
స్పీకర్‌కు మరోసారి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. స్పీకర్ తరఫున తాను హాజరుకావడం లేదని, కేవలం కోర్టు సహాయకారిగా మాత్రమే హాజరవుతున్నానని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి చెప్పడంతో.. ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
టీడీపీ నుంచి తలసాని, తీగల, చల్లా ధర్మారెడ్డి; కాంగ్రెస్ నుంచి రెడ్యానాయక్, యాదయ్య, కనకయ్య, విఠల్‌రెడ్డి; వైఎస్సార్‌సీపీ నుంచి మదన్‌లాల్ పార్టీ ఫిరాయించారని, దీనిపై ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదని ఆయా పార్టీల నేతలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం మరోసారి విచారణ జరిపిన ధర్మాసనం ఒక ప్రతిపాదన చేసింది. ఫిరాయింపుల ఫిర్యాదులపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తామే తప్ప, ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోమని... ఇందుకు ఇరుపక్షాల న్యాయవాదులు ఆమోదం తెలపాల్సి ఉంటుందని పేర్కొంది.
దీంతో ఏజీ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... ఈ వ్యాజ్యాల్లో తాను స్పీకర్ తరఫున హాజరుకావడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనర్హత వ్యవహారంలో అంతకు ముందు సింగిల్ జడ్జి వద్ద కూడా తాను కోర్టు సహాయకునిగా మాత్రమే వాదనలు వినిపించానని.. ఇప్పుడు కూడా కోర్టు సహాయకుడిగా వాదనలు వినిపిస్తానని చెప్పారు. దీంతో ఏజీ చెప్పిన దానిపై స్పందించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ధర్మాసనం కోరింది. అయితే సింగిల్ జడ్జి వద్ద కోర్టు సహాయకుడిగానే ఏజీ వాదనలు వినిపించారని.. కానీ ధర్మాసనం అంతకు ముందు స్పీకర్‌కు నోటీసులు జారీ చేసినప్పుడు వాటిని స్పీకర్ తరఫున తీసుకునేందుకు ఏజీ అంగీకరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు.
దీంతో ఈ ఏడాది మార్చి 3న స్పీకర్‌కు నోటీసులు జారీచేస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ఇచ్చిన ఆదేశాల తాలూకు డాకెట్ ఆర్డర్‌ను ధర్మాసనం పరిశీలించింది. స్పీకర్‌కు నోటీసులు జారీ చేసినట్లు అందులో ఉన్నా.. ఆ నోటీసులను స్పీకర్ అందుకున్నారా, లేదా? అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో మరోసారి స్పీకర్‌కు నోటీసులు పంపాలని నిర్ణయించింది. అనంతరం ఏజీ తన వాదనలను కొనసాగించారు. వాదనలు విన్న ధర్మాసనం.. స్పీకర్‌కు మరోసారి నోటీసులు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.