డామిట్ డాండ్రఫ్!
వేడుకలప్పుడు చెమ్కీ పొడి (జిగ్గీ) అనే మెరుపు రజనును ముఖానికి పూసుకుంటారు. గాల్లో విసురుకుంటారు. ఈ చెమ్కీపొడి మెరుపులు తళుక్కుమంటూ బాగుంటాయి. అయితే తళుక్కుమనకుండా ఉండే పొలుసులు పొలుసులుగా రాలిపోయే పొడి కూడా కొందరి జుట్టులో కనిపిస్తుంటుంది. కానీ ఈ పొలుసుల పొడిలో మెరుపుండదు. ఉన్నా అది నచ్చదు. దాన్ని వదిలించుకునేందుకే అందరూ ప్రయత్నం చేస్తుంటారు. దాన్నే మనం ‘చుండ్రు’ అంటాం. వెంట్రుకలలో చిక్కుకొని కనిపించే చుండ్రుకు కారణాలు, దాన్ని అరికట్టే ప్రక్రియలను తెలుసుకుందాం.
తల (మాడు) నుంచి చాలా సందర్భాల్లో తెల్లరంగులోనూ, కొందరిలో ఒకింత పసుపురంగులోనూ రాలే పొలుసులను చుండ్రు అంటారు. దీని బాధను అనుభవించేవారికీ, చూసేవారికి కూడా ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. సామాజికంగా ఇబ్బందికరమైన ఈ సమస్యనుంచి విముక్తి పొందడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు కాబట్టే చుండ్రును అరికడతాయని చెప్పే అనేక ఉత్పాదనలు, షాంపూలు దొరుకుతున్నాయి.
చుండ్రు ఎందుకు వస్తుంది? తల (మాడు) పైన ఉండే చర్మం అనుక్షణం పాత కణాలను వదిలించుకొని కొత్త కణాలను పొందుతుంటుంది. ఈ క్రమంలో పొలుసులు, పొలుసులుగా చర్మకణాలు తెల్లగా పొట్టులాగా రాలిపోతూ ఉంటాయి. ఇక కొందరిలో యుక్తవయసుకు వచ్చే సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల చర్మంపై తేమను కలిగించేందుకు నూనె వంటి ద్రవాన్ని స్రవించే సెబేషియస్ గ్రంధుల నుంచి స్రావాలు ఎక్కువగా వస్తుంటాయి. దాంతో అక్కడి వాతావరణం కాస్త జిడ్డుగా మారిపోతుంది.
ఇలాంటి సందర్భాల్లో అక్కడ మలసేజియా ఫర్ఫర్ అనే ఫంగస్ అభివృద్ధి చెందుతుంది. మాడుపై జిడ్డుజిడ్డుగా ఉండే వాతావరణం దాని పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. దాంతో చుండ్రు వీళ్లలో గ్రీజ్లా గోళ్లలోకి వస్తుంటుంది. కొందరిలో ఇది తెల్లగా కాకుండా ఒకింత పసుపు రంగులోనూ ఉండవచ్చు. ఇక కొందరు తలను అంత పరిశుభ్రంగా ఉంచుకోరు. చాలారోజులకొక సారి తలస్నానం చేస్తుంటారు. ఇక కొందరు ఎక్కువగా ఆటలాడుతూ, వ్యాయామం చేస్తూ ఉండి కూడా తల నుంచి ఎక్కువగా చెమట కారుతున్నా తలస్నానం చేయరు.
మరికొందరు చాలా దూరాలు ప్రయాణాలు చేస్తున్నప్పటికీ తలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోరు. దాంతో వారికి చుండ్రు వచ్చే అవకాశాలు ఎక్కువ. పైగా జిడ్డు చర్మం ఉన్నవారిలో ఇది మొటిమల లాంటి ఇతర సమస్యలూ ఉండి, తలపై చుండ్రు వచ్చే ఆస్కారం అధికం. ఇక పొడి చర్మం ఉన్నవారికి ఇది తెల్లటి పొట్టులా పొలుసులుగా రాలుతుంది. ప్రధానంగా అలర్జీలు, అటోపిక్ డర్మటైటిస్ ఉన్నవారిలో, వృద్ధులలో ఈ సమస్య ఎక్కువ.
చుండ్రు ఎప్పుడు వస్తుంది? ఏ వయసువారిలోనైనా చుండ్రు రావచ్చు. ప్రధానంగా తల్లిలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల ప్రభావితం కావడం వల్ల ఊయలలో ఉండే పిల్లలకూ ఈ సమస్య రావచ్చు. తల శుభ్రత విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోనివారిలోనూ, జ్వరం తగ్గడానికి యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత కూడా కొద్దిగా పెద్ద పిల్లల్లో చుండ్రు వచ్చే అవకాశం ఉంది. ఇక బాల్యం నుంచి కౌమారంలోకి అడుగుపెడుతున్నవారిలో చుండ్రు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా ఇలా జరుగుతుంది. చాలామందిలో ఇది జీవితకాలంలో ఏదో ఒక సమయంలోనైనా వచ్చి పోవడం జరగవచ్చు.
చుండ్రును అరికట్టడం ఎలా? చుండ్రు అనేది పూర్తిగా తగ్గిపోతే తగ్గిపోవచ్చు లేదా మళ్లీ మళ్లీ రావచ్చు. అప్పుడు మళ్లీ చికిత్స తీసుకోవాల్సిందే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చుండ్రును అరికట్టడానికి మార్గాలివి...
క్రమం తప్పకుండా మాడును కడిగేలా తలస్నానం చేస్తూ ఉండాలి. మంచి షాంపూతో కనీసం వారంలో రెండు సార్లయినా తలస్నానం చేస్తుండాలి. ఇక పనుల కోసం దూరప్రయాణాలు చేసేవారు రోజు విడిచి రోజూ తలస్నానం చేయడం కూడా మంచిదే. ఓటీసీ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడటం కూడా మంచిదే. ఒకవేళ ఇలా చేస్తున్నా చుండ్రు తగ్గకపోతే డర్మటాలజిస్ట్ను సంప్రదించి వారు సూచించిన విధంగా యాంటీ ఫంగల్ ఏజెంట్స్, తార్ కాంపౌండ్స్ వంటివి ఉన్న మెడికేటెడ్ షాంపూలు వాడాలి. వీటిని నీళ్లలో పలుచబార్చకూడదు. ఒకసారి తలకు పట్టించాక కనీసం 3-4 నిమిషాల పాటు అవి తమ ప్రభావం చూపేందుకు అలా వదిలేయాలి.
ఆ తర్వాతే కడిగేయాలి. జుట్టురాలుతున్నా లేదా దురద ఎక్కువగా ఉన్నా ఒక్కోసారి స్టెరాయిడ్ బేస్డ్ లోషన్లు కూడా డాక్టర్లు సూచిస్తారు. ఒకవేళ చుండ్రుతో పాటు మొటిమలు కూడా ఉంటే... హార్మోన్లలో ఏవైనా మార్పులు వచ్చాయా అనే పరీక్షలు చేయించాకే తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. చుండ్రు ఉన్నవారు తలకు జిడ్డుగా ఉండే నూనె రాయడం వంటివి చేయకూడదు.
ఒకవేళ నూనె రాయాల్సి వస్తే, నూనె రాసి కొద్దిసేపు ఉంచాక తప్పనిసరిగా షాంపూతో తలస్నానం చేయాలి. జుట్టు పొడవుగా ఉండే మహిళలు తలస్నానం చేశాక దాన్ని ముడుచుకోవడం తగదు. ఎందుకంటే అలాంటి సమయంలో జుట్టులో తేమ చాలాసేపు ఉండి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే వాతావరణానికి అనువుగా ఉంటుంది. అందుకే జుట్టును ఆరేందుకు ఫ్రీగా వదిలేయాలి. విటమిన్-ఏ, జింక్ పాళ్లు ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి.
యాంటీ డాండ్రఫ్ షాంపులు వాడవచ్చా? ఎంతకాలం?
చుండ్రు అనేది దీర్ఘకాలిక సమస్య. కాబట్టి అది ఉన్నంత కాలం యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడటం మేలు. లేదా చుండ్రు మళ్లీ తిరగబెట్టినప్పుడు యాంటీడాండ్రఫ్ షాంపూల వాడకం మళ్లీ మొదలుపెట్టాలి. అవి చాలావరకు సురక్షితమే. అయితే దీర్ఘకాలం పాటు వాడుతున్నప్పుడు ఒక్కోసారి తలను పొడిగా మార్చేయవచ్చు. అలాంటప్పుడు కండిషనర్స్ కూడా వాడటం మంచిది. కొన్ని షాంపూల వల్ల జుట్టు రాలుతున్నట్లు గమనిస్తే వెంటనే షాంపూను మార్చి తమకు సరిపడేది వాడాలి.
పై సూచనలు, జాగ్రత్తలతో చుండ్రును సులభంగా అరికట్టవచ్చు.
చుండ్రు - లక్షణాలు: ఈ సమస్య ఉన్నవారి జుట్టులోంచి తెల్లగా, పొలుసులుగా, పొట్టులా చర్మం రాలిపోతుందన్న విషయం తెలిసిందే. దీనితో పాటు కొందరిలో దురద, వెంట్రుకలు రాలిపోవడం, తలపై ఎర్రటి పొలుసుల్లా కనిపించే మచ్చలు, మాడు ఎర్రబారడం, కొందరిలో ఎర్రటి బొడిపెల్లాంటివి కూడా కనిపించవచ్చు. ఇక కొందరిలో సెబోరిక్ డర్మటైటిస్ అనే కండిషన్ వల్ల మాడుపైనేగాక కనుబొమలు, ముక్కుకు ఇరువైపులా, ముఖం మధ్యభాగాన, ఛాతీమీద, వీపు మీద కూడా పొలుసులుగానూ పొట్టు రాలిపోవచ్చు. లేదా కొందరిలో ఇది గ్రీజ్లాగా ముద్దగా కనిపించవచ్చు. కొందరిలో ఈ సమస్య సోరియాసిస్తో పాటు కలిసి రావచ్చు. అలాంటివారిలో తలపై పొలుసులు రాలిపోవడంతో పాటు చర్మం అంతా ఎర్రగా మచ్చలుగా (ర్యాష్తో) కనిపించవచ్చు.
డాక్టర్ రాధా షా
కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్,
అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్