అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ శాంతి బహుమతిపై తనకు పెద్దగా ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రపంచాన్ని జయించాలనే కోరిక ఉందని, అదే నాకు గొప్ప బహుమతి అవుతుందని మనసులోని మాటను వెల్లడించారు. మీరు నోబెల్ శాంతి బహుమతికి అర్హులేనని భావిస్తున్నారా అని ఓ విలేకరి అడిగి ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ.. ‘ప్రతి ఒక్కరికి బహుమతి పొందాలని ఉంటుంది. ఎవరూ కూడా మాకు వద్దు అని చెప్పరు. నాకు మాత్రం ఆసక్తి లేదు. నా కోరిక ఏంటంటే.. ప్రపంచాన్ని జయించాలి. అదే నాకు పెద్ద బహుమతి. మనం ప్రపంచం గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాం. అందుకే నాకు ప్రపంచ విజయాన్ని బహుమతిగా తీసుకోవాలని ఉంద’ని పేర్కొన్నారు.
ఇప్పటికే నోబెల్ శాంతి బహుమతికి ట్రంపే అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియాతో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించడంలో ట్రంప్ దౌత్యం ఫలించటంతో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం కావాలనుకోవడం ప్రపంచానికి మంచి పరిణామం అని అభిప్రాయ పడ్డారు. ఇలాంటి ఆలోచన గత కొన్నేళ్లుగా ఎవరూ చేయలేదు. ఈ సమావేశంతో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు మంచి జరుగుతుందని భావిస్తున్నానన్నారు. ‘ఈ చర్చలు సఫలం కావడానికి సహాయం అందిస్తోన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ధన్యవాదాలు తెలిజేస్తున్నాను. మేము చైనాతో వర్తకాన్ని కొనసాగిస్తున్నాం. ఇరు దేశాలు స్నేహభావంతో ఒకరికొకరు సాయం అందించుకుంటామ’అని ట్రంప్ పేర్కొన్నారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడితో మాట్లాడిన విషయంపై స్పందిస్తూ.. మూడు దేశాల అగ్రనేతలు ఎక్కడ కలుద్దాం అనే విషయంపై మాత్రమే చర్చించామని తెలిపారు. జపాన్ ప్రధాని షిజో అబే, జిన్‌పింగ్, మూన్‌లతో చర్చించి సమావేశమయ్యే ప్రాంతం పేరు వెల్లడిస్తామని ట్రంప్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment