Aviation Academy
-
అమెరికా జాబ్ వదిలి స్వదేశానికి.. అంతలోనే...
పైలట్ కావాలన్నది ఆమె చిన్ననాటి కల. తన స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అమెరికాలో ఉద్యోగాన్ని సైతం వదులుకుని స్వదేశానికి తిరిగివచ్చారు. తన కల నేరవేరే సమయంలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు మహిళా శిక్షణ పైలట్ మహిమా గజరాజ్ (29). మరి కొన్ని నెలల్లోనే పైలట్ శిక్షణ ముగుస్తుందనగా ఆమె అనూహ్యంగా దుర్మరణం చెందడం విషాదం. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ సమీపంలో శనివారం జరిగిన ప్రమాదంలో మహిమ మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆమెకు.. బాల్యం నుంచే పైలట్ కావాలని కోరిక. పీజీ పూర్తైన తర్వాత అమెరికా ఉద్యోగంలో చేరారు. పైలట్ కావాలన్న సంకల్పంతో అమెరికాను వదిలి స్వదేశానికి తిరిగివచ్చారు. భర్త పరంథామన్, కుటుంబ సభ్యులను ఒప్పించి పైలట్ శిక్షణలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రైట్ బ్యాంక్ సమీపంలో ఉన్న ఫ్లైటైక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలో గత ఐదారు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నారు. ట్రైనింగ్‌లో చేరిన నెల రోజుల్లోనే చాలా వరకు మెలకువలు నేర్చుకుని.. బెస్ట్ ట్రైనీగా నిలిచారు. మహిమకు తోడుగా ఆమె తల్లి, భర్త.. రైట్ బ్యాంక్ సమీపంలోనే నివసిస్తున్నారు. విషాదం వెంట విషాదం కొద్ది రోజుల క్రితమే మహిమ తండ్రి గజరాజ్.. కరోనా బారిన పడి కన్నుమూశారు. ఇంతలోనే మరో విషాదం చోటు చేసుకోవడంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే శిక్షణలో చురుకైన అభ్యర్థిగా ఉన్న మహిమ.. ప్రమాదానికి గురికావడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు 85 గంటలు విమానంను నడిపారని, ఇందులో 25 గంటలు సింగిల్‌గా నడిపిన అనుభవం ఉందని ఫ్లైటైక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీ సీఈవో మమత తెలిపారు. ఊహాగానాలు వద్దు.. వాస్తవాలు కావాలి ప్రమాదం ఎలా జరిగిందన్న వానిపై వాస్తవాలు వెల్లడించాలని మహిళ గజరాజన్ భర్త పరంథామన్ కోరారు. భర్తను, ఒక్కగానొక్క కూతురిని పోగొట్టుకుని తన అత్తగారు కుప్పకూలిపోయారని చెప్పారు. ప్రమాదం జరిగిన రూట్లో ఇంతకుముందు కూడా తన భార్య విమానం నడిపారని, కానీ ఇప్పుడు ఏమైందనేది తమకు తెలియాలని అన్నారు. తమ ప్రశ్నలకు సమాధానాలు కావాలన్నారు. అక్టోబర్ చివరినాటికి ట్రైనింగ్‌లో చేరే నాటికే థియరీ పూర్తైందని, 185 ఫైయింగ్ అవర్స్ కోసం శిక్షణకు వచ్చినట్టు చెప్పారు. ఏప్రిల్/మే నాటికి ట్రైనింగ్ పూర్తి చేయాలని మహిమ అనుకుందని వెల్లడించారు. అదంతా అబద్దం ఆన్లైన్ ట్రేడర్‌గా పనిచేస్తున్న పరంథామన్ కూడా గతంలో పైలట్‌గా శిక్షణ తీసుకున్నారు. అయితే ఆయన పైలట్ శిక్షణ పూర్తిచేయలేకపోయారు. మహిమ నాలుగు నెలల గర్భిణి అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. ‘ఇదంతా అవాస్తవం. నా భార్య గర్భంతో ఉంటే విమానం నడిపే సాహసం ఎందుకు చేయనిస్తాం?’అని ప్రశ్నించారు. కాగా, శిక్షణ విమానం కుప్పకూలిన దుర్ఘటనపై డీజీసీఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో వెల్లడవుతాయని భావిస్తున్నారు. -
కమర్షియల్ పైలట్‌గా ఎంపికైన కరీంనగర్ విద్యార్థిని.. రూ.4 లక్షల కోసం..
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): పేదింటిలో పుట్టినా తన చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది.. డిగ్రీ పైనలియర్ చదువుతూనే పైలట్ కావాలన్న తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసింది.. కాంపిటీటివ్ పరీక్ష రాసి, కమర్షియల్ పైలట్‌గా ఎంపికైంది. కానీ ఫీజు చెల్లించేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది కేశవాపూర్‌కు చెందిన పాతకాల స్పందన. వివరాల్లోకి వెళ్తే.. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ గ్రామానికి చెందిన పాతకాల సదయ్య–రమ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు స్పందన వరంగల్‌లోని సోషల్ వెల్ఫేర్ డీగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతూ ఎలాగైనా పైలట్ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్ష రాసింది. అందులో సత్తా చాటి, కమర్షియల్ పైలట్‌గా ఎంపికైంది. శిక్షణ కోసం బేగంపేటలోని తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో చేరింది. కానీ పూర్తి శిక్షణ కోసం రూ.4 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసి, కూలి పని చేసుకునే తన తల్లిదండ్రులకు అంత మొత్తం చెల్లించలేరని ఆవేదన చెందుతోంది. దాతలు స్పందించి, ఆర్థికసాయం చేస్తే పైలటవుతానని వేడుకుంటోంది. -
ఇక డ్రోన్ల వినియోగం మరింత సులభతరం
సాక్షి, న్యూఢిల్లీ: నమ్మకం, స్వీయ ధృవీకరణ, చొరబడని పర్యవేక్షణ ప్రాతిపదికన దేశంలో డ్రోన్లను సులభంగా వినియోగించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ ముసాయిదా నియమాలను జారీ చేసింది. మానవ రహిత విమాన వ్యవస్థ(యూఏఎస్) నిబంధనలు-2021లో పేర్కొన్న 25 ఫారంలతో పోల్చితే దేశంలో డ్రోన్లను ఆపరేట్ చేయడానికి నింపాల్సిన ఫారంల సంఖ్యను ఆరుకు తగ్గిస్తూ ఈ ముసాయిదా నిబంధనలను రూపొందించారు. మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 ఈ ఏడాది మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చింది. డ్రోన్ నియమావళి-2021 నోటిఫై అయితే దేశంలో మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 స్థానంలో అమలవుతుంది. ముసాయిదా నిబంధనలలో రుసుమును నామమాత్ర స్థాయికి కుదించారు. అలాగే డ్రోన్ పరిమాణానికి, దీనితో సంబంధం ఉండదని ముసాయిదా తెలిపింది. నిర్ధిష్ట ప్రమాణాల ధ్రువీకరణ పత్రం, నిర్వహణ ధ్రువీకరణ పత్రం, దిగుమతి క్లియరెన్స్, ఇప్పటికే ఉన్న డ్రోన్ల అంగీకారం, ఆపరేటర్ అనుమతి, ఆర్అండ్ డీ సంస్థ అధీకృత ధ్రువీకరణ, విద్యార్థి రిమోట్ పైలట్ లైసెన్స్ సహా వివిధ ఆమోదపత్రాల అవసరాన్ని ముసాయిదా నియమావళి రద్దు చేసింది. విమానాశ్రయం చుట్టూ 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్యలో 400 అడుగుల వరకు, గ్రీన్ జోన్లలో 400 అడుగుల వరకు ఎగిరేందుకు అనుమతి అవసరం లేదని ముసాయిదా నిబంధనలు పేర్కొన్నాయి. డ్రోన్ల బదిలీ, రిజిస్ట్రేషన్ కోసం సులభమైన ప్రక్రియను సూచించాయి. చిన్న డ్రోన్లకు (వాణిజ్యేతర ఉపయోగం కోసం), నానో డ్రోన్లు, ఆర్అండ్డీ సంస్థలకు పైలట్ లైసెన్స్ అవసరం లేదని నిబంధనలు పేర్కొన్నాయి. సరుకు డెలివరీ కోసం డ్రోన్ కారిడార్లు అభివృద్ధి చేయనున్నట్టు, దేశంలో డ్రోన్ స్నేహపూర్వక నియంత్రణ పాలనను సులభతరం చేయడానికి డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు ముసాయిదా తెలిపింది. డ్రోన్ శిక్షణ, పరీక్షల నిర్వహణ అధీకృత డ్రోన్ పాఠశాల నిర్వహిస్తుంది. శిక్షణ ప్రమాణాలను, డ్రోన్ పాఠశాలల పర్యవేక్షణ, ఆన్లైన్లో పైలెట్ లైసెన్స్‌ల జారీ వంటి అంశాలను డీజీసీఏ అమలుచేస్తుంది. ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీచేసే అధికారాన్ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లేదా దాని పరిధిలోని అధీకృత సంస్థలు కలిగి ఉంటాయి. తయారీదారు స్వీయ ధ్రువీకరణ మార్గం ద్వారా డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో వారి డ్రోన్‌కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య పొందవచ్చు. ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఆగస్టు 5లోగా తెలియపరచవచ్చని నియమావళి పేర్కొంది. దేశంలో నమోదు చేసుకున్న విదేశీ యాజమాన్యంలోని కంపెనీల డ్రోన్ కార్యకలాపాలకు ఎటువంటి పరిమితి ఉండదని ముసాయిదా పేర్కొంది. డిజిటల్ స్కై ప్లాట్‌ఫాం వ్యాపార–స్నేహపూర్వక సింగిల్–విండో ఆన్లైన్ వ్యవస్థగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది. -
పుట్టపర్తిలోఏవియేషన్ అకాడమీ
మూడు నె లల్లో ప్రారంభం: సీఎం చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఏవియేషన్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 150 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ అకాడమీని మూడు నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు. బుధవారం రాత్రి ఆయన నగరంలోని ఓ హోటల్లో వివిధ విమానయాన సంస్థల ప్రతినిధులతో సమావేశమై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి. అశోక్ గజపతిరాజు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ర్టంలో వైమానిక రంగ ప్రగతి, విమానాశ్రయాల ఏర్పాటు, పరిశ్రమ అభివృద్ధికి గల అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలోని భోగాపురం, దగదర్తి, దొనకొండ, నాగార్జునసాగర్, కుప్పంలలో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, అనంతపురంలో డిఫెన్స్, ఏరోస్పేస్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు.