తొలిరోజు ముగిసిన చండీ మహాయాగం
ఎర్రవల్లి: మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అయుత చండీ మహాయాగం తొలిరోజు ముగిసింది. తిరిగి గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుంది. బుధవారం ఉదయం 7.45 గంటలకు మొదలైన ఈ మహాక్రతువు రాత్రి 8 గంటల సమయంలో తొలిరోజు పూజలు ముగిశాయి. శృంగేరీ పండితులతోపాటు మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 2 వేల మంది రుత్వికులు ఈ సందర్భంగా గురుపూజ నిర్వహించారు. నేటి నుంచి ఆదివారం వరకు (ఐదు రోజుల పాటు) ఈ క్రతువు కొనసాగనుంది.
అయుత చండీ మహాయాగం తొలి రోజున జరిగిన పూజల్లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులతోపాటు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి బొసాలే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్ రావు తదితరులు హాజరయ్యారు. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం గురువారం రెండో రోజు జరగనున్న కారక్రమంలో కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ పాల్గొంటారు.