Army soldier suicide
-
మాజీ సైనికుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : మాజీ సైనికుడి కోటాలో మంజూరైన భూమిని సబ్ డివిజన్ చేయాలని కోరితే.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఓ మాజీ సైనికుడు ఆత్మహత్యకు యత్నించాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరుగు తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్య క్రమంలో రామచంద్ర బ్లేడ్‌తో గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడుఅధికారులు, పోలీసు లు వెంటనే అడ్డుకుని అతడిని సకాలంలో ఆస్పత్రికి తరలించారు. రామచంద్ర మాట్లాడుతూ 2006లో తనతో పాటు మాజీ సైనికులైన మరో ఇద్దరికి వెంకప్పకోట పంచాయతీలో డీకేటీ పట్టాలు మంజూరు చేసినట్టు తెలిపారు. తమ స్థలానికి పక్కనే టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుండటంతో దానికి రోడ్డు అవసరమై కింద ఉన్న ఇద్దరు సైనికుల భూములకు స్కెచ్‌లతో పాటు ఎన్ఓసీని రెవెన్యూ అధికారులు మంజూరుచేసినట్టు తెలిపారు.వారికి ఆనుకుని ఉ న్న తన భూమి సర్వే నంబర్‌ను రీ సర్వేలో భాగంగా తొలగించారని, దీనిపై ఐదేళ్లుగా కార్యాలయం చు ట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆత్మహత్య చేసు కోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తహ సీల్దార్ ఖాజాబీ మాట్లాడుతూ స్కెచ్‌ల ఆధారంగా రామచంద్రకు న్యాయం చేస్తామని తెలిపారు. -
వీరులకు రీతూ బంధన్
మరో మూడు రోజుల్లో అప్యాయతలు, అనుబంధాల మధ్య జరుపుకోనున్న‘రక్షాబంధన్ పండగ’ హడావుడి మొదలైంది. సరికొత్త రాఖీలు మార్కెట్లో కళకళలాడుతుండడంతో...తమ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలి? అందమైన రాఖీలు ఎక్కడ దొరుకుతున్నాయి అని ఆడపడుచులంతా ఓపిగ్గా షాపింగ్ చేస్తుంటే... సూరత్‌కు చెందిన రీతూ రాథీ మాత్రం తన సైనిక సోదరులకు కట్టేందుకు వేల సంఖ్యలో రాఖీలు తయారు చేయిస్తోంది. దేశ ప్రజలను తమ కుటుంబ సభ్యులు, తోబుట్టువులుగా భావించి ప్రాణాలకు లెక్కచేయకుండా పోరాడుతున్న వీర జవాన్లకు రాఖీలు కట్టి గౌరవించాలనుకుంది రీతు. ఈక్రమంలోనే ఏడు వేల రాఖీలను తయారు చేయిస్తోంది. రీతు నడిపిస్తోన్న ‘సోచ్ ఫౌండేషన్’ ద్వారా వితంతువులు, వికలాంగులతో రాఖీలు తయారు చేయిస్తూ వారికి ఉపాధిని కల్పిస్తోంది. వ్యాపార, రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టిన రీతుకు చిన్నప్పటి నుంచి ఇతరులకు సాయం చేయడమంటే ఇష్టం. బీకాం తరువాత ఢిల్లీలోని జేడీ ఇన్స్టిట్యూట్లో ఎక్స్పోర్ట్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనర్ కోర్సు చేసింది. తర్వాత సోమేశ్వర్ డెవలపర్స్ డైరెక్టర్ ఆశిస్ రాఠీని పెళ్లి చేసుకుని ఒక పక్క వ్యాపార పనులు చూసుకుంటూనే, సేవాకార్యక్రమాల దిశగా అడుగులు వేసింది. కోవిడ్ సమయంలో శానిటైజింగ్ మెషిన్‌ను దానం చేయడం, ఫేస్ మాస్కులు పెట్టుకోవడంపై అవగాహన కల్పించడం, ఆహారం లేక అల్లాడుతున్న నిరుపేదల ఆకలి తీర్చడం, ప్రతి ఆదివారం మురికివాడల్లోని పిల్లలకు చదువు చెప్పడం, పోషకాహారం, శానిటరీ పాడ్స్ ఇవ్వడం, వికలాంగులకు మర్మా థెరపీ వంటివి కార్యక్రమాలెన్నింటినో తన టీమ్‌తో చేపట్టింది. గతేడాది ‘ఏక్ సోచ్: ఏక్ ఆత్మనిర్భర్ హిందుస్థాన్ కి ఔర్’ పేరిట ఎన్జీవోని స్థాపించి వివిధ సామాజిక కార్యక్రమాలు చేపడుతూ, నిరుపేదల జీవితాల్లో మార్పులు తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ‘‘మనందరికోసం ప్రాణాలు అర్పిస్తోన్న సైనికుల త్యాగాలను దేనితోనూ పోల్చలేము. అనుబంధాల పండుగనాడు వారికి రాఖీ కట్టి గౌరవించాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏడు వేల రాఖీలను రూపొందిస్తున్నాము, వీటిని వితంతువులు, వికలాంగులతో తయారు చేయించడం ద్వారా వారికి ఉపాధి కలుగుతుంది’ అని రీతు చెప్పింది. -
నా చావుకు టీడీపీ నేతే కారణం
కదిరి: అనంతపురం జిల్లా కదిరికి చెందిన మాజీ సైనికుడు అల్లా బక్ష్ గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ సురయాభాను భర్త బాబ్జానే తన చావుకి కారణమని సూసైడ్ నోట్ రాశాడు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. అల్లా బక్ష్‌కు నేహా ఫంక్షన్ హాల్ దగ్గర సర్వే నం.800లో 12 సెంట్ల స్థలం ఉంది. ఆ పక్కనే 3 సెంట్ల వంక పోరంబోకు స్థలం ఉంది. చైర్మన్ భర్త బాబ్జాన్ ఆ స్థలాన్ని కబ్జా చేసి బినామీ పేర్ల మీద రిజిస్టర్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న అల్లా బక్ష్.. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేయగా బలవంతంగా తరలించేశారు. మనస్తాపం చెందిన అతడు గురువారం ఉదయం తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన భార్య వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించింది. బాబ్‌జాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీకే చెందిన కౌన్సిలర్ మైనుద్దీన్ తదితరులు డిమాండ్ చేశారు. -
ఉరి వేసుకుని ఆర్మీ జవాన్ ఆత్మహత్య
సారంగాపుర్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా బొత్‌కు చెందిన రత్నపురం నరేష్(23) అనే ఆర్మీ జవాన్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మూడేళ్లుగా ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్న నరేష్ గత కొన్ని రోజులుగా విధులకు వెళ్లడం లేదు. ఈనెల 23వ తేదీన ఇల్లు ఒదిలి వెళ్లిపోయాడు. కాగా, సోమవారం ఆయన చించొలి(బి) గ్రామ సమీపంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్మకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.