Aunts
-
ఇద్దరు చిన్నారులును కాపాడేందుకు ..ఆ నలుగురు మహిళలు..!
అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారులను కాపాడటం కోసం ఆ నలుగురు అత్తలు చేసిన పని వింటే షాక్‌కి గురవ్వుతారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అత్తలు ఉన్నారా? అనిపిస్తుంది. చెప్పాలంటే.. కుంటంబ బంధాలకు ఇచ్చిన ప్రాముఖ్యత తోపాటు, బాధలో ఉంటే మన అనుకునే వాళ్లకు ఎలా అండగా ఉండాలనేది చాటి చెబుతోంది ఈ కథ. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఫిబ్రవరి 20న పెద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరేళ్ల బాలిక కేకే, నాలుగేళ్ల చిన్నారి దండన్లు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు ఐదు రోజులు కోమాలో ఉన్నారు. శ్వాసకోశ మంట, అవయవ వైఫల్యంతో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆ చిన్నారుల తల్లి మిన్ ఈ విషయాన్ని తన కుంటుంబు సభ్యులకు తెలియజేసింది . పిలల్లను ప్రాణాలు దక్కాలంటే చర్మం, జుట్టు దానం చేయాలని పేర్కొంది. వెంటనే అందుకు ఆమె నలుగురు ఆడపడుచులు ముందుకు రావడమే గాక చర్మాన్ని, జుట్టుని దానం చేశారు. ఆ ప్రమాదంలో చిన్నారుల చర్మం తీవ్రంగా కాలిపోవడంతో ఆ ప్రదేశంలో ఆ మహిళలు దానం చేసిన చర్మన్ని అతికించి సర్జరీ చేస్తారు వైద్యులు. ఈ మేరకు ఆ చిన్నారి తల్లి మాట్లాడుతూ..ఈ విషయం గురించి తన ఆడపడుచులకు చెప్పగానే..వారు ముందుకు వచ్చి సాయం చేశారని సంతోషంగా చెప్పింది. ఇక ఆ ప్రమాదం ఎలా జరిగిందో వివరించింది. తన పిల్లల గదిలో ఎయిర్ కండీషనర్‌ను ఆన్ చేయగానే అకస్మాత్తుగా అది విరిగిపోయి ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకొచ్చింది ఆ చిన్నారుల తల్లి మిన్. ఆ మహిళల తోపాటు ఆ చిన్నారుల తల్లి కూడా చర్మాన్ని, జుట్టుని దానం చేసింది. కాగా, ఆ చిన్నారులకు వెంటనే శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు వైద్యులు.ఈ మేరకు ఆ నలుగురు మహిళలు మాట్లాడుతూ.."మేము నలుగురం ఇలా ఒకేసారి గుండు గీయించుకుంటామని కలలో కూడా అనుకోలేదు. అయినా తమ మేనకోడలు, మేనల్లుడి ప్రాణాలు రక్షించడం కోసం ఏం చేసేందుకైనా తాము సిద్దం అని చెబుతున్నారు." ఆ నలుగురు మహిళలు. ఈ ఐదుగురు మహిళలు ఆస్పత్రి బెడ్‌పై ఆ చిన్నారులను ఒడిలో ఉంచుకుని దిగిన ఫోటోల తోపాటు ఈ విషయం చైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు వండర్ విమెన్ అని ఒకరూ, ఈ ఏడాది అత్యంత అందమైన ఆంటీలు వీరే అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: నటి ఒలివియాకి బ్రెస్ట్ కేన్సర్! ఏకంగా నాలుగు సర్జరీలు..!) -
నేను రోజూ దేవుడ్ని వేడుకునేది ఈ ఒక్కటే!
పదో తరగతి పూర్తవ్వగానే నన్ను ఓ అయ్య చేతిలో పెట్టేశారు అమ్మానాన్నలు. అప్పుడే పెళ్లి వద్దు అని అంటే... నీ భారం తీరిపోతే తమ్ముణ్ని బాగా చదివించవచ్చు అని నా ముఖమ్మీదే అన్నారు నాన్న. పైకి ఏమీ అనకపోయినా, ఆ మాట నన్ను ఎంత బాధపెట్టిందో నాకే తెలుసు. దాంతో నిస్సహాయంగా తలవంచి, అత్తారింటికి వెళ్లిపోయాను. నా భర్తకు, ఆ ఇంట్లోవాళ్లకి నచ్చినట్టుగా ఉండసాగాను. ఓ రోజు మావారు, తన ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పి నన్ను బయటకు తీసుకెళ్లారు. కానీ వెళ్లాక తెలిసింది, అలాంటిదేమీ లేదని. నన్నో పార్కుకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. నా మనసులో ఏముందో చెప్పమని అడిగారు. నాకేమీ అర్థం కాలేదు. ‘ఏమీ లేదే’ అన్నాను. కానీ ఆయన వదిలిపెట్టలేదు. ‘పెళ్లయిన తర్వాత ఏ రోజూ నీ ముఖంలో సంతోషం చూడలేదు, ఎవ్వరికీ ఏ లోటూ లేకుండా చూస్తావ్, కానీ నీకేం కావాలో ఎప్పుడూ చెప్పవ్, నీకేం కావాలి, నువ్వు సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి’ అని అడిగారు. ఆయనకు నా మనసులో ఉన్నదంతా చెప్పాను. చదువుకోవాలన్న బలమైన కోరికను ఎలా చంపుకోవాల్సి వచ్చిందో వివరించాను. ఆయన ఇంటికి తీసుకుపోయారు. ఇంటికొచ్చాక అత్తయ్యని, మావయ్యని ఒప్పించి, వారం తిరిగేసరికల్లా నన్ను కాలేజీలో చేర్పించారు. బడికెళ్లినప్పుడు అమ్మ ఎలా లంచ్‌బాక్సు పెట్టేదో, అత్తయ్య అలా పెట్టేవారు. ఈయనకి ఆఫీసులో లేటైతే, సాయంత్రం మావయ్యగారు వచ్చి ఇంటికి తీసుకెళ్లేవారు. నా పీజీ అయ్యేవరకూ కూడా అందరూ నాకు సాయపడ్డారు. ప్రోత్సహించారు. తర్వాత నేను ఓ కాలేజీలో లెక్చరర్‌గా చేరాను. ఇప్పటికీ అదే వృత్తిలో ఉన్నాను. నా సంతోషం కోసం, నాకంటూ ఓ ఐడెంటిటీని ఇవ్వడం కోసం అదంతా చేశారు మావారు, అత్తమామలు. ఎన్ని జన్మలెత్తినా ఆయనే నా భర్తగా రావాలి. వాళ్లే నాకు అత్తమామలు కావాలని నేను రోజూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. - సంగీత, నిజామాబాద్