Appeal to the center
-
PRE-BUDGET 2023: గోల్డ్ ఈటీఎఫ్‌లకు ప్రోత్సాహమివ్వండి
న్యూఢిల్లీ: ఫండ్స్ ద్వారా పసిడిలో పెట్టుబడులు పెట్టేలా రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు తగు చర్యలు ప్రకటించాలని కేంద్రాన్ని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కోరింది. ఇందుకోసం గోల్డ్ ఈటీఎఫ్‌లపై పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. 2023–24 బడ్జెట్‌కు సంబంధించి ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ ఈ మేరకు తమ ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. వీటి ప్రకారం గోల్డ్ ఈటీఎఫ్‌లు, అలాగే తమ నిధుల్లో 90 శాతానికి మించి పసిడి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసే ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్)పై ప్రస్తుతం 20 శాతంగా ఉన్న దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (ఎల్టీసీజీ)ను ఇండెక్సేషన్ ప్రయోజనంతో 10 శాతానికి తగ్గించాలని కోరింది. ప్రత్యామ్నాయంగా, ఎల్టీసీజీ ట్యాక్సేషన్ ప్రయోజనాలు పొందేందుకు గోల్డ్ ఈటీఎఫ్‌ల హోల్డింగ్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఒక్క ఏడాదికి అయినా తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ‘గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి పసిడి పథకాలకు పన్నుపరమైన ప్రయోజనాలు కల్పిస్తే, ఆర్థికంగా అంతగా సమర్ధమంతం కాని భౌతిక పసిడికి ప్రత్యామ్నాయ సాధనంగా వాటికి ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుంది. భౌతిక రూపంలోని బంగారంలో పెట్టుబడులు తగ్గించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరుతుంది‘ అని యాంఫీ పేర్కొంది. బ్రిటన్ తదితర దేశాల్లో ఇలాంటి విధానాలు అమల్లో ఉన్నట్లు వివరించింది. ఆయా దేశాల్లో పెట్టుబడియేతర బంగారంపై 20 శాతం వ్యాట్ (వేల్యూ యాడెడ్ ట్యాక్స్) విధిస్తుండగా బంగారంలో పెట్టుబడులపై మాత్రం ఉండటం లేదని తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా ఇతరత్రా పసిడి పెట్టుబడుల సాధనాల తరహాలోనే గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తోంది. మరిన్ని ప్రతిపాదనలు.. ► ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్‌వోఎఫ్‌లను కూ డా ఈక్విటీ ఆధారిత ఫండ్స్ పరిధిలోకి చేర్చాలి. ► లిస్టెడ్ డెట్ సాధనాలు, డెట్ మ్యుచువల్ ఫండ్స్‌పై పన్నులు సమాన స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► అలాగే ఇంట్రా–స్కీమ్ మార్పులను (ఒకే మ్యుచువల్ ఫండ్ స్కీమ్ అంతర్గతంగా వివిధ ప్లాన్లు/ఆప్షన్లలోకి పెట్టుబడులను మార్చుకోవడం) ’ట్రాన్స్ఫర్’ కింద పరిగణించరాదు. ఇలాంటి లావాదేవీలకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుండి మినహాయింపునివ్వాలి. ► ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్‌ల (ఈఎల్ఎస్ఎస్) తరహాలోనే చౌకైన, తక్కువ రిస్కులతో పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉండే డెట్ ఆధారిత పొదుపు పథకాలను (డీఎల్ఎస్ఎస్) ప్రవేశపెట్టేందుకు ఫండ్స్‌ను అనుమతించాలి. ► ట్యాక్స్ సేవింగ్ బ్యాంక్ ఎఫ్‌డీల తరహాలోనే అయిదేళ్ల లాకిన్ వ్యవధితో డీఎల్ఎస్ఎస్లో రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు వర్తింపచేయాలి. ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో ఈఎల్ఎస్ఎస్ల్లో రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడులకు సెక్షన్ 80 సీసీసీ కింద పన్ను ప్రయోజనాలు ఉంటున్నాయి. ► ఫండ్ నిర్వహణ కార్యకలాపాలను రిజిస్టర్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు (ఏఎంసీ) బదలాయించేందుకు బీమా కంపెనీలన్నింటినీ అనుమతించాలి. అలాగే బీమా కంపెనీలకు ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసులు అందించడానికి ఏఎంసీలకు కూడా అనుమతినివ్వాలి. ► పింఛన్లకు సంబంధించి ఫండ్ ఆధారిత రిటైర్మెంట్ పథకాలను ప్రవేశపెట్టేందుకు మ్యుచువల్ ఫండ్స్‌కు అనుమతినివ్వాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)కు ఇచ్చే పన్ను ప్రయోజనాలను వీటికి కూడా వర్తింపచేయాలి. బడ్జెట్ సెషన్లో డేటా బిల్లు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడి డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత (డీపీడీపీ) బిల్లు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందగలదని భావిస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. బిల్లు ముసాయిదాలోని నిబంధనలపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఉగ్రవాద, సైబర్ ముప్పులతో పాటు అంతర్జాతీయంగా యుద్ధ విధానాలు మారుతుండటాన్ని పరిగణనలోకి తీసుకునే నిబంధనల రూపకల్పన జరిగిందని మంత్రి చెప్పారు. బిల్లులో ప్రతిపాదించిన పర్యవేక్షణ సంస్థ డేటా ప్రొటెక్షన్ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తిపై వ్యక్తమవుతున్న అనుమానాలను ఆయన కొట్టిపారేశారు. రిజర్వ్ బ్యాంక్, సెబీ వంటి నియంత్రణ సంస్థల తరహాలోనే దీనికి కూడా సంపూర్ణ స్వతంత్రత ఉంటుందని పేర్కొన్నారు. -
రూ.30,571 కోట్ల ప్యాకేజీ ఇవ్వండి
నీతి ఆయోగ్ చైర్మన్‌కు సీఎం కేసీఆర్ లేఖ - మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌కు నిధులివ్వండి - నాలుగేళ్ల గడువుతో ప్రత్యేక ప్యాకేజీ కావాలి - ఎఫ్ఆర్బీఎం రుణపరిమితి - సడలించాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.30,571 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులకు 2015-2019 వరకు వర్తించేలా ఆర్థిక సాయం అందించాలని కోరింది. ఆదిలాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఈ ప్యాకేజీ కోరింది. గతేడాది డిసెంబర్లోనే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పంపింది. జూన్‌లో రాష్ట్రానికి వచ్చిన నీతి అయోగ్ బృందానికి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఆర్థిక సంఘం ప్రకటించడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీగా కోత పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాల్లో చేపట్టే కార్యక్రమాలకు నిర్దిష్టంగా ప్రతిపాదనలు పంపించాలని నీతిఆయోగ్ బృందం సభ్యులు అధికారులకు సూచించారు. దీంతో ఆరు జిల్లాల్లో అమలు చేస్తున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ కార్యక్రమాలకు ఎన్ని నిధులు కావాలో ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రానికి పంపించారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాజాగా నీతిఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగరియాకు గుర్తుచేశారు. గతంలో రాసిన లేఖల ప్రతి, ప్యాకేజీ ప్రతిపాదనలు మరోసారి పంపించారు. మీ దృష్టికి తీసుకొస్తున్నాం.. అప్పులు తెచ్చుకునేందుకు వీలుగా ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి నిబంధనలు సడలించాలని పనగరియకు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. 14 వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం జీఎస్డీపీలో ప్రస్తుతం 3 శాతం ఉన్న ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3.5 శాతానికి పెంచాలని కోరారు. అప్పు- జీఎస్డీపీ నిష్పత్తి జీఎస్డీపీలో 25 శాతం మించకుండా ఉండటం, రెవెన్యూ ఆదాయంలో పది శాతానికి మించకుండా వడ్డీ చెల్లింపులు ఉండటం, మిగులు రెవెన్యూ ఉండటం వంటి నిబంధనలు వర్తించే రాష్ట్రాలకు వార్షిక అప్పుల పరిమితి మరో 0.5 శాతం మేరకు వెసులుబాటు కల్పించాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను గుర్తుచేశారు. కేంద్ర నుంచి వచ్చే పన్నుల వాటా తగ్గినందున ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని పెంచాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరినట్లు ప్రస్తావించారు. రుణ సేకరణకు వెసులుబాటు కల్పిస్తే మౌలిక వసతులకు పెట్టుబడులు సమకూరుతాయని, రాష్ట్రాలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు దోహదపడుతాయని పేర్కొన్నారు.