
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటేయండి
పార్టీ ఫిరాయించిన వారిపై స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లుపై అనర్హత వేటు వేసి ఎన్నికలు నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి తెలంగాణ వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది. పార్టీ ఫిరాయింపులపై కోర్టు ఉత్తర్వులు వెలువడకముందే చర్య తీసుకోవాలని కోరింది. ఈ మేరకు మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ స్పీకర్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ అంశాన్ని వీలైనంత తొందర్లో పరిశీలిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై చర్య తీసుకోవాలని ఇప్పటికి ఏడుసార్లు స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని, కోర్టులో పిటిషన్ వేశామని చెప్పారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చినందున సొంత ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో సీఎం కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించారన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా తమకు నచ్చిన పార్టీ ప్రతినిధిని ప్రజలు ఎన్నికల్లో గెలిపించుకున్నాక... వారి మనోభావాలను దెబ్బతీస్తూ మరో పార్టీలో చేర్చుకోవడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ 14 ఏళ్లలో అనేక పర్యాయాలు ఉప ఎన్నికలను ఎదుర్కొని.. ఇప్పుడు 11 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు.