేయలేడని సరదాగా ఆ దేశ మీడియా వ్యాఖ్యానించింది. దక్షిణ కొరియా–అమెరికా ఉమ్మడి సైనిక విన్యాసాలపై ఘాటుగా స్పందిస్తూ క్షిపణి ప్రయోగాలను ఉత్తరకొరియా పునః ప్రారంభించడం తెలిసిందే. అయితే ఉత్తరకొరియా తాజాగా ప్రయోగించినవి స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు అయి ఉంటాయని దక్షిణ కొరియా సైనిక ప్రతినిధి అంటున్నారు. ప్రస్తుతం తమ సముద్ర జలాల్లో పడినవేమిటో తెలుసుకోవడానికి దక్షిణ కొరియా ప్రయత్నిస్తోంది. అందుకు అమెరికా సాయం తీసుకుంటోంది. తమ పరిశీలనాంశాలను జపాన్‌కు కూడా అందజేస్తామని ఆ దేశం ప్రకటించింది. -
యుద్ధం వస్తే చైనానే అండ
బీజింగ్ : చైనా, ఉత్తరకొరియాలు రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా భయాల నేపథ్యంలో ఈ రెండు దేశాలు వ్యూహాత్మకంగా కలసి పనిచేయాలని, యుద్ధం వస్తే ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే ఒప్పందంపై చర్చలు ప్రారంభించాయి. ఉత్తరకొరియా ఉన్నతస్థాయి మిలటరీ బృందం తాజాగా చైనా మిలటరీ బృందంతో బీజింగ్‌లో సమావేశం అయింది. ఈ సందర్భంగా ఉత్తరకొరియా సైనిక అధికారి మాట్లాడుతూ బీజింగ్, ప్యాంగ్యాంగ్ల రక్షణ సహకారం ఈ చర్చలతో మరింత ఎత్తుకు చేరుకుంటుందని ఆశాబావం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియాతో కలసి అమెరికా సైనిక విన్యాసాలు నిర్వహిస్తే తాము అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలుగుతామని ఉత్తరకొరియా హెచ్చరిస్తున్న సంగతి తెల్సిందే. అమెరికాను ఉడికిస్తూ క్షిపణి పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. దీనిపై జోక్యం చేసుకున్న దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్జేఇన్ను సిగ్గులేని వ్యక్తిగా అభివర్ణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే చైనాతో భాగస్వామ్యం కోసం మిలటరీ బృందం చైనాకు వెళ్లింది. క్షిపణి పరీక్షలతో వార్తల్లో నిలిచి అమెరికా ఆగ్రహాన్ని చవిచూసిన ఉత్తర కొరియా ఇప్పుడు చైనాతో భాగస్వామ్యం మరింత పెంచుకోవాలని చూడటం ప్రాధాన్యత సంతరించుకొంది. పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతకు తోడ్పడటానికి చైనాతో పాటు ఉత్తరకొరియా సిద్ధంగా ఉందని, బలమైన పొరుగుదేశంతో మేం మరింత బలమైన సంబంధాలు కోరుకుంటున్నామని ఉత్తర కొరియా ఈ సందర్భంగా తెలిపింది. కాగా, చైనా సైతం తమ భౌగోళిక ఉమ్మడి శత్రువులు అయిన జపాన్, దక్షిణకొరియా అలాగే ఈ ప్రాంతంలో తరచూ జోక్యం చేసుకుని తమ ఆదిపత్యాన్ని సవాలు చేస్తోన్న అమెరికాను ఎదుర్కోవడానికి మంచి పొరుగు మిత్రునిగా ఉత్తరకొరియాను చూస్తోంది. 14 సంవత్సరాల నుంచి చైనా నాయకుడు ఉత్తరకొరియాకు వెళ్లలేదు. దీన్ని చెరిపేస్తూ గత నెలలో చైనా అధ్యక్షుడు జీజిన్పింగ్ ఆ దేశ పర్యటనకు జూన్‌లో వెళ్లారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో ఆయన చేసిన చర్చలు చారిత్రాత్మక మిత్రదేశాల మధ్య సంబంధాలకు కొత్త ప్రేరణనిచ్చాయని ఒక ప్రకటనలో ఇరు దేశాలు తెలిపాయి. యుద్ధం సంభవిస్తే చైనా, ఉత్తరకొరియాలు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని 1961లోనే ఒక ఒప్పందం చేసుకున్నా అది అంత సమర్థవంతంగా లేదని ఉత్తరకొరియా భావన. అందుకే తాజాగా అమెరికా భయాలతో మరింత విస్తృతమైన ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. ఇక చైనాకు, అమెరికాకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హాంగ్‌కాంగ్, తైవాన్ విషయంలో అమెరికా జోక్యంపై చైనా తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతవారం అమెరికా విదేశాంగమంత్రి మైక్పాంపియో మాట్లాడుతూ పసిఫిక్ ప్రాంత మ్యాపును చైనా తన ఏకపక్ష బలవంతపు విధానాలతో తిరగరాయాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. దీనికి చైనా కౌంటర్ ఇస్తూ.. ఈ ప్రాంతంలో మరకలను అంటించి అసమ్మతి విత్తనాన్ని నాటడానికి తరచుగా ఓ దేశం గుంటనక్కలా కాచుకు కూర్చోందని ఘాటుగా విమర్శించింది. -
ప్రపంచాన్ని జయించాలని ఉంది: ట్రంప్
వాషింగ్టన్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ శాంతి బహుమతిపై తనకు పెద్దగా ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రపంచాన్ని జయించాలనే కోరిక ఉందని, అదే నాకు గొప్ప బహుమతి అవుతుందని మనసులోని మాటను వెల్లడించారు. మీరు నోబెల్ శాంతి బహుమతికి అర్హులేనని భావిస్తున్నారా అని ఓ విలేకరి అడిగి ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ.. ‘ప్రతి ఒక్కరికి బహుమతి పొందాలని ఉంటుంది. ఎవరూ కూడా మాకు వద్దు అని చెప్పరు. నాకు మాత్రం ఆసక్తి లేదు. నా కోరిక ఏంటంటే.. ప్రపంచాన్ని జయించాలి. అదే నాకు పెద్ద బహుమతి. మనం ప్రపంచం గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాం. అందుకే నాకు ప్రపంచ విజయాన్ని బహుమతిగా తీసుకోవాలని ఉంద’ని పేర్కొన్నారు. ఇప్పటికే నోబెల్ శాంతి బహుమతికి ట్రంపే అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియాతో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించడంలో ట్రంప్ దౌత్యం ఫలించటంతో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం కావాలనుకోవడం ప్రపంచానికి మంచి పరిణామం అని అభిప్రాయ పడ్డారు. ఇలాంటి ఆలోచన గత కొన్నేళ్లుగా ఎవరూ చేయలేదు. ఈ సమావేశంతో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు మంచి జరుగుతుందని భావిస్తున్నానన్నారు. ‘ఈ చర్చలు సఫలం కావడానికి సహాయం అందిస్తోన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ధన్యవాదాలు తెలిజేస్తున్నాను. మేము చైనాతో వర్తకాన్ని కొనసాగిస్తున్నాం. ఇరు దేశాలు స్నేహభావంతో ఒకరికొకరు సాయం అందించుకుంటామ’అని ట్రంప్ పేర్కొన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడితో మాట్లాడిన విషయంపై స్పందిస్తూ.. మూడు దేశాల అగ్రనేతలు ఎక్కడ కలుద్దాం అనే విషయంపై మాత్రమే చర్చించామని తెలిపారు. జపాన్ ప్రధాని షిజో అబే, జిన్‌పింగ్, మూన్‌లతో చర్చించి సమావేశమయ్యే ప్రాంతం పేరు వెల్లడిస్తామని ట్రంప్ తెలిపారు. -
నా దగ్గరా న్యూక్లియర్ బటన్
వాషింగ్టన్: ‘కిమ్ వద్ద ఉన్న దానికన్నా పెద్దదైన, శక్తిమంతమైన, బాగా పనిచేసే న్యూక్లియర్ బటన్ నా దగ్గర కూడా ఉంది’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేసిన హెచ్చరికలపై స్పందించారు. కొత్త ఏడాది సందర్భంగా కిమ్ ప్రసంగిస్తూ అమెరికా ప్రధాన భూభాగంపై ఎక్కడైనా దాడి చేయగల అణు క్షిపణులు తన వద్ద ఉన్నాయనీ, దాడిని ప్రారంభించేందుకు అవసరమైన న్యూక్లియర్ బటన్ కూడా ఎప్పుడూ తన టేబుల్ పైనే ఉంటుందంటూ హెచ్చరించడం తెలిసిందే. దీనికి సమాధానంగా ట్రంప్ ‘న్యూక్లియర్ బటన్ ఎల్లవేళలా తన టేబుల్‌పైనే ఉంటుందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చెప్పారు. దారిద్య్రంతో, ఆకలి కేకలతో అల్లాడుతున్న ఆ దేశంలోని ఎవరైనా వెళ్లి ఆయనకు చెప్పండి నా దగ్గర కూడా అంతకు మించిన బటన్ ఉందని’ అని ట్రంప్ బుధవారం ట్వీట్ చేశారు. పాలస్తీనాకూ సాయం ఆపేస్తాం ఉగ్రవాదంపై పోరాటం కోసం పాక్‌కు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించిన అమెరికా తాజాగా పాలస్తీనాకూ అదే హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలను పాలస్తీనా పునరుద్ధరించకపోతే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామంది. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి విభాగానికి 2016లో అత్యధికంగా అమెరికానే 368 మిలియన్ డాలర్లను సాయంగా అందించింది. ‘పాలస్తీనాకు మేం ఏటా వందల మిలియన్ డాలర్లు ఇస్తున్నా కానీ వారు మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు.’ అంటూ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. అంతకుముందు ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ పాలస్తీనాకు ఆర్థిక సాయాన్ని తమ ప్రభుత్వం నిలిపేసిందన్నారు. ‘అత్యంత అవినీతి మీడియా’ అవార్డు వచ్చే సోమవారం ‘అత్యంత అవినీతికర అమెరికా మీడియా’ అవార్డును ప్రకటిస్తానని ట్రంప్ చెప్పారు. ఈ అవార్డులు అవినీతి మీడియా, తప్పుడు వార్తలు, బ్యాడ్ రిపోర్టింగ్ కేటగిరీల్లో ఉంటాయన్నారు. ఫాక్స్ న్యూస్ మినహా మిగతా అమెరికా మీడియాతో ట్రంప్‌కు సత్సంబంధాలు లేవు. దీంతో సమాచారాన్ని ఆయన ఎక్కువగా ట్వీట్ల ద్వారానే వెల్లడిస్తుండటం తెలిసిందే. -
ఉగ్ర ప్రోత్సాహ జాబితాలో ఉ.కొరియా: ట్రంప్
వాషింగ్టన్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో ఉత్తర కొరియాను చేరుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సోమవారం వైట్‌హౌస్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తర కొరియాను ఎప్పుడో ఉగ్రవాద ప్రోత్సాహ దేశంగా గుర్తించాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయం నేపథ్యంలో ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షల్ని అమెరికా ఆర్థిక శాఖ నేడు వెల్లడిస్తుందని ఆయన చెప్పారు. చట్ట వ్యతిరేక అణ్వాయుధ కార్యకమాల్ని ఉత్తర కొరియా తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. -
'కుక్క మాంసం తినండయ్యా..!'
ప్యోంగ్ యాంగ్: 'ప్రియమైన ప్రజలారా.. కుక్క మాంసాన్ని కడుపారా తినండి. ఎందుకంటే.. బీఫ్, చికెన్, పోర్క్, బాతు మాంసాల కంటే కుక్కమాసం ఎంతో బలవర్ధకమైనది కాబట్టి' అని జాతికి పిలుపునిచ్చారు ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్. ఓ వైపు కుక్క మాంస భక్షణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో నార్త్ కొరియా దేశాధినేత ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుక్క మాంసంలో అద్భుత పోషక విలువలు ఉన్నాయని, అందులోని విటమిన్స్ మనిషికి బలాన్నిస్తాయని కిమ్ జాంగ్ అన్నట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. (కుక్క మాంసం తినకండయ్యా..) నియంత నేతకు మద్దతుగా కొరియా అధికార టీవీ చానెల్, వార్తా పత్రికలు సైతం కుక్కమాంసం గొప్పతనంపై పుంఖానుపుంఖాలుగా వార్తలు రాస్తున్నాయని 'ది కొరియా టైమ్స్' పేర్కొంది. కిమ్ కంటే ఒక అడుగు ముందుకేసి కొందరు.. 'కుక్కలను మామూలుగా తిన్పప్పటి కంటే వాటిని బాధకు గురిచేసి చంపి తింటే మరింత రుచికరంగా ఉంటాయంటూ' వాటికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో పెడుతున్నారు. may God save Korian Dogs! -
అమెరికా ఆంత్రాక్స్ దాడులు
యునైటెడ్ నేషన్స్: జీవాయుధాల ప్రయోగంలో ఆరితేరిన అమెరికా ప్రాణాంతక ఆంత్రాక్స్ వైరస్‌ను తమ దేశంపై ప్రయోగిస్తున్నదని ఉత్తర కొరియా ఆరోపించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి రాసిన ఫిర్యాదు లేఖ శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సముద్ర మార్గం ద్వారా ప్రమాదకర ఆంత్రాక్స్ వైరస్ ను ఉత్తర కొరియాలో వ్యాపింపజేసేందుకు అమెరికా కుట్రలు పన్నిందని, ఇందుకు ఆధారాలు లభ్యమయ్యాయని, ఈ విషయంలో భద్రతా మండలి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఉత్తర కొరియాలో ఐక్యరాజ్య సమితి అధికర ప్రతినిధి.. సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. కాగా, తక్షణ చర్యలేవీ తీసుకోనప్పటికీ ఫిర్యాదులోని అంశాలపై దర్యాప్తు చేపడతామని ఐరాస ప్రకటించింది. ఈ ఆరోపణలపై అమెరికా ఇప్పటివరకు స్పందించలేదు. గడిచిన మేలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో 22 మంది సైనికులకు ఆంత్రాక్స్ సోకడాన్ని ఫిర్యాదులో ప్రస్తావించిన ఉత్తర కొరియా.. వైరస్ ను తమ దేశానికి ఎగుమతి చేసే క్రమంలోనే ఆ ఘటన జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేసింది.