Assembly Speaker Madhusudhana Chary
-
సింగరేణిలో మెరుగైన ఆరోగ్య సేవలు
ఆదిలాబాద్: సింగరేణి కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలు అందించనున్నట్లు అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. భూపాలపల్లి ఏరియాలోని మంజూర్‌నగర్ సింగరేణి ఆసుపత్రిలో రూ.4.71 లక్షలతో తయారైన అత్యాధునిక ఐసీయూ అంబులెన్స్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జీఎం పాలకుర్తి సత్తయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ కార్మికుల కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలను అందించటం పట్ల హర్షం ప్రకటించారు. ఏరియా స్థాయిలోనే కాక హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ మెరుగైన చికిత్స చేయిస్తున్నారని చెప్పారు. 1200 కిలోమీటర్ల వరకు ఆక్సిజన్‌ను అందించే అత్యాధునిక అం బులెన్స్‌ను అందుబాటులోకి తీసుకరావటం హర్షణీయమని, అత్యవసర సమయూల్లో కార్మికులకు సంజీవనిగా సహా యపడుతుందని అన్నారు. సింగరేణి సంస్ధ సీఎస్ఆర్ నిధులతో భూపాలపల్లి నగర పంచాయతి పరిధిలో అంతర్గత రోడ్లు, సైడ్ కాల్వలను నిర్మించామని, కేటీపీపీ నుంచి భూపాలపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం, నియోజకవర్గంలో పలు బస్షెల్టర్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సింగరేణి పాలుపంచుకోవటం ఆనందించాల్సిన విషయమన్నారు. భూపాలపలి నగర పంచాయతి పరిధిలోని కార్ల్‌మార్క్స్ కాలనీలో నిర్మించిన రెండు సీసీ రోడ్లు, రాంనగర్లో సైడు కాల్వలను జీఎంతో కలసి స్పీకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణరవి, డిప్యూటీ సీఎంఓ కిరణ్‌రాజ్, పర్సనల్ మేనేజర్ సీతారాం, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్యాంకుమార్, కౌన్సిలర్స్ ఫోరం చైర్మన్ సిరుప అనిల్, టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షులు బడితెల సమ్మయ్య, కేంద్ర కమిటీ కార్యదర్శి ఆగయ్య, కొక్కుల తిరుపతి, ఫిట్ కార్యదర్శి స్రవంతి పాల్గొన్నారు. -
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటేయండి
-
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటేయండి
పార్టీ ఫిరాయించిన వారిపై స్పీకర్‌కు వైఎస్సార్సీపీ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్లో చేరిన మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లుపై అనర్హత వేటు వేసి ఎన్నికలు నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి తెలంగాణ వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. పార్టీ ఫిరాయింపులపై కోర్టు ఉత్తర్వులు వెలువడకముందే చర్య తీసుకోవాలని కోరింది. ఈ మేరకు మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ స్పీకర్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ అంశాన్ని వీలైనంత తొందర్లో పరిశీలిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై చర్య తీసుకోవాలని ఇప్పటికి ఏడుసార్లు స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని, కోర్టులో పిటిషన్ వేశామని చెప్పారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చినందున సొంత ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో సీఎం కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమకు నచ్చిన పార్టీ ప్రతినిధిని ప్రజలు ఎన్నికల్లో గెలిపించుకున్నాక... వారి మనోభావాలను దెబ్బతీస్తూ మరో పార్టీలో చేర్చుకోవడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. టీఆర్ఎస్ 14 ఏళ్లలో అనేక పర్యాయాలు ఉప ఎన్నికలను ఎదుర్కొని.. ఇప్పుడు 11 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. -
స్పీకర్‌కు మరోసారి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. స్పీకర్ తరఫున తాను హాజరుకావడం లేదని, కేవలం కోర్టు సహాయకారిగా మాత్రమే హాజరవుతున్నానని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి చెప్పడంతో.. ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ నుంచి తలసాని, తీగల, చల్లా ధర్మారెడ్డి; కాంగ్రెస్ నుంచి రెడ్యానాయక్, యాదయ్య, కనకయ్య, విఠల్‌రెడ్డి; వైఎస్సార్సీపీ నుంచి మదన్‌లాల్ పార్టీ ఫిరాయించారని, దీనిపై ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదని ఆయా పార్టీల నేతలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం మరోసారి విచారణ జరిపిన ధర్మాసనం ఒక ప్రతిపాదన చేసింది. ఫిరాయింపుల ఫిర్యాదులపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తామే తప్ప, ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోమని... ఇందుకు ఇరుపక్షాల న్యాయవాదులు ఆమోదం తెలపాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో ఏజీ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... ఈ వ్యాజ్యాల్లో తాను స్పీకర్ తరఫున హాజరుకావడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనర్హత వ్యవహారంలో అంతకు ముందు సింగిల్ జడ్జి వద్ద కూడా తాను కోర్టు సహాయకునిగా మాత్రమే వాదనలు వినిపించానని.. ఇప్పుడు కూడా కోర్టు సహాయకుడిగా వాదనలు వినిపిస్తానని చెప్పారు. దీంతో ఏజీ చెప్పిన దానిపై స్పందించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ధర్మాసనం కోరింది. అయితే సింగిల్ జడ్జి వద్ద కోర్టు సహాయకుడిగానే ఏజీ వాదనలు వినిపించారని.. కానీ ధర్మాసనం అంతకు ముందు స్పీకర్‌కు నోటీసులు జారీ చేసినప్పుడు వాటిని స్పీకర్ తరఫున తీసుకునేందుకు ఏజీ అంగీకరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు. దీంతో ఈ ఏడాది మార్చి 3న స్పీకర్‌కు నోటీసులు జారీచేస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ఇచ్చిన ఆదేశాల తాలూకు డాకెట్ ఆర్డర్‌ను ధర్మాసనం పరిశీలించింది. స్పీకర్‌కు నోటీసులు జారీ చేసినట్లు అందులో ఉన్నా.. ఆ నోటీసులను స్పీకర్ అందుకున్నారా, లేదా? అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో మరోసారి స్పీకర్‌కు నోటీసులు పంపాలని నిర్ణయించింది. అనంతరం ఏజీ తన వాదనలను కొనసాగించారు. వాదనలు విన్న ధర్మాసనం.. స్పీకర్‌కు మరోసారి నోటీసులు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.