నేను రోజూ దేవుడ్ని వేడుకునేది ఈ ఒక్కటే!
పదో తరగతి పూర్తవ్వగానే నన్ను ఓ అయ్య చేతిలో పెట్టేశారు అమ్మానాన్నలు. అప్పుడే పెళ్లి వద్దు అని అంటే... నీ భారం తీరిపోతే తమ్ముణ్ని బాగా చదివించవచ్చు అని నా ముఖమ్మీదే అన్నారు నాన్న. పైకి ఏమీ అనకపోయినా, ఆ మాట నన్ను ఎంత బాధపెట్టిందో నాకే తెలుసు. దాంతో నిస్సహాయంగా తలవంచి, అత్తారింటికి వెళ్లిపోయాను. నా భర్తకు, ఆ ఇంట్లోవాళ్లకి నచ్చినట్టుగా ఉండసాగాను.
ఓ రోజు మావారు, తన ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పి నన్ను బయటకు తీసుకెళ్లారు. కానీ వెళ్లాక తెలిసింది, అలాంటిదేమీ లేదని. నన్నో పార్కుకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. నా మనసులో ఏముందో చెప్పమని అడిగారు. నాకేమీ అర్థం కాలేదు. ‘ఏమీ లేదే’ అన్నాను. కానీ ఆయన వదిలిపెట్టలేదు. ‘పెళ్లయిన తర్వాత ఏ రోజూ నీ ముఖంలో సంతోషం చూడలేదు, ఎవ్వరికీ ఏ లోటూ లేకుండా చూస్తావ్, కానీ నీకేం కావాలో ఎప్పుడూ చెప్పవ్, నీకేం కావాలి, నువ్వు సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి’ అని అడిగారు. ఆయనకు నా మనసులో ఉన్నదంతా చెప్పాను. చదువుకోవాలన్న బలమైన కోరికను ఎలా చంపుకోవాల్సి వచ్చిందో వివరించాను. ఆయన ఇంటికి తీసుకుపోయారు.
ఇంటికొచ్చాక అత్తయ్యని, మావయ్యని ఒప్పించి, వారం తిరిగేసరికల్లా నన్ను కాలేజీలో చేర్పించారు. బడికెళ్లినప్పుడు అమ్మ ఎలా లంచ్‌బాక్సు పెట్టేదో, అత్తయ్య అలా పెట్టేవారు. ఈయనకి ఆఫీసులో లేటైతే, సాయంత్రం మావయ్యగారు వచ్చి ఇంటికి తీసుకెళ్లేవారు. నా పీజీ అయ్యేవరకూ కూడా అందరూ నాకు సాయపడ్డారు. ప్రోత్సహించారు. తర్వాత నేను ఓ కాలేజీలో లెక్చరర్‌గా చేరాను. ఇప్పటికీ అదే వృత్తిలో ఉన్నాను. నా సంతోషం కోసం, నాకంటూ ఓ ఐడెంటిటీని ఇవ్వడం కోసం అదంతా చేశారు మావారు, అత్తమామలు. ఎన్ని జన్మలెత్తినా ఆయనే నా భర్తగా రావాలి. వాళ్లే నాకు అత్తమామలు కావాలని నేను రోజూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
- సంగీత, నిజామాబాద్