అత్తారింటికే కన్నమేశాడు!
పామిడి: అంగన్వాడీ కార్యకర్త ఇంటిలో చోరీ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. అత్తింటికే మేనల్లుడు కన్నమేశాడు. రూ.లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు, ఏటీఎం కార్డు అపహరించుకెళ్లాడు. వివరాలను మంగళవారం సాయంత్రం పామిడి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాడిపత్రి డీఎస్పీ చైతన్య వెల్లడించారు. మంగళవారం ఉదయం పామిడి 44వ జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ యువకుడు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి యువకుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో గత నెల 17న పామిడిలో నివాసముంటున్న గజరాంపల్లి అంగన్వాడీ కార్యకర్త శైలజ కుమారి ఇంటిలో రూ. లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డు, నగదు అపహరించుకెళ్లిన విషయం వెలుగు చూసింది. యువకుడిని గజరాంపల్లికి చెందిన నరిగమ్మగారి రఘునాథరెడ్డిగా గుర్తించారు. శైలజ కుమారికి మేనల్లుడవుతాడు.
ఈ నెల 17న శైలజ కుమారి విధుల నిమిత్తం గజరాంపల్లికి చేరుకున్నప్పుడు ద్విచక్ర వాహనంపై పామిడిలోని అత్తింటికి చేరుకుని తలుపు తాళం బద్ధలుగొట్టి బీరువా తెరిచి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేలతో పాటు ఏటీఎం కార్డు అపహరించుకెళ్లాడు. బంగారు ఆభరణాలను పామిడిలో విక్రయించేందుకు వస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డు స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్ట్‌లో చొరవ చూపిన పామిడి సీఐ ఈరన్న, ఎస్ఐ చాంద్‌బాషా, సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు.