మరో మూడు రోజుల్లో అప్యాయతలు, అనుబంధాల మధ్య జరుపుకోనున్న‘రక్షాబంధన్ పండగ’ హడావుడి మొదలైంది. సరికొత్త రాఖీలు మార్కెట్లో కళకళలాడుతుండడంతో...తమ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలి? అందమైన రాఖీలు ఎక్కడ దొరుకుతున్నాయి అని ఆడపడుచులంతా ఓపిగ్గా షాపింగ్ చేస్తుంటే... సూరత్‌కు చెందిన రీతూ రాథీ మాత్రం తన సైనిక సోదరులకు కట్టేందుకు వేల సంఖ్యలో రాఖీలు తయారు చేయిస్తోంది. దేశ ప్రజలను తమ కుటుంబ సభ్యులు, తోబుట్టువులుగా భావించి ప్రాణాలకు లెక్కచేయకుండా పోరాడుతున్న వీర జవాన్లకు రాఖీలు కట్టి గౌరవించాలనుకుంది రీతు. ఈక్రమంలోనే ఏడు వేల రాఖీలను తయారు చేయిస్తోంది. రీతు నడిపిస్తోన్న ‘సోచ్ ఫౌండేషన్’ ద్వారా వితంతువులు, వికలాంగులతో రాఖీలు తయారు చేయిస్తూ వారికి ఉపాధిని కల్పిస్తోంది.
వ్యాపార, రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టిన రీతుకు చిన్నప్పటి నుంచి ఇతరులకు సాయం చేయడమంటే ఇష్టం. బీకాం తరువాత ఢిల్లీలోని జేడీ ఇన్‌స్టిట్యూట్‌లో ఎక్స్‌పోర్ట్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనర్ కోర్సు చేసింది. తర్వాత సోమేశ్వర్ డెవలపర్స్ డైరెక్టర్ ఆశిస్ రాఠీని పెళ్లి చేసుకుని ఒక పక్క వ్యాపార పనులు చూసుకుంటూనే, సేవాకార్యక్రమాల దిశగా అడుగులు వేసింది. కోవిడ్ సమయంలో శానిటైజింగ్ మెషిన్‌ను దానం చేయడం, ఫేస్ మాస్కులు పెట్టుకోవడంపై అవగాహన కల్పించడం, ఆహారం లేక అల్లాడుతున్న నిరుపేదల ఆకలి తీర్చడం, ప్రతి ఆదివారం మురికివాడల్లోని పిల్లలకు చదువు చెప్పడం, పోషకాహారం, శానిటరీ పాడ్స్ ఇవ్వడం, వికలాంగులకు మర్మా థెరపీ వంటివి కార్యక్రమాలెన్నింటినో తన టీమ్‌తో చేపట్టింది. గతేడాది ‘ఏక్ సోచ్: ఏక్ ఆత్మనిర్భర్ హిందుస్థాన్ కి ఔర్’ పేరిట ఎన్జీవోని స్థాపించి వివిధ సామాజిక కార్యక్రమాలు చేపడుతూ, నిరుపేదల జీవితాల్లో మార్పులు తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది.
‘‘మనందరికోసం ప్రాణాలు అర్పిస్తోన్న సైనికుల త్యాగాలను దేనితోనూ పోల్చలేము. అనుబంధాల పండుగనాడు వారికి రాఖీ కట్టి గౌరవించాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏడు వేల రాఖీలను రూపొందిస్తున్నాము, వీటిని వితంతువులు, వికలాంగులతో తయారు చేయించడం ద్వారా వారికి ఉపాధి కలుగుతుంది’ అని రీతు చెప్పింది.
వీరులకు రీతూ బంధన్
Published Thu, Aug 19 2021 12:29 AM | Last Updated on Thu, Aug 19 2021 12:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment