స్పీకర్‌పై చీటింగ్ కేసు
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నాబాం రిబియాపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ మహిళను మోసగించిన కేసులో రాష్ట్ర మహిళా కౌన్సిల్ ఇచ్చిన నోటీసులకు స్పీకర్ స్పందించకపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే దోయ్ ముఖ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రిబియా స్థానిక మహిళతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తర్వాత అంటూ దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో వీరి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో గత మూడు నెలల నుంచి ఆ మహిళకు నాబాం రిబియా ముఖం చాటేశాడు. ఫోన్ చేసినా స్పందించడం మానేసాడు.
అంతేకాకుండా ఆ మహిళకు.. ఇతరులతో లైంగిక సంబంధాలున్నాయంటూ ప్రచారం మొదలు పెట్టాడు. దీంతో ఆమె.. మహిళా కౌన్సిల్‌ను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ కౌన్సిల్ సహకారంతో స్పీకర్‌కు లీగల్ నోటీసులిచ్చింది. రిబియా దాంపత్య హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ, దీనిపై వారంలోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. అయినా స్పీకర్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది.
అయితే ఒక రాజకీయ నాయకుడై ఉండి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న రిబియాపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ నేత తాబింగ్ లాంగు డిమాండ్ చేశారు. తమ నోటీసులకు స్పీకర్ స్పందించకపోవడంతో, ఆయనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పెళ్లి పేరుతో మోసం చేయడమే కాకుండా, మహిళను శారీరకంగా మానసికంగా వేధించాడని కౌన్సిల్ పేర్కొంది.