సిరిసిల్ల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ
♦ ప్రతిపక్ష నేత జానారెడ్డి డిమాండ్
♦ ఎస్పీ విశ్వజిత్పై అట్రాసిటీ కేసులు పెడతాం: భట్టి
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లలో దళితులపై సీసీఎస్ పోలీసులు దాడి చేయడం వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఉందని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి డిమాండ్ చేశారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పీఏసీ చైర్పర్సన్ జె.గీతారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులతో కలసి గాంధీభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పోలీసులు మానవత్వం లేకుండా దళితులను అమానుషంగా కొట్టారని జానారెడ్డి విమర్శించారు. దళితులపై దాడి చేసిన ప్రభుత్వానికి, పోలీసులకు కనువిప్పు కలిగేలా కార్యక్రమాలు చేస్తామన్నారు. దాడి చేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. భట్టి మాట్లాడుతూ 8 మంది దళితులను మఫ్టీలో వచ్చిన పోలీసులు ఈ నెల 4 నుంచి నాలుగు రోజులపాటు పోలీసు స్టేషన్లో అక్రమంగా నిర్బం« దించి కొట్టారన్నారు. ఎస్పీ విశ్వజిత్ మానవత్వానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించారని, ఆయనపై అట్రాసిటీ కేసులు పెడతామన్నారు.
పోలీసుల తప్పులు కప్పిపుచ్చుకునేందుకే...
దళితులపై దాడులకు పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలను తీసుకోవాలని షబ్బీర్ అలీ, జె.గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ డిమాండ్ చేశారు. పోలీసుల తప్పులను కప్పిపుచ్చుకోవడానికే డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇలాంటి అమానుష చర్యలు సిగ్గుచేటని గీతారెడ్డి మండిపడ్డారు. దళిత మహిళలతో అభ్యంతరకరంగా మాట్లాడిన అధికారులపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.