అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఏవియేషన్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
మూడు నె లల్లో ప్రారంభం: సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఏవియేషన్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 150 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ అకాడమీని మూడు నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు. బుధవారం రాత్రి ఆయన నగరంలోని ఓ హోటల్‌లో వివిధ విమానయాన సంస్థల ప్రతినిధులతో సమావేశమై ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి. అశోక్ గజపతిరాజు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ర్టంలో వైమానిక రంగ ప్రగతి, విమానాశ్రయాల ఏర్పాటు, పరిశ్రమ అభివృద్ధికి గల అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలోని భోగాపురం, దగదర్తి, దొనకొండ, నాగార్జునసాగర్, కుప్పంలలో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, అనంతపురంలో డిఫెన్స్, ఏరోస్పేస్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు.