ayuta chandi yagam
-
వేద రుక్కులు ఒక్క గొంతుతో..
హైదరాబాద్: ఐదురోజులుగా కొనసాగుతున్న అయుత మహాచండీయాగం నేడు జరిగే మహాపూర్ణాహుతి కార్యక్రమంతో పూర్తి కానుంది. ఈ మహాక్రతువు తుది ఘట్టానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పదిహేను వందలమంది రుత్విజులు చతుర్వేదసంహితలతో వేదరుక్కులను ఒక్క గొంతుతో ఉదానుదాత్త స్వరయుక్తంగా పఠించనుండటం మహాహోమపూర్ణాహుతిలో విశేషం కానుంది. విశ్వశాంతి, విశ్వకళ్యాణం, తెలంగాణ ప్రజల సౌభాగ్యం మహాసంకల్పంగా పూర్ణాహుతి సుసంపన్నం కానుంది. అయుత చండీయాగానికి సమాపనంగా జరుగుతున్న పూర్ణాహుతికి జగద్గురువు శృంగేరీ శారదాపీఠాధిపతి శ్రీ భారతీతీర్థస్వామీజీ తన ఆశీర్వచనాలతో పాటు కావాల్సిన హోమద్రవ్యాలను, వస్ర్తాలను ఇప్పటికే పంపించారు. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టు వస్త్రాలను పంపించారు. వీటిని ధరించి నేడు కేసీఆర్ యాగంలో పాల్గొననున్నారు. పూర్ణాహుతిక్రమమిదే.. ఉదయం 7 గంటలనుంచి పూర్ణాహుతి హోమం ప్రారంభమైంది. పదకొండు వందల మంది రుత్విక్కులు మూలమంత్రాన్ని జపిస్తూ పాయసం, నెయ్యి సమర్పిస్తూ హోమం జరుపుతున్నారు. యాగశాలలో మధ్యభాగంలో ఏర్పాటు చేసిన దుర్గాచక్రం, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మిల సన్నిధిలో మధ్యకుండంలో చండీహోమపూర్ణాహుతి జరుగనున్నది. పూర్ణఫలాలు, పువ్వులు, నవధాన్యాలు, సమిథలు, పట్టువస్ర్తాలు, కొబ్బరికాయలు, సుగంధద్రవ్యాలను పూర్ణాహుతి ద్రవ్యాలుగా ఉపయోగించనున్నారు. మధ్యాహ్నానికి హోమ పూర్ణాహుతి జరుగనున్నట్లు ప్రధాన రుత్విజులు తెలిపారు. అయుతచండీయాగంలో పూర్ణాహుతికి ముందుగా తప్పనిసరిగా నిర్వహించాల్సిన విష్ణుహోమాన్ని, విష్ణుహోమ పూర్ణాహుతిని కూడా పూర్తి చేసినట్టు వివరించారు. యాగ నిర్వహణలో భాగంగా శనివారం నాటికి నాలుగువేల కిలోల నెయ్యి, 12 క్వింటాళ్ల క్షీరాన్నం, 30 టన్నుల సమిథలను హోమద్రవ్యాలుగా వినియోగించారుగించామన్నారు. ఆదివారం ఉదయం భగవత్పాదులు ఆదిశంకరాచార్య సూచించిన నిమమావళి ప్రకారం చతుర్వేదసంహితలతో కూడిన మహారుద్రహోమాలకు పూర్ణాహుతి జరుగుతుందని పేర్కొన్నారు. గురు ప్రార్దన, పుణ్యాహ వచనము, కుండ సంస్కారము, ప్రధాన కుండములో అగ్ని ప్రతిష్టా, అగ్ని విహరణము, స్థాపిత దేవతా హవనము, సపరివార అయుత చండీయాగం, అయుత లక్ష నవాక్షరీ, ఆజ్యాహుతి, మహా పూర్ణాహుతి, వసోర్దారా, కుమారీ, సుహాసినీ, దంపతీపూజ, మహా మంగళ హారతి, ఋత్విక్ సన్మానము, కలశ విసర్జనము, అనబృధ స్నానము, మహాదాశీర్వచనము, ప్రసాద వితరణము వంటి కార్యక్రమాలతో మొత్తం యాగం సంపూర్ణమవుతుంది. నేటి ప్రత్యేక అతిథులు.. అయుత చండీయాగానికి రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ రానుడడంతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంక్షలు కూడా విధించారు. చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. -
చండీయాగానికి రాష్ట్రపతి
-
చండీయాగానికి రాష్ట్రపతి
మెదక్: అయుత మహా చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్లనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.35గంటలకు ఆయన యాగ క్షేత్రం ఎర్రవెల్లికి చేరుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎర్రవల్లిలో ఉదయం నుంచే ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3గంటలకు అయుత మహా చండీయాగం ముగియనుంది. నేటి రాత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎర్రవల్లిలోనే బసచేయనున్నారు. సోమవారం వేముల వాడ ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. -
తొలిరోజు ముగిసిన చండీ మహాయాగం
ఎర్రవల్లి: మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అయుత చండీ మహాయాగం తొలిరోజు ముగిసింది. తిరిగి గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుంది. బుధవారం ఉదయం 7.45 గంటలకు మొదలైన ఈ మహాక్రతువు రాత్రి 8 గంటల సమయంలో తొలిరోజు పూజలు ముగిశాయి. శృంగేరీ పండితులతోపాటు మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 2 వేల మంది రుత్వికులు ఈ సందర్భంగా గురుపూజ నిర్వహించారు. నేటి నుంచి ఆదివారం వరకు (ఐదు రోజుల పాటు) ఈ క్రతువు కొనసాగనుంది. అయుత చండీ మహాయాగం తొలి రోజున జరిగిన పూజల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులతోపాటు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి బొసాలే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్ రావు తదితరులు హాజరయ్యారు. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం గురువారం రెండో రోజు జరగనున్న కారక్రమంలో కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ పాల్గొంటారు. -
ఆయుత చండీ మహాయాగం ప్రారంభం .
-
ఆయుత చండీ మహాయాగం ప్రారంభం
ఎర్రవల్లి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అయుత చండీ మహాయాగం ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7.45 గంటలకు మొదలైన ఈ మహాక్రతువు ఆదివారం వరకు (ఐదు రోజుల పాటు) సాగనుంది. ఇందుకు మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కె.చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రంలో అన్ని ఏర్పాట్లుచేశారు. తొలుత కేసీఆర్ దంపతులతో గౌరీ పూజ చేయించిన వేదపండితులు.. అనంతరం వారిని ప్రధాన యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఆ తర్వాత యాగశాలలోనికి తోడ్కొని వెళ్లారు. యాగం ప్రారంభమైన కొద్దిసేపటికే గవర్నర్ నరసింహన్ దంపతులు అక్కడికి చేరుకున్నారు. సీఎం దంపతులు వారికి సాదర స్వాగతం పలికారు. శృంగేరీ పండితులతోపాటు మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 2 వేల మంది రుత్వికులు ఈ సందర్భంగా గురుపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖుల రాక అయుత చండీ మహాయాగం తొలి రోజున జరిగే పూజల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులతోపాటు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి బొసాలే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ పాల్గొంటారు. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం 24న కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, 25న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగ ర్రావు, 26న తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలతోపాటు పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు రానుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు యాగాన్ని వీక్షించేందుకు దాదాపు 50 వేల మంది భక్తులు తరలివస్తారని అంచనా. వీరందరికీ సరిపడేలా అమ్మవారి పసుపు కుంకుమ, ప్రసాదంతో పాటు అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. 5 వేల మంది భక్తులు ఒకేసారి ప్రదక్షిణగా వెళ్లి యాగాన్ని వీక్షేంచేలా యాగశాల చుట్టూరా బారికేడ్లతో మార్గాన్ని నిర్మించారు. ఈ ఏర్పాట్లన్నింటినీ సీఎం స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. అయుత చండీ మహాయాగానికి శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి తన ఆశీర్వచనాలతో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. శృంగేరీ జగద్గురు మహా సంస్థానం పండితుల ఆధ్వర్యంలోనే యాగం నిర్వహించేందుకు అంగీకారం తెలుపుతూ.. ఈ యాగానికి నరహరి సుబ్రహ్మణ్య భట్టు ప్రధాన ఆచార్యులుగా, తంగిరాల శివకుమార శర్మను వాచకులుగా పంపించారు. మహారుద్ర యాగానికి ఆచార్యులుగా పురాణం మహేశ్వరశర్మ, యాగ పర్యవేక్షకులుగా శివసుబ్రహ్మణ్య అవధాని, గోపికృష్ణ శర్మ, ఫణి శశాంక్‌శర్మ వ్యవహరిస్తున్నారు. యాగంలో 1,100 మంది రుత్వికులు ఏకకంఠంతో పారాయణాలు చదవనున్నారు. మరో 400 మంది రుత్వికులు వారికి సహాయం చేయనున్నారు.