నా దగ్గరా న్యూక్లియర్‌ బటన్‌ | Trump Says His ‘Nuclear Button’ Is ‘Much Bigger’ Than North Korea’s | Sakshi
Sakshi News home page

నా దగ్గరా న్యూక్లియర్‌ బటన్‌

Published Thu, Jan 4 2018 2:13 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

Trump Says His ‘Nuclear Button’ Is ‘Much Bigger’ Than North Korea’s - Sakshi

వాషింగ్టన్‌: ‘కిమ్‌ వద్ద ఉన్న దానికన్నా పెద్దదైన, శక్తిమంతమైన, బాగా పనిచేసే న్యూక్లియర్‌ బటన్‌ నా దగ్గర కూడా ఉంది’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చేసిన హెచ్చరికలపై స్పందించారు. కొత్త ఏడాది సందర్భంగా కిమ్‌ ప్రసంగిస్తూ అమెరికా ప్రధాన భూభాగంపై ఎక్కడైనా దాడి చేయగల అణు క్షిపణులు తన వద్ద ఉన్నాయనీ, దాడిని ప్రారంభించేందుకు అవసరమైన న్యూక్లియర్‌ బటన్‌ కూడా ఎప్పుడూ తన టేబుల్‌ పైనే ఉంటుందంటూ హెచ్చరించడం తెలిసిందే. దీనికి సమాధానంగా ట్రంప్‌ ‘న్యూక్లియర్‌ బటన్‌ ఎల్లవేళలా తన టేబుల్‌పైనే ఉంటుందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ చెప్పారు. దారిద్య్రంతో, ఆకలి కేకలతో అల్లాడుతున్న ఆ దేశంలోని ఎవరైనా వెళ్లి ఆయనకు చెప్పండి నా దగ్గర కూడా అంతకు మించిన బటన్‌ ఉందని’ అని ట్రంప్‌ బుధవారం ట్వీట్‌ చేశారు.  

పాలస్తీనాకూ సాయం ఆపేస్తాం
ఉగ్రవాదంపై పోరాటం కోసం పాక్‌కు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించిన అమెరికా తాజాగా పాలస్తీనాకూ అదే హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలను పాలస్తీనా పునరుద్ధరించకపోతే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామంది. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి విభాగానికి 2016లో అత్యధికంగా అమెరికానే 368 మిలియన్‌ డాలర్లను సాయంగా అందించింది. ‘పాలస్తీనాకు మేం ఏటా వందల మిలియన్‌ డాలర్లు ఇస్తున్నా కానీ వారు మమ్మల్ని  అగౌరవపరుస్తున్నారు.’ అంటూ ట్రంప్‌ ఓ ట్వీట్‌ చేశారు. అంతకుముందు ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ పాలస్తీనాకు ఆర్థిక సాయాన్ని తమ ప్రభుత్వం నిలిపేసిందన్నారు.

‘అత్యంత అవినీతి మీడియా’ అవార్డు   
వచ్చే సోమవారం ‘అత్యంత అవినీతికర అమెరికా మీడియా’ అవార్డును ప్రకటిస్తానని ట్రంప్‌ చెప్పారు. ఈ అవార్డులు అవినీతి మీడియా, తప్పుడు వార్తలు, బ్యాడ్‌ రిపోర్టింగ్‌ కేటగిరీల్లో ఉంటాయన్నారు. ఫాక్స్‌ న్యూస్‌ మినహా మిగతా అమెరికా మీడియాతో ట్రంప్‌కు సత్సంబంధాలు లేవు. దీంతో సమాచారాన్ని ఆయన ఎక్కువగా ట్వీట్ల ద్వారానే వెల్లడిస్తుండటం తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement