appalayagunta
-
వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ
అప్పలాయగుంట(వడమాలపేట): అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొపిన అర్చకులు శుద్ధి, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన, బలిహరణ శాస్త్రోత్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించగా భక్తులు స్వామివారి సర్వదర్శం చేసుకున్నారు. పండితులు హోమం నిర్వహించారు. సాయంత్రం మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం చేశారు. విశ్వసేనుని పల్లకిలో ఆంజనేయస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ పుట్టమట్టిని తీసుకుని సంప్రోక్షణ చేశారు. అనంతరం ఆ మట్టిని ఆలయానికి తీసుకువచ్చి నవధాన్యాలను మొలకవేసి వైభవంగా అంకురార్పణం జరిపించారు. రాత్రి 9 గంటలకు స్వామివారికి ఏకాంతసేవ జరిగింది. కార్యక్రమంలో ఏఈవో రాధాకష్ణ, సూపరింటెండెంట్ పవన్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరాజు, ఆలయాధికారి శ్రీనివాసులు, షరాబ్ హర్షవర్ధన్, ప్రధానార్చకులు సూర్యకుమారాచార్యులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు అప్పలాయగుంటలో పుష్పయాగం
రేపు అప్పలాయగుంటలో పుష్పయాగం తిరుపతి అర్బన్: వడమాలపేట మండలం అప్పలాయగుంటలో వెలసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అందుకోసం బుధవారం ఉదయం 9 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం, సాయంత్రం 6:30 గంటలకు సేనాపతి ఉత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, అనంతరం 11:30 గంటల వరకు శ్రీదేవి–భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పలురకాల పుష్పాలతో అలంకరించనున్నారని పేర్కొన్నారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించిన పూజలు, కైంకర్యాలు, గత నెలలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ.