ఈ పెళ్లికి.. పోలీసులే అతిథులు
మైసూర్: కర్ణాటకలోని మైసూర్ నగరంలో సోమవారం ఓ వివాహం జరిగింది. వధూవరులిద్దరూ ఎంబీఏ గ్రాడ్యుయేట్లు. ఈ పెళ్లికి పోలీసులే అతిథులు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు. విషయం ఏంటంటే.. ఇది ప్రేమ వివాహం. అందులోనూ మతాంతర వివాహం. ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. హిందూ సంస్థ కార్యకర్తలు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది లవ్ జిహాద్ అంటూ నిరసనకు దిగారు. దీంతో ఈ పెళ్లికి భద్రత కల్పించేందుకు భారీగా పోలీసులు తరలివచ్చారు.
వధూవరులు ఆషిత, షకీల్లది మాండ్య. వీరి పెళ్లిని వ్యతిరేకిస్తూ వీహెచ్పీ కార్యకర్తలు వధువు ఇంటిముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ పెళ్లి లవ్ జిహాద్ అని, వరుడు షకీల్ వివాహం ద్వారా ఆషితను మతమార్పిడికి ప్రేరేపిస్తున్నాడని మండిపడ్డారు. ప్రేమ అయితే తమకు అభ్యంతరం లేదని, మతమార్పిడికి కుట్ర అని ఆరోపించారు. వీరి ఆరోపణలను వధూవరుల తల్లిదండ్రులు ఖండించారు. 'భారత్లో అందరూ సమానం. నిరసనకారులకు ఈ పెళ్లి ఓ సందేశం. వారు అర్థం చేసుకోవాలి' అని వధువు తండ్రి డాక్టర్ నరేంద్ర బాబు అన్నారు. ఈ పెళ్లి తమకు అమిత సంతోషాన్ని కలిగిస్తోందని వరుడు తండ్రి ముక్తర్ అహ్మద్ చెప్పారు.
చిన్నప్పటి నుంచి ఆషిత, షకీల్లకు పరిచయం ఉంది. మాండ్యలో వీరి కుటుంబాలు పక్కపక్కన ఉంటున్నాయి. స్కూల్ నుంచి కాలేజీ వరకు ఇద్దరూ క్లాస్ మేట్స్. 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఆషిత, షకీల్కు వివాహం నిశ్చయమైందని తెలిసిన వెంటనే హిందూమత కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు ఇటీవల ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ రోజు భారీ భద్రత మధ్య మైసూరులో పెళ్లి చేసుకున్నారు.