క్రెడిట్ కార్డు లిమిట్ పెంపా.. ఇలా చేయండి..
క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. వీరిలో చాలా మంది వారి కార్డు క్రెడిట్ లిమిట్ పెరిగితే బాగుండేదని ఒక్కసారైన అనుకొనే ఉంటారు. కస్టమర్ విరివిగా కార్డును వినియోగిస్తూ, బిల్లులను సక్రమంగా చెల్లిస్తూ ఉంటే కార్డు జారీ కంపెనీలు, బ్యాంకులు ఆటోమేటిక్‌గానే క్రెడిట్ లిమిట్‌ను పెంచుకుంటూ వెళ్తాయి. క్రెడిట్ లిమిట్‌ను పెంచుకోవాలంటే ముందుగా మనకు కావాల్సింది.. మంచి క్రెడిట్ స్కోర్. అలాగే క్రమానుగత సక్రమ చెల్లింపులు, ఆదాయంలో పెరుగుదల వంటి అంశాలు కూడా క్రెడిట్ లిమిట్ పెంపులో కీలకపాత్ర పోషిస్తాయి.
వీటిని గుర్తించుకోండి
తొందరపడొద్దు: క్రెడిట్ కార్డు తీసుకున్న రెండు, మూడు నెలలకే క్రెడిట్ లిమిట్ కోసం కార్డు జారీ సంస్థలకు విజ్ఞప్తులు పంపించొద్దు. కనీసం ఆరు నెలల సమయం వరకు వేచి ఉండండి. సాధారణంగా కార్డు జారీ సంస్థలే క్రెడిట్ కార్డు లిమిట్‌ను ఆటోమేటిక్‌గా పెంచుతాయి. పెంచే వరకు ఎదురు చూడటం ఉత్తమం.
మరీ ఎక్కువ అడగొద్దు: సంస్థలు ఆరు నెలలు దాటినా కూడా మీ లిమిట్‌ను పెంచకపోతే అప్పుడు వాటికి లిమిట్‌ను పెంచమని విజ్ఞప్తి పెట్టండి. ఇక్కడ లిమిట్‌ను రెట్టింపు చేయండని అడగొద్దు. 15-20 శాతం పెంచమని కోరండి. మరీ ఎక్కువ పెంచమని అడిగితే అది మీకు ఇబ్బందులు తేవొచ్చు.
కార్డును విరివిగా వాడండి: క్రెడిట్ కార్డును విరివిగా ఉపయోగిం చండి. అంటే క్యాష్ ఇచ్చే ప్రతి చోటా కార్డు ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే వచ్చే నెలవారీ బిల్లులను సక్రమంగా చెల్లించండి. ఇలా చేస్తే కార్డు జారీ సంస్థలు లిమిట్ పెంచే అవకాశముంది.
జాగ్రత్త సుమీ...
క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉంది కదా.. అని ఇస్టానుసారంగా కొనుగోలు జరపడం మంచిది కాదు. శక్తికి మించి వస్తువులను కొం టే.. ఆ తర్వాత బిల్లు చెల్లింపు కష్టమౌతుంది. బిల్లులు సక్రమంగా చెల్లించకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవాలి. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. క్రెడిట్ లిమిట్ అనేది మన చెల్లింపుల శక్తికి సమానంగా ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ ఎక్కువ ఖర్చు చేయడానికి క్రెడిట్ లిమిట్‌ను పెంచుకోకూడదు. ఇలాచేస్తే అసలుకే ముప్పు రావొచ్చు.