అరచేతిలో అన్నీ..
ఏదో పనిమీద ఊరికి వెళ్తారు.. అప్పుడు గుర్తొస్తుంది.. అరె ఇంట్లో ఫ్యాన్, లైట్లు ఆన్ చేసి వచ్చామే అని. టీవీ చూస్తుంటాం.. బయటి నుంచి శబ్దాలు వస్తుంటాయి.. అబ్బా ఎవరైనా ఆ తలుపు మూసేస్తే బాగుండూ అనుకుంటాం.. ఇవే కాదు చాలా సందర్భాల్లో ఇలా చాలా మందికి అనిపించి ఉంటుంది కదా... ఇలాంటి వాటన్నింటికీ ఓ పరిష్కారంగా వచ్చేసింది. ‘బి.వన్’. అవును దీని సాంకేతికత సాయంతో ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. మీ ఇంట్లోని ఫ్యాన్లు, ఏసీలు ఆన్ లేదా ఆఫ్ చేసేయొచ్చు. ఒకే ఒక్క మాటతో టీవీలో మీకిష్టమైన సినిమా ప్రత్యక్షం అయ్యేలా చేయొచ్చు. ఆ వెంటనే.. కిటికీ తెరలు మూసుకుపోయి.. ఇంటిలో వెలుతురు తగ్గించుకునేలా చేసుకోవచ్చు. అబ్బో ఇదంతా కావాలంటే ఖర్చు బాగానే అవుతుందిగా.. అనే కదా మీ డౌటు.. అంతేం అవసరం లేదండి బాబోయ్ అంటో బ్లేజ్ ఆటోమేషన్ అనే కంపెనీ. బి.వన్ ఈజీ పేరుతో ఓ యూనివర్సల్ రిమోట్‌ను విడుదల చేసింది ఆ సంస్థ. మధ్యతరగతి వారికి కూడా దీన్ని చాలా చౌకగా, అందుబాటులోకి తెచ్చింది.
చేసింది హైదరాబాద్‌లోనే..
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బ్లేజ్ ఆటోమేషన్ శుక్రవారం బి.వన్ ఈజీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక్క మాటలో చెప్పా లంటే ఈ గాడ్జెట్ సార్వత్రిక రిమోట్ కంట్రోలర్ అన్నమాట. మన టీవీ రిమోట్ కంట్రోలర్ ముందువైపు ఉండే ఎర్రటి బల్బు చూసే ఉంటారు. పరారుణ కాంతి (ఇన్ఫ్రారెడ్) ఆధారంగా పనిచేస్తాయి ఈ రిమోట్లు. ఒక్కో రిమోట్‌కు ఒక్కో ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. బి.వన్ ఈజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 2 లక్షల గాడ్జెట్ల కోడ్లను గుర్తించి తదనుగుణంగా పనిచేస్తుంది. అంటే ఏ కంపెనీకి చెందిన టీవీ, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్ అయినా సరే.. వాటిని ఓ స్మార్ట్‌ఫోన్ యాప్ సాయంతో ప్రపంచంలోని ఏ మూల నుంచైనా నియంత్రించొచ్చు. ఇంటర్నె ట్ ఆధారిత గాడ్జెట్ల అవసరం లేకుండా ప్రస్తుతమున్న వాటినే స్మార్ట్‌గా మార్చేందుకు ఓ ప్లగ్ అభివృద్ధి చేసినట్లు సంస్థ సీఈవో పొనుగుపాటి శ్రీధర్ తెలిపారు.
మనం చెప్పినట్లే వింటుంది..
ఉదాహరణకు ఇంట్లో ప్రస్తుతమున్న రిఫ్రిజిరేటర్‌ను స్మార్ట్‌ప్లగ్ ద్వారా కనెక్ట్ చేస్తే, అది ఎంత కరెంటు వాడుతుందన్న వివరాలతో పాటు మనం నిర్దేశించిన ప్రకారం ఆన్/ఆఫ్ చేయొచ్చు. అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్‌లతో కూడా పనిచేస్తుంది కాబట్టి.. వాటిద్వారా ఇచ్చే మాటలతోనూ పనులు చేసుకోవచ్చు. ప్రస్తుత అంచనాల ప్రకారం బి.వన్ ఈజీతో రెండు బెడ్రూమ్ల ఇంటి ఆటోమేషన్‌కు రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకూ ఖర్చు అవుతుందని తెలిపారు. ఇప్పటి వరకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లలో మాత్రమే అందుబాటులో ఉన్న బి.వన్ ఈజీ ఈ నెల నుంచి భారత్‌లోనూ అందుబాటులోకి రానుందని సంస్థ చైర్మన్ వల్లూరి అర్జున్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 25 వేల ఇళ్లల్లో బ్లేజ్ ఆటోమేషన్ వ్యవస్థలు పనిచేస్తున్నాయని, భారత్‌లో ప్రస్తుతం 3,500 అపార్ట్మెంట్లలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
బి.వన్ ఈజీతో ఏమేం చేయొచ్చు?
డిజిటల్ తాళంతో ఇంటికి ఎవరు.. ఎప్పుడు వచ్చారన్నది గమనించొచ్చు. నేరుగా తాళం తెరవడంతో పాటు అవసరమైతే కొంత సమయం వరకే వ్యక్తులను లోపలికి అనుమతించేలా నియంత్రించవచ్చు. కమాండ్‌తో కొన్ని పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగేలా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. గుడ్‌నైట్ అనగానే.. కర్టెన్లు మూసుకుపోవడం.. ఏసీ ఆన్ అవడం, బెడ్‌ల్యాంపులు వెలగడం వంటివి చేసుకోవచ్చు. కదలికలను గుర్తించేందుకు మోషన్ సెన్సర్, తలుపు తెరిచి ఉందా.. మూసి ఉందా.. వంటి వాటిని గుర్తించేందుకు ఇంకో గాడ్జెట్నూ బ్లేజ్ రూపొందించింది. – సాక్షి హైదరాబాద్