AP Express
-
కూయకుండానే.. రైలొచ్చి వెళ్లింది
సామర్లకోట: ఎటువంటి అనౌన్స్మెంట్, ప్లాట్‌ఫాంపై డిస్ప్లే లేకుండా సామర్లకోట రైల్వే స్టేషన్లో సోమవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఏపీ ఎక్స్‌ప్రెస్ వచ్చిందని రైలు ప్రయాణికులు ఆరోపించారు. రైలు వచ్చే ముందు బోగీల సమాచారం తెలిసేలా డిస్ప్లేతో పాటు, అనౌన్స్మెంట్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ వచ్చే ముందు ఇవేమీ చేయలేదని, దీంతో రైలు వచ్చిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించి, పిల్లలతో, మహిళలతో పరుగులు తీయాల్సి వచ్చిందని బీజేపీ అనుబంధ యువమోర్చా రాష్ట్ర సభ్యుడు ఎస్ అనిల్‌కుమార్ మంగళవారం ఆరోపించారు. తాము న్యూఢిల్లీ వెళ్లడానికి సోమవారం రాత్రి సామర్లకోట రైల్వే స్టేషన్లో వేచిఉన్నామని తెలిపారు. సమాచారం లేకుండా రైలు వచ్చిందని, డిస్ప్లే లేకపోవడం వల్ల ఏ బోగీ ఎక్కడ వచ్చిందో తెలియక మహిళలు, పిల్లలతో పరుగులు తీశామని చెప్పారు. దీనిపై న్యూఢిల్లీ వెళ్లాక సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్‌ను వివరణ కోరుతామని అనిల్‌కుమార్ స్థానిక విలేకర్లకు ఫోన్లో తెలిపారు. ఈ సంఘటనపై రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్‌ను వివరణ కోరగా, రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బందిపై విచారణ చేస్తామని చెప్పారు. ప్రతి రైలుకు తప్పనిసరిగా అనౌన్స్‌మెంట్‌తో పాటు, బోగీల డిస్ప్లే వేయాల్సి ఉంటుందన్నారు. -
Warangal: ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగీలో పొగలు
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ వద్ద ఏపీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్తుండగా ట్రైన్ S6 బోగీ వద్ద బ్రెక్ జామ్ కావడంతో ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నిలిపివేశారు. భయంతో ప్రయాణికులు ట్రైన్ దిగారు. అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి మంటలు చెలరేగకుండా రైల్వే సిబ్బంది పొగలను అదుపులోకి తెచ్చారు. బ్రేక్ ప్యాడ్స్ జామ్ కావడంతో పొగలు వచ్చినట్లు నిర్ధారించారు. స్టేషన్లో రెండు లైన్లలో ట్రెయిన్లు ఆగడంతో అరగంటసేపు రైళ్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో వచ్చిన పొగలను అదుపు చేసిన అనంతరం ట్రైన్ న్యూఢిల్లీ వెళ్ళిపోయింది. -
ఏపీలో మరో రెండు పాజిటివ్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలో సోమవారం మరో రెండు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి, కాకినాడల్లో ఒక్కోటి చొప్పున నమోదైనట్టు స్పష్టమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు చెందిన 72 ఏళ్ల వ్యక్తి ఈ నెల 17న ఢిల్లీ నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు వచ్చారు. 19న రాజమండ్రికి బస్‌లో వెళ్లారు. ఈ నెల 29న కోవిడ్ లక్షణాలు కనిపించడంతో రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆ వ్యక్తికి కోవిడ్ ఉందని తేలింది. అదే జిల్లాకు చెందిన మరో 49 ఏళ్ల వ్యక్తి ఈనెల 17న ఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి 18న సామర్లకోటకు వచ్చారు. అక్కడ నుంచి కాకినాడలోని ఇంటికెళ్లారు. ఈ నెల 29న కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కాకినాడ పెద్దాస్పత్రిలో చేరగా పరీక్షలు జరిపితే కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ వ్యక్తి ఢిల్లీలో మతపరమైన కార్యక్రమానికి వెళ్లి తిరిగి తన స్నేహితుడితో కలిసి ఏపీకి వచ్చినట్టు గుర్తించారు. దీంతో కోవిడ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 23కు చేరింది. సోమవారం 68 నమూనాలను నిర్ధారణకు పంపించగా, 66 నమూనాలకు కోవిడ్ లేదని తేలింది. రెండు పాజిటివ్ వచ్చాయి. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో 29,405 మంది ఉన్నారని, 262 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. -
ఉలిక్కిపడిన విశాఖ..
సాక్షి, విశాఖపట్నం: ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి ఆదివారం ఉదయం బయలుదేరిన కాసేపటికే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయి. బ్రేక్ పట్టేయ డంతో బీ1 బోగీ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. రైలు నుంచి అంతా దిగిపోయారు. సిబ్బంది వెంటనే రైలు ని లిపివేసి మంటలు ఆర్పేశారు. సమస్య పరిష్కరించడంతో రైలు యథావిధిగా విశాఖకు పయనమైంది. కాగా, ప్రమా ద సంఘటన టీవీల్లో చూసి విశాఖ నగరం ఉలిక్కిపడింది. నగరంలోని ప్రయాణికులు బంధువులు ఆందోళన కు గురయ్యారు. ట్రైన్లో వస్తున్న తమ బంధువుల పరిస్థితి ఎలా ఉంది, తమవాళ్లు ఏమయ్యారోనని ఆరా తీసేందుకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చాలా మంది చేరుకున్నారు. రైల్వే స్టేషన్‌కు ఉదయం నుంచి ఫోన్లు వెల్లువెత్తాయి. ఎవరికీ చిన్నపాటి గాయం కూడా కాలేదని సమాచారం అందించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రైన్ నిర్వహణపై ఆది నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నా ఈస్ట్‌కోస్ట్ అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది మే 21న కూడా ఏపీ ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ సమీపంలో హెటెన్షన్ వైరు నుంచి మంటలు వ్యాపించి బీ6, బీ7 కోచ్‌లలో అగ్రి ప్రమాదంలో చిక్కుకున్నాయి. -
16న న్యూఢిల్లీ–విశాఖపట్నం ఏపీ ఎక్స్‌ప్రెస్ రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సాంకేతిక కారణాల దృష్ట్యా న్యూఢిల్లీ – విశాఖపట్నం మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 16న రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో కె.రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైల్వే ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం తాటిచెట్లపాలెం (విశాఖ): విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే (12727) గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు విశాఖ నుంచి శుక్రవారం సాయంత్రం 5.20కి హైదరాబాద్‌కు బయల్దేరింది. ప్లాట్‌ఫాం దాటిన వెంటనే కేరేజ్ అండ్ వేగన్ రోలింగ్ సిబ్బంది అప్పారావు, వెంకటరావు.. గార్డ్ బోగీలో ఉన్న హ్యాండ్ బ్రేక్ పట్టేయడాన్ని గుర్తించారు. ఈ బ్రేక్ పట్టేయడం వల్ల అప్పటికే ట్రాక్ కొన్ని మిల్లీమీటర్ల మేర గాడి తప్పింది. విషయాన్ని రోలింగ్ సిబ్బంది సూపరిండెంట్ ఇంజనీర్ అచ్యుతరావుకు తెలిపారు. ఆయన వాకీ టాకీ ద్వారా గోదావరి ఎక్స్‌ప్రెస్ గార్డును, డ్రైవర్‌ను అప్రమత్తం చేసి వెంటనే రైలును ఆపాలని ఆదేశించారు. సాంకేతిక సిబ్బంది అక్కడికి చేరుకుని హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి, వాక్యూమ్ క్లియర్ చేసి రైలును పంపించారు. గార్డ్ బోగీ బ్రేక్ పట్టేసిన చిత్రం -
ఇదేం ఏసీ.. ఛీఛీ..
రాజమహేంద్రవరం : న్యూఢిల్లీ నుంచి విశాఖ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీలు పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. న్యూఢిల్లీలో రైలు బయలుదేరినప్పటి నుంచి జనరేటర్లలో లోపాలు ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చినా లోపం సరిచేయలేదని ఆరోపించారు. మూడు బోగీలకు ఒకటి చొప్పున ఏసీలు పని చేయకపోవడంతో చంటి పిల్లలు శ్వాస ఆడక ఇబ్బందులు పడ్డారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో ఏసీలు లేకపోవడంతో బయటి కంటే బోగీల్లోనే వేడి ఎక్కువగా ఉండడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వేడిని భరించలేక కొంత మంది చైన్ లాగి రైలును ఆపేశారు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్న ఈ రైలు ప్రయాణికులు సుమారు మూడు గంటలకు పైగా రైల్వేస్టేషన్లోనే పిల్లలతో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో కొంతమందిని జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో పంపించగా, మరి కొంతమందిని ప్రత్యేక రైలులో 5.30 గంటలకు విశాఖకు తరలించారు. ఈ రైలులో మొత్తం 300 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. శ్వాస ఆడక ఇబ్బందులు పడ్డాం ఢిల్లీ నుంచి ప్రయాణిస్తున్నాను. మొదటి నుంచీ ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేస్తే.. సమస్య తమ పరిధిలో కాదని చెప్పేవారు. ఫోన్ ద్వారా కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేస్తే.. పీఎన్ఆర్ నంబర్ వస్తుందని చెప్పి ఫోన్ పెట్టేసేవారు. రాత్రంతా ఏసీలు పని చేయలేదు. పిల్లలకు శ్వాస ఆడలేదు. మూడు గంటలకు పైగా స్టేషన్లోనే ఉండిపోయాం. రైల్వే అధికారులు ముందుగానే చెక్ చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. –శ్రీనివాస్, విశాఖపట్నం చెమటలు కక్కుతూ ప్రయాణించాం ఏసీలు పని చేయక చెమటలు కక్కుతూ ప్రయాణించాం. అసౌకర్యం భరించలేక కొంతమంది చైన్ లాగి రైలును ఆపేశారు. రైల్వే అధికారులు తప్పు ఉంది కనుక వారిపై కేసులు కూడా పెట్టలేదు. రైల్వే అధికారుల బాధ్యతా రాహిత్యం వల్ల ప్రయాణికులు నరకం చూశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. – ఆర్టీ నాయుడు. విశాఖపట్నం పిల్లలతో ఎంతో బాధపడ్డాం నేను విజయవాడలో ఎక్కాను. ఇద్దరు పిల్లలతో విశాఖపట్నం వెళుతున్నాను. ఏసీలు పని చేయక పిల్లలు ఏడుపు మొదలు పెట్టారు. రైల్వే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా? రైల్వే అధికారులకు డబ్బులు లేకపోతే ప్రయాణికుల వద్ద డొనేషన్లు తీసుకోవాలి. కావాలంటే మేమే ఇస్తాం. అంతేగాని ప్రయాణికులను ఇబ్బందులు గురి చేయరాదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. రైలు ప్రయాణం లేటు అవుతుందని బస్సుకు వెళుతున్నాను. – హైమారెడ్డి, విజయవాడ ప్రయాణికులందరూ ఇబ్బంది పడ్డారు నేను ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళుతున్నా. రైలు బయలుదేరినప్పటి నుంచి ఏసీల్లో లోపం ఏర్పడింది. రైల్వే అధికారులు శ్రద్ధ తీసుకొని ఉంటే ఇంత మంది ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు కాదు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రయాణికులు, పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఇలాంటివి పునరావృతం కాకుండా రైల్వే అధికారులపై చర్యలు తీసుకోవాలి. - బల్వీందర్ సింగ్, న్యూఢిల్లీ