హైకోర్టుకు నటుడు దర్శన్
బెంగళూరు : శాండల్ వుడ్ నటుడు దర్శన్ హైకోర్టును ఆశ్రయించాడు. రాజకాలువ కబ్జాకు పాల్పడి నిర్మించిన రాజరాజేశ్వరి నగర ఐడియల్ హోమ్ లేఔట్ ప్రదేశాన్ని జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వ ఆస్తిగా గుర్తించడాన్ని ప్రశ్నిస్తూ ఆయన న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కాగా దర్శన్ 2,100 చదరపు అడుగుల స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు నిర్మించినట్లు అధికార యంత్రాంగం నివేదిక అందించింది. ఈ నేపథ్యంలో ఈనెల 22న బెంగళూరు జిల్లా యంత్రాంగం ఈ లేఔట్‌లో 44 ఇళ్లకు ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించి బోర్డు పెట్టింది. జిల్లా యంత్రాంగం తీరుపై దర్శన్ హైకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ వేశారు. పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది.
కాగా హలగేవడరహళ్లి గ్రామ సర్వే నెంబరు 38 నుంచి 46 వరకు, సర్వే నెంబరు 51 నుంచి 56 వరకు ఉన్న 7 ఎకరాల 31 గుంటల ప్రభుత్వ భూమి. ఇందులో ఐడియల్‌హోమ్స్ సహకార సంఘం పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా లేఔట్ వేశారు.అందులో 3 ఎకరాల 20 గుంటల స్ధలంలో మొత్తం 32 ఖాళీ స్థలాలు ఉండగా, ఎకరా 38 గుంటల స్థలంలో ఇళ్లు, భవనాలు నిర్మించారు. 22 గుంటల స్థలంలో ఎస్.ఎస్ ఆసుపత్రిని నిర్మించగా ఎకరా 24 గుంటల స్థలం రోడ్డుకు వినియోగిస్తున్నారు.
7 గుంటల స్థలంలో బీబీఎంపీ వాటర్ ట్యాంకు నిర్మించినట్లు జాయింట్ కలెక్టర్ జిల్లా యంత్రాంగానికి నివేదిక అందజేశారు. ఇందుకు సంబంధించి గతంలో దర్శన్కు నోటీసులు కూడా అందాయి. 15 రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో దర్శన్ న్యాయస్థానం మెట్లెక్కాడు.