ఖమ్మం: అత్తింటికే ఆ అల్లుడు కన్నం వేశాడు. ఆపై పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ వైనం ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన భూక్య లచ్చా జీసీసీ జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె, అల్లుడు కూడా స్థానికంగానే ఉంటున్నారు. అయితే, అల్లుడు లకావత్ శ్రీను మామ ఇంట్లో చోరీకి పథకం వేసుకున్నాడు. అందులో భాగంగానే ఆ ఇంటికి సంబంధించి మారు తాళం చెవి తయారు చేయించి సిద్ధంగా ఉంచుకున్నాడు. కాగా, అత్తింటి కుటుంబసభ్యులంతా కలసి తిరుపతి బయలుదేరగా అతడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. అదేరోజు ఆ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. భూక్య లచ్చా కుటుంబసభ్యులు ఈనెల 17వ తేదీన తిరుపతి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వేసిన తాళం వేసినట్లుగానే ఉండగా బీరువాలో ఉన్న రూ.7 లక్షల విలువైన 27 తులాల బంగారు ఆభరణాలు, రూ.24 వేల నగదు చోరీకి గురయ్యాయి. దీంతో ఆయన 18వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాహన తనిఖీలు చేస్తుండగా లకావత్ శ్రీను నగలు విక్రయించేందుకు వెళ్తూ దొరికిపోయాడు. విచారణలో అతను దొంగతనం నేరాన్ని అంగీకరించాడు.