సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
నేను కూడా వస్తా..
ధూంధాంగా గృహప్రవేశాలు చేద్దాం
వసతులన్నీ సమకూరాకే డబుల్ బెడ్రూంల్లోకి..
అభివృద్ధికి నమూనాగా రెండు గ్రామాలు నిలవాలి
ఎర్రవల్లి-నర్సన్నపేట గ్రామస్తులతో సీఎం కేసీఆర్
గజ్వేల్/జగదేవ్‌పూర్: ‘ఇండ్ల నిర్మాణం కొంచెం ఆలస్యమైంది. అయినా సరే ఇండ్లపై ట్యాంకుల నిర్మాణం, నల్లా కనెక‌్షన్లు.. ఇలా పూర్తిస్థాయి సౌకర్యాలు సమకూరాకే గృహ ప్రవేశాలు చేసుకుందాం. నేను కూడా వస్తా. పెద్ద పండుగ జేసుకుందాం.’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని మీనాక్షి కన్‌స్ట్రక‌్షన్స్ బాధ్యుడు బాపినీడుకు సభాముఖంగా సూచించారు. బుధవారం జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో నూతనంగా నిర్మించిన ఫంక‌్షన్‌హాల్లో ఎర్రవల్లి-నర్సన్నపేట ఆదర్శ గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ రెండు గ్రామాలను నమూనాగా చూపాలనే సంకల్పానికి ప్రజలంతా అండగా నిలవాలన్నారు. మిమ్మల్ని చూసి రాష్ట్ర ప్రజలు ఎన్నో విషయాలు నేర్చుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం సంఘటిత శక్తితో రెండు గ్రామాల ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ‘సర్కారే మీ వెనుకుంది. పట్టుబడితే సాధించలేనిదంటూ ఉండదు.’ అని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూనే దానికి అనుబంధంగా పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. తద్వారా కుటుంబాల్లో ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు.
‘నిన్న గ్రామం చుట్టుపక్కల ఉన్న మసిరెడ్డికుంట, ఎర్రకుంట, పాండురంగసాగర్ చెరువులన్నీ తిరిగిన.. నీళ్లు చూస్తే కడుపు నిండింది. ఇప్పటి నుంచి మనకు అన్నీ శుభఘడియలే.. మల్లన్నసాగర్ పూర్తై రెండేళ్లలో ఇక్కడికి గోదావరి జలాలొస్తాయి. 365 రోజులు మన చెరువులు, కుంటలల్ల నీళ్లుంటయ్. కరువుండదు. మన బతుకులకు ఢోకా ఉండదు’ అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో ఆర్థిక క్రమశిక్షణ రావాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్ జిల్లా అంకాపూర్ మాదిరిగా ఇంటి ఆర్థిక వ్యవహారాలన్నీ మహిళలకు అప్పగించి వారి బాటలో నడవాలని సూచించారు. మహిళలు పొదుపుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఖర్చును తగ్గించే అవకాశముంది కాబట్టి ఆ కుటుంబం చల్లగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల అభివృద్ధి కమిటీలు ఇక్కడ చేపట్టే పనుల విషయంలో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
కట్టుబట్లు దాటితే జరిమాన
రెండు గ్రామాల ప్రజలు గ్రామ కట్టుబాట్లు దాటితే జరిమానా వేసుకునే విధంగా గ్రామ వీడీసీ ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. ‘కులం, మతం, చిన్నపెద్ద తేడా లేదు అంత ఒక్కటే. ప్రతి పనిలో కలిసిమెలిసి ముందుకు నడవాలి’ అని సీఎం పేర్కొన్నారు. ‘మన ఐక్యతను మొక్కజొన్న చేను కొట్టేయడంతో మొదలుపెట్టాలని, అంతాకలిసి గ్రూపులుగా ఏర్పడి పంటలు కోసుకోవాలి’ అని సూచించారు. తక్షణమే గ్రామాల్లో అందరూ మాట్లాడుకుని మహిళలు, పురుషులతో కమిటీలు వేసుకోవాలన్నారు.
వైస్-చాన్స్‌లర్ ప్రవీణ్‌రావుకు సన్మానం
ఎర్రవల్లి-నర్సన్నపేట గ్రామాల్లో సామూహిక వ్యవసాయ విధానానికి తనదైన పాత్ర పోషిస్తూ రైతులకు అండగా నిలుస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-చాన్స్‌లర్ ప్రవీణ్‌రావును ఘనంగా సత్కరించారు. రెండు గ్రామాల వ్యవసాయాభివృద్ధికి ప్రవీణ్‌రావు కృషి ప్రశంసనీయమని సీఎం కొనియాడారు.
అదే విధంగా గ్రామంలో సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి చేసిన ఇరిగేషన్‌శాఖ కన్సల్టెంట్ మల్లయ్యను సైతం సీఎం సత్కరించారు. ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తూ రెండు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు.
కల్యాణ మండలం పరిశీలన
సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 3:03 గంటలకు సభాస్థలికి చేరుకుని ప్రక్కనే ఉన్న కల్యాణ మండపాన్ని పరిశీలించారు. 3:06 నిమిషాలకు సీఎం ప్రసంగం ప్రారంభించి.. 3:42 గంటలకు ముగించారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. పోలీసులు ఎర్రవల్లి చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలను రానివ్వలేదు.
ఈ సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్, జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, గడా ఓఎస్డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్టీఓ ముత్యంరెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ కన్సల్టెంట్ మల్లయ్య, ఎంపీపీ ఎర్ర రేణుక, ఎర్రవల్లి సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, నర్సన్నపేట సర్పంచ్ బాల్‌రెడ్డి, ఎంపీటీసీ భాగ్యమ్మ, జెడ్పీటీసీ ఎంబరి రాంచంద్రం, ఎర్రవల్లి గ్రామాభివృద్ధి కమిటీ బాధ్యులు కిష్టారెడ్డి, తుమ్మ కృష్ణ పాల్గొన్నారు.