యాదాద్రిలో ‘కాగ్’ తనిఖీలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కాగ్ సంస్థ అధికారులు తనిఖీ లు నిర్వహిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల్లో అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా ఇదే సమయంలో దేవస్థానం ఆడిట్ కార్యాలయానికి తాళం వేసి ఉండడం ప లు అనుమానాలకు తావి స్తోంది. కాగ్ అధికారులు నివేదికలు అడుగుతారని, డొల్లతనం బయటపడుతుందన్న భయంతోనే తాళం వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
యాదగిరికొండ(ఆలేరు) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో రెండు రోజులుగా కాగ్ సంస్థ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించిన అనంతరం నివేదికను ఆడిట్ జనరల్, దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపనున్నట్లు కాగ్ అధికారులు తెలిపారు.
అన్నదానం, ప్రసాద విక్రయశాల, గోదాం, ఆలయం, గోశాల, శానిటేషన్తో పాటు మిగతా అన్ని విభాగాల్లో సుమారు 200 పైళ్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని కాగ్ అధికారులు తెలిపారు.
దేవస్థానం ఆడిట్ కార్యాలయానికి తాళం
దేవస్థానం ఆడిట్ కార్యాలయానికి బుధవారం తాళం వేశారు. కారణాలు తెలియరాలేదు. కాగ్ అధికారులు తనిఖీలు చేపడుతున్న కారణంగా ఆడిట్ కార్యాలయంలోని నివేదికలు అడుగుతారని, డొల్లతనం బయటపడుతుందన్న భయంతోనే తాళం వేశారని విశ్వసనీయ సమాచారం.
సహాయ ఆడిట్ కార్యాలయాన్ని ఆడిట్ కార్యాలయంగా ప్రకటించిన వారం రోజుల్లో రెండుమార్లు తాళం వేయడం అనేక అనుమానాలు, విమర్శలకు తావిస్తోంది. ఎటువంటి ప్రలోభాలకు లొంగబోమని చెప్పిన అధికారులే.. ఆడిట్ కార్యాలయానికి తాళం వేయడం ఎంత వరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.ముందస్తు సమాచారం లేకుండా ఆడిట్ కార్యాలయానికి తాళం వేయడంతో పనుల నిమిత్తం పైళ్లతో వచ్చిన వివిధ విభాగాల అధికారులు వెనుదిరిగారు.