కోర్టుపై అనుచిత వ్యాఖ్యలా?
♦ న్యాయాధికారి రామకృష్ణపై హైకోర్టు కొరడా
♦ రామకృష్ణకు నోటీసులు..
♦ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పలు కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన న్యాయాధికారి ఎస్.రామకృష్ణపై హైకోర్టు కొరడా ఝుళిపించింది. మీడియా సమావేశం పెట్టి హైకోర్టును, న్యాయమూర్తులును సవాలు చేయడంతోపాటు న్యాయవ్యవస్థ ప్రతి ష్టను దిగజార్చేలా మాట్లాడినందుకు ఆయనపై కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ధిక్కార నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కారం కింద ఎందుకు శిక్షించరాదో స్వయంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించింది. అలాగే ఇకముందు ఆయన, ఆయన అనుచరులుగానీ కోర్టు విచారణలో ఉన్న అంశాలకు సంబంధించి ఎలాంటి పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాలు నిర్వహించకుండా నిషేదాజ్ఞలు జారీ చేసింది. సోషల్ మీడియా ద్వారా కూడా కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఈ ఉత్తర్వుల కాపీని రామకృష్ణకు అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఇప్పటికే నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణతోపాటు ఎవరెవరు పాల్గొన్నారో వారి వివరాలను సేకరించి కోర్టు ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిజిస్ట్రీ ఈ ఉత్తర్వులను ఉభయ రాష్ట్రాల డీజీపీలతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు పంపింది.
ఏసీజేకు లేఖతో..: ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రామకృష్ణ.. హైకోర్టుతో పాటు ఓ సీనియర్ న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటిని కొన్ని టీవీ ఛానెళ్లు (సాక్షి టీవీ కాదు) ప్రసారం చేశాయి. తర్వాత వీటిని మీడియా సమావేశం నిర్వాహకులు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. రామకృష్ణ మాట్లాడిన మాటలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని భావించిన ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సి.నాగేశ్వరరావు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)కు లేఖ రాశారు. ఏసీజే ఈ లేఖను పరిశీలించి దాన్ని సుమోటోగా స్వీకరించి కోర్టు ధిక్కార పిటిషన్‌గా పరిగణించారు. ఈ పిటిషన్‌పై కోర్టు బుధవారం విచారణ జరిపింది..